నారచేతి సంచులుండగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ సంచులు దేనికటా!!
ఆదివారం నాటి శ్రమ చరిత్ర - @3393*
23.2-25 నాటి వేకువ 2 గంటల శ్రమ చరిత్ర నిర్మాతలు 40 మందైతే - అరకొరగా పాల్గొన్నది మరో 10 మంది!
4.17 సమయపు తొలి శ్రామికులు డజను కాగా – సమీక్షా కాలపు – జయ జయ ధ్వానాలకు 51 మందన్న మాట!
2-3 రకాల రహదారి సుందరీకరణ ప్రయత్నాలు మల్లంపాటి ప్రేమానందుని ఇంటి సమీపంలోనే మొదలు – ట్రాక్టరు పైకెక్కి ఎత్తైన తరాల క్రిందటి రావి చెట్టు కొమ్మల ఖండన మండనాలు తొలి శ్రమదానమనుకొంటే –
అక్కడికి దక్షిణంగా వెంకటాపురం రోడ్డు కిరువైపులా మరొక 150 గజాల దాక డ్రైన్ల శుభ్రత, తాడి, పిచ్చి మేడి తదితర చెట్ల సుందరీకరణలు కొనసాగాయి!
ఈ పూట ఏ తుక్కునూ, కొమ్మలు రెన్నుల్నీ ట్రాక్టర్లోకెక్కించే పని పడలేదు. 12 మందికి పైగా గంటన్నర పనంతా తాటి మట్టలు, చెట్ల కొమ్మలు, లాక్కొనిపోయి షెడ్డర్ నోటికందిచడమే - ముఖ్యంగా పిల్లలకీ పని బాగా నచ్చింది.
సీసాల ఏరుడూ, ఎండు తుక్కు ప్రోగు చేతలూ, రోడ్డునూ, దాని రెండు ప్రక్కలనూ ఊడ్చే పనులు ఎప్పుటిలాగే జరిగాయి. సంత వీధి గోడల సుందరీకరణం జరగలేదు.
శివరాత్రి పర్వానికి శివరామపురం దాక రహదారిని, సర్వాంగ సుందరం చేయాలనే ఆశయం – ఇక – 3 రోజులే ఉన్నందున – నెరవేరడం కష్టమనిపిస్తున్నందున - నిన్న 11 మంది వెంకటాపురం కూలీలతో కొంత పని చేయించారు కూడ!
చేసినంతవరకు – 1 ½ కిలోమీటర్ల రహదారీ కళకళలాడిపోతున్నది.
నేటి అంతిమ సభను ధాటిగా తన నినాదాలతో ప్రారంభించినది పల్నాటి భాస్కర మహాశయుడు.
సభానంతరం పల్నాటి అన్నపూర్ణ తన కుమారుని వివాహ వార్షికోత్సవ జ్ఞాపికగా 50 మందికి అద్భుతమైన అల్పాహార విందు చేశారు. రకరకాల విందు విభాగాల ఆస్వాదనకే పావుగంట సమయం చాలలేదు.
ఈ ఉదయం 10.00 నుండి SRYSP విద్యాసంస్థ పూర్వ విద్యార్ధుల కలయిక ఒకటున్నది.
రేపటి శ్రమదాన వైభవం ఉభయ శివరామపురాల నడుమ కోళ్ళ ఫారాల వద్ద జరుగునని తెలిసినది.
ఈ ఉద్యమ సారాంశం!
“పని అంటే పది మందికి పనికొచ్చేట్లుండాలని
ఉద్యమిస్తే చల్లపల్లి ఉద్యమముగ నిలవాలని
పట్టుదలకు స్వచ్ఛ చల్లపల్లిని చూపెట్టాలని
ఏకాదశ వసంతాల ఈ ఉద్యమ సారాంశం!
- నల్లూరి రామారావు
23.02.2025