3391* వ రోజు ... ....           21-Feb-2025

 నారచేతి సంచులుండగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ సామన్లు దేనికటా!!

శుక్రవారం నాటి వీధి సేవకులు 29 మంది! @3391*

         వారిలో నలుగురు సంత గోడల అందగింపులకు అంకితమై పోగా - మిగిలిన పాతిక మంది శివరామపుర ప్రవేశంలోని 50 గజాల రహదారి శుభ్రతకూ, భద్రతకూ పరిమితమయ్యారు!

         21-2-25 న వేకువ సేవల కథలో కూడా విలన్ పొగమంచు గాడే! అక్కడ పొరుగూరి పారిశుద్ధ్యం కోసం తీవ్ర ప్రయత్నం చేసిన స్వచ్ఛంద సేవకులదే అంతమ విజయం!

         ఊరి ముంగిట 25 గజాల డ్రైను నుండే 4 గోతాల ఖాళీ సారా సీసాల్ని, ఒక పెద్ద సంచీడు ప్లాస్టిక్ వ్యర్థాల్నీ ఎలా సంపాదించారని శంకించకండి! అక్కడ ఏవేవో ట్రక్కులు ఆగుతాయట - డ్రైవర్లూ, క్లీనర్లూ తాగేసి, అలవోకగా విసిరిన సీసాలట! ఇక ఈ కార్యకర్తలేమో డ్రైను మాళిగను తవ్వి మరీ వాటిని పైకిలాగుతారయే!

         బాట పడమర మురుగు కాల్వలో డజను మంది శ్రమనూ, దీక్షా దక్షతలనూ వీడియో తీస్తే బాగుండేది, మరీ ముఖ్యంగా 5 గురు  గంటన్నరకు పైగా వంచిన నడము లెత్తక - అది పశువుల గడ్డో లేక పనికిమాలిన చొప్పో గాని కత్తులతో ఖండించి దంతెలతో లాగుతున్న - ఇంత మంచులోనూ చెమటలు కారిన దృశ్యాన్ని!

         ఇక తూర్పు దిశగా - మినప గట్టు దాకా కష్టించిన వారికైతే

శ్రమ వీరచక్ర”,

సామాజిక శ్రమదానకర్ణ

         వంటి బిరుదులీయవచ్చు!

         ఎప్పుడైతే - దశాబ్దాల తరబడీ  సొంతూరి, పొరుగూరి వీధి పరిశుభ్ర - సౌందర్యాల కోసం ప్రతినబూనారో, వట్టి మాటలు మాని, క్షేత్ర స్థాయిలో పనిలోకి దిగారో, ఆ పనే వీళ్లకు ఎన్నెన్నో నైపుణ్యాలను నేర్పిస్తుందనుకొంటా!

         లేకపోతే - ఆ రోడ్డు అంచుల పటిష్టతా చర్యలేమిటీ - మురుగ్గుంటల బాగు చేతలేమిటీ - పొరుగూరి వీధుల ఊడుపులేమిటీ?

         బాగా ఆలస్యమయిందనేమో, పిండి నాగజ్యోతి గబగబా చెప్పేసిన నినాదాలూ, జలుబు వల్ల గొంతు బొంగురుపోయిన DRK గారి సమీక్షా వచనాలు ముగిశాక -

         6.50 కి సంత వీధి కెళ్ళి చూద్దును గదా - అప్పుడే రంగుల్నీ, కుంచెల్నీ సరంజమానూ సర్దుకొంటున్నది - సుందరీకరణ బృందం!

         రేపటి వేకువ ఆ బృందం సంత వద్ద - మిగిలిన వారు క్రొత్త శివరామపురం చివర మల్లంపాటి వారి ఇంటి వద్ద కలుసుకోవాలట!

         ఈ ఉద్యమ సారాంశం

పరిశుభ్రతె జన హితమని, జన స్వస్తతె మన సుఖమని

శ్రమలోనే సుఖ ముందని, సంతృప్తికి మార్గమిదను

స్వచ్చోద్యమ సిద్ధాంతం సమాజమును కదపాలని

ఏకాదశ వసంతాల ఈ ఉద్యమ సారాంశం!

- నల్లూరి రామారావు

   21.02.2025