సింగిల్ యూజ్ ప్లాస్టిక్ సామాన్లు వద్దేవద్దు!
నారచేతి సంచులు ముద్దే ముద్దు!!
3389* రోజుల అసాధారణ శ్రమదానం!
అది బుధవారం( 19-2-25) వేకువ 4.20 - 6.20 మధ్యస్త సమయానిది; పదకొండేళ్ల, 4 లక్షల పనిగంటల ఆ కష్టం ఎంత విశిష్టమైనదో - ఎందుకు అసాధారణమైనదో ‘జై స్వచ్చ చల్లపల్లి సైన్యం’ వాట్సప్ పాఠకులందరికీ తెలుసు!
ఈ ఒక్క నాటి వేకువ 2 గంటల - 35 గురు కార్యకర్తల శ్రమ, సమయదానాల్ని గురించి ప్రస్తుతం మాట్లాడుకొందాం.
ముందుగా ఊరికి దూరాన - శివరాంపురం సమీపాన – పంట బోదె వంతెన దగ్గర మంచులో డజను మంది యుద్ధ సంసిద్ధులైన దృశ్యాన్ని చూడండి; మరో 19 మంది - 3 గ్రామాల నుండి విచ్చేసిన స్వచ్చ కర్మిష్టులనూ వాట్సప్ పని చిత్రాలలో గమనించండి.
కత్తులో – కొడవళ్ళో – పలుగూ పారలో - చీపురూ దంతెలో - ఆయా చోట్ల పనుల అవసరాన్ని బట్టి చేత ధరించి, వంతెన నుండి ఉత్తరం రోడ్డుకు 2 వైపులా - వంగీ, కూర్చొనీ, మట్టి దిబ్బను త్రవ్వి, డిప్పల్తో మోసి, రోడ్డు మార్జిన్ గుంటలు పూడుస్తూనో –
గడ్డి - పిచ్చి మొక్కల్ని హతమారుస్తూనో - గతంలో తామే నాటి, బ్రతికించి, పెంచిన చెట్లను సుందరీకరిస్తూనో - 5-6 గురు 150 గజాల వీధిని ఊడుస్తూనో - 5 గురైతే వ్యర్ధాల్ని ప్రోగులు చేసి ఎత్తుతూనో -
“బాట తూర్పున 4 గురు వీధి మార్జిన్ ను అద్దంలా చేస్తూనూ - ఇద్దరు ప్లాస్టిక్ వ్యర్ధాల్ని సంచుల కెత్తుతూనో –
కొందరు నిశ్శబ్దంగానూ, కోడూరు వంటి వారు సందడిగానూ, ఒకరిద్దరు జోకులు వేస్తూనూ.....
గంటన్నరకు పైగా ఎలా శ్రమిస్తున్నారో – ఎందుకు శ్రమలోనే ఆనందం పొందుతున్నారో ఆరా తీయండి!
ఈ స్వార్ధరహిత శ్రమసందడి ఒక్క శివరాంపురం దగ్గరే అనుకొనేరు – అక్కడ 3 కిలోమీటర్ల దూరాన ఒక సీనియర్ డాక్టరమ్మా ఇంకో పంతులయ్యా, ఇద్దరు - ఆకుల, దేసు సుందరీకర్తలు సంత బజారును రంగురంగుల బొమ్మలతో నింపుతున్నారు! వాళ్ళ -
వాళ్ళకానందం మరి!
అంజయ్య మహాశయుడి నినాదాలతో మొదలైన తుది సభ నేటి స్వచ్చ శ్రామికులకు DRK గారి ప్రశంసలతోనూ, నిన్న మాజీమంత్రి కామినేని, NIRD ఏడుకొండలు గార్ల సందర్శనా సంగతులతోనూ ముగిసింది.
కనెక్టికట్ సురేశ్ నాదెళ్ల ఐక్యరాజ్యసమితిలో మొన్న ఇచ్చిన స్వచ్చ సుందర చల్లపల్లి శ్రమదానం ప్రెజెంటేషన్ అక్కడి వారి ప్రశంసలందుకొన్న సంగతి కూడా ప్రస్తావనకొచ్చింది.
రేపటి పనిపాటులు సైతం P.K. పల్లి రోడ్డు – శివరాంపురం వంతెన నుండే మొదలు!
ఇంకా మారని సోదర గ్రామస్తులను
ఇన్నాళ్లుగ – ఇన్నేళ్లుగ శ్రమ వింతలు చూస్తున్నా –
పలు మార్పులతో గ్రామం కళకళలాడుతు ఉన్నా –
శ్రమత్యాగధనులిందరి సాహసాలు చూస్తున్నా –
ఇంకా మారని సోదర గ్రామస్తుల నేమనాలి?
- నల్లూరి రామారావు
18.02.2025