సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల్ని – వాడబోం! వాడబోం!
నార చేతి సంచుల్నే - వాడతాం! వాడతాం!!
3376* వ శ్రమ కూడా శివరాంపురం రోడ్డుకే సమర్పితం!
ఇది గురువారం (6.2.25) వేకువ 4.18 సమయం, తమ గ్రామ స్వచ్చ – శుభ్ర – సౌందర్యాలకు భరోసానిస్తూ పెదకళ్ళేపల్లి బాటలోని జాతీయ రహదారి దగ్గరగా మంచులో పనిలో దిగేందుకు సంసిద్ధులుగా స్వచ్చ సైనికులనబడే 10 మంది; క్రమంగా వచ్చి, వాళ్లతో జట్టు కట్టిన మరో 16 గురు; చేసిన ఘనకార్యాలు:
1) రోడ్డుకు 2 ప్రక్కల డ్రైనుల్లో చెత్తా చెదారాలు, ప్లాస్టిక్ దరిద్రాలు, గాజు బుడ్లు, త్రాగేసిన కొబ్బరి బొండాలు, అడదిడ్డంగా పెరిగిపోతున్న కలుపు మొక్కలు, తీగలు వగైరాల్ని ఏరి, కోసి, రోడ్డు పైకి లాగడమూ, ట్రాక్టరులో నింపడమూ,
2) ఇంకా - ఎక్కడ ఏ కొడవలి, గొర్రు వాడి శ్రమిస్తే వీధి మరింత అందంగా మారుతుందో, ఏ పూల మొక్కల కొమ్మలు కత్తిరించాలో, మొక్కల పాదుల్ని ఎంతగా చక్కదిద్దాలో చూసి, ఆ పనికి దిగడమా,
3) “అసలిదేమిటి? రోడ్డైతే వేశారు – 2 ప్రక్కలా పల్లంగా వదిలేస్తే బారీ వాహనాల వల్ల దెబ్బతినదా?” అని ఏడెనమండుగురు పారలు - పలుగులూ పట్టి మట్టి త్రవ్వి, మోసి, సర్ది, రోడ్డును గట్టి పరచి, విశాలంగా మార్చి, సంతుష్టులైపోవడమూ,
4) వీధి దుమ్మూ, ఆకులూ చూసి ఓర్వలేక నలుగురు చీపుళ్లకు పని చెప్పి, శుభ్రపరచడమూ,
5) “త్వరలో వచ్చేది మహాశివరాత్రి - పెదకళ్లేపల్లికి వెళ్లే వచ్చే భక్తవరులకు ఈ బాట నయన మనోహరంగా లేకపోతే ఎలా?” అని కలిసికట్టుగా 2 వారాలుగా పనుల్లో మునగడమూ,
6) 6.35 కాగానే, కాఫీలు ముగించి, నాగభూషణం గారింటి ముంగిట గంధం బృందావనుని విస్పష్ట స్వచ్చోద్యమ నినాదాలకు దీటుగా బదులీయడమూ,
7) రేపు సాయంత్రం పద్మావతీ ఆస్పత్రిలో 6.00 కు వీడియో ప్రదర్శనలని గ్రహించడమూ,
8) రేపటి వేకువ శివరాంపురం వీధిలోని NH-216 వద్ద కలవాలని నిర్ణయించుకోవడమూ!
ఏకాదశ వసంతాల
మహిళలైన పిల్లలైన మహామహోద్యోగులైన
చేయదగిన - చేయవలయు శ్రమదానం ఇదేననీ
దాని ఫలితమద్భుతమని, భవిత రాచమార్గమనీ
ఏకాదశ వసంతాల ఈ ఉద్యమ సారాంశం!
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
06.02.2025