3366* వ రోజు ....           27-Jan-2025

  సింగిల్ యూజ్ ప్లాస్టిక్ సామాన్లు వద్దేవద్దు! నారచేతి సంచులు ముద్దే ముద్దు!!

3366* రోజుల శ్రమదానం సంగతులు  

         ఈ సోమవారం వేకువ శ్రమదాతలు పట్టుమని 2 డజన్ల మంది. చోటేమో పెదకళ్ళేపల్లి బాటలోని  సాయి సత్య HP గ్యాస్ కంపెనీ ప్రాంతం.

         సుమారు 2 గంటల – 2 డజన్ల – వివిధ వయస్కుల -  రకరకాల – దిక్కుమాలిన మురికి పనులీవిధంగా ఉన్నవి.  

         సాధారణంగా ఎక్కడ స్వచ్చ కార్యకర్తలైనా ఏదో తేలికపాటి చీపుళ్ళు పుచ్చుకుని, మహా ఐతే 2-3 డిప్పలు తీసుకుకుని చేయగలిగినంత వీధి ఊడుపులు చేసి సంబర పడుతుంటారు.  

         కానీ చల్లపల్లి లో సంగతి అది కాదే! వాళ్లు చలో, మంచో, వానో, ఎండో ఏదైనా సరే – ఎప్పుడు మేల్కొంటారో గానీ ఠంచనుగా 4:15 అయ్యే సరికల్లా ఆ నాటి పని స్థలానికి చేరుకుంటారు. దీనిలో ఏ వయో – లింగ బేధాలు ఉండనే ఉండవు. ఇక పని సంగతంటారా క్రొత్తవాళ్ళు నమ్మరు గానీ మహిళా కార్యకర్తలు మురుగు కాల్వల్లో దిగి శుభ్రపరుస్తుంటారు.  

         ఇక పెద్ద పెద్ద డాక్టర్లేమో చెత్త ట్రాక్టర్ నడపడమో, ట్రక్కులోకిఎక్కి నానా దరిద్రపు కాలుష్యాల్ని సర్దుతుంటారు.

         ఈ పనులు చాలక ఎక్కడ రోడ్లకు గుంటలుంటే వాటిని పూడ్చి వాహనాల భద్రతకు హామీ ఇస్తుంటారు. రోడ్ల అంచులలో పల్లాలు ఉండి నీరు నిలుస్తాయనుకుంటే ఎంత రద్దునైనా మోసుకొచ్చి వాటిని పూడ్చి రోడ్డు భద్రతకు నమ్మకం ఇస్తారు.

         ఈ చెత్త చెదారాలన్నీ వీళ్ళ పుణ్యమా అని ఏరోజుకారోజు గ్రామ ప్రధాన చెత్త కేంద్రానికి తరలిపోతుంటాయి.

         ఈ 27 వ జనవరి రోజైనా ఈ స్వచ్చ కార్యకర్తల చేష్టలు ఇవే!

         వీధి కాలుష్యాలు కనబడితే ఏరోజైనా వాళ్ళ ప్రతి స్పందన ఇలాగే ఉంటుంది.

         ఇక 6:30 ప్రాంతంలో ఎప్పటిలాగే ఈ ఉద్యమ రధసారధి ఈనాటి శ్రమదానాన్ని సమీక్షించడమూ, పెద్ద కృష్ణకుమారి అనబడే కొండపల్లి కృష్ణకుమారి నినాదాలు ప్రకటించడమూ,     

         రేపటి శ్రమదానం కూడా ఇదే వీధిలో సాయి సత్య H.P. గ్యాసు కంపెనీ వద్ద నుండే మొదలగునని నిర్ణయించడమూ జరిగిపోయినది.

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

   27.01.2025