సింగిల్ యూజ్ ప్లాస్టిక్ సామాన్లు వద్దేవద్దు!
నారచేతి సంచులు ముద్దే ముద్దు!!
అక్షరాలా 3390* వ నాటి 36 మంది శ్రమ సౌందర్యం!
అది గురువారం (20-2-25) వేకువ 4.15 - 6.22 మధ్య - 2 గంటలకు పైగా - 36 మంది శ్రమ నైపుణ్యమన్న మాట! శ్రమ ఈ 36 మందిలో ఎవరి సొంతానికీ కాదు, వాళ్ల నైపుణ్యం పాతిక వేలమంది చల్లపల్లీయులకూ, అంతకు మించిన భక్తులు 26 వ తేదీ క. ప. రహదారిలో సంతోషంగా పయనించేందుకూ!
స్వచ్ఛ చల్లపల్లి తొలి దశలో :
“ఏమిటి ఈ కార్యకర్తలింతగా పరస్పర గౌరవ ప్రేమాభిమానాలు చూపుకొంటారూ – ఒకరిపట్ల మరొకరికింత జాగరూకతా?” అనిపించేది. పది - పదకొండేళ్ల తర్వాత కూడా ఆ ఆప్యాయతలు పెరిగాయి గాని తగ్గలేదు!
మొన్న చల్లపల్లిని సందర్శించి వెళ్లిన మాజీమంత్రివర్యులూ, మహా మానవతా వాదీ కామినేని శ్రీనివాసు గారితో సహా N.R.I. లకూ, పెద్దలకూ ఇదే ధర్మసందేహమట! –
“ఒక ఊర్లో ఉండి, రోజూ 2 గంటలు కలిసుండే వాళ్లెవర్లోనైనా మరీ ఇంత ఆప్యాయతానురాగాలెలా సాధ్యం?” అని!
స్వచ్ఛ కార్యకర్తల్లోని ఈ మేలిమి గుణమూ, నిస్వార్ధతా, తమ శ్రద్ధను తోటి కార్యకర్తలతో బాటు గ్రామ ప్రజల పట్ల కూడా విస్తరించడమూ చూసే గదా - ఈ స్వచ్ఛ సుందరోద్యమ సారధి ప్రతిరోజూ పరమానందభరితుడౌతున్నది?
చల్లపల్లి ప్రజానీకం పట్ల ఎంత నిబద్ధత లేకపోతే వీళ్లీ పూట పొగమంచులో ఇంతింత దూరం వచ్చి,
- యాభై - అరవై డిప్పల మట్టి త్రవ్వి, మోసి, రహదారి భద్రతకు పాటుబడ్డారు?
- పంట బోదె దక్షిణపు గట్టును ఒక నర్సూ, నలుగురైదుగురు శుభ్రపరచి, అద్దంలా రూపొందించారు?
- ఎంగిలి విస్తర్లనూ, సారా కంపు సీసాలనూ నిర్వికారంగా ఏరి, రోడ్డు పడమర భాగాన్ని అందంగా తయారు చేస్తారు?
- తమ ఇళ్ళూ - వాకిళ్ల శుభ్ర సుందరీకరణను కాస్త వాయిదా వేసి ఈ మహిళలు శివరాంపురం దగ్గర వీధిని ఊడుస్తారు?
- సొంత డబ్బునూ, శ్రమనూ మంచి నీళ్లలా ఖర్చు చేసి, సంత వీధి సుందరీకరణలో వారం నాళ్లు ఎందుకు పాటుబడతారు?
3 వారాల తర్వాత క్రొత్త శివరాంపురంపారిశుద్ధ్య చర్యలు సమీపించిన సంతోషంలో - షణ్ముఖ శ్రీను ముమ్మారు నినదించాక – విజయేంద్ర ప్రసాదు గారితో తన మంతనాలను
DRK గారు వివరించాక –
రేపటి శ్రమదానం శివరామపురం మొదటి మర్రిచెట్టు క్రిందననుకొని నేటి శ్రమ ప్రణాళిక ముగిసింది.
ప్రత్యేకముగా నిలిపెను!
చేసిన పని కొద్దిదైన శ్రేష్టముగా నిలవాలని
తనతోబాటితరులకూ తనివి తీర్చుచుండాలని
స్వచ్ఛ కార్యకర్త ముద్ర ప్రతి పనికీ అంటాలను
పంతమె స్వచ్చోద్యమాన్ని ప్రత్యేకముగా నిలిపెను!
- నల్లూరి రామారావు
20.02.2025