3395* వ రోజు ... ....           25-Feb-2025

 గాజు, స్టీలు వస్తువులుండగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు దండగ!

ప్రాత శివరామపురం సమీపంలో - @3395*

            మంగళవారం - రేపు పండగ సందడనగా - (25-2-25) వేకువ - వెంకటాపురం విద్యార్థులతో సహా డజను మందికి మరీ 4.20 కే తొందరైపోయింది. వీళ్లంతా ఎప్పుడు మేల్కొని, చీకట్లో - మంచులో ఇంతింత దూరాలు వచ్చి 6.20 దాక – అంటే రెండేసి గంటల సమయాన్ని ఈ రహదారికి అర్పించారో!

            మొత్తం 27 మందిలో ఉభయ శివరామపురాల వారు ఒకరిద్దరే! పని జరిగింది కోళ్ళ గూడుకు ఉత్తరంగా - మహా ఐతే 100 గజాల దాక, ప్రధానంగా రహదారి తూర్పు దిక్కున. మరి – “ఈ పాతిక మంది శ్రమతోనూ బాగయింది ఆ కాస్త దూరమేనా?” అంటే ఏం చెప్పగలను.

            పుణ్యక్షేత్రానికి తీసుకుపోయే ఈ రహదారి పండక్కి ముందు ఎలా ఉండకూడదో అలా ఉన్నది. ఒక ప్రక్క రోడ్డు పడమర అంచు దాకా కోళ్లఫారం నుండి వ్యర్ధాల గుట్ట, తూర్పుగానైతే ఎన్ని తాటి చెట్లు పెరుగుతున్నదీ, పులుగుడు తదితర తీగలెంతగా అల్లుకుపోయి వీధంతా క్రమ్ముకుపోయిందో గమనించండి. మళ్లీ వాటి నిండా ఎండు కొమ్మలూ, ప్రాత చెప్పులూ, గుడ్డలూ, ప్లాస్టిక్ వ్యర్ధాలూ!

            మరి - వీటన్నిటికి పరిష్కారమేదయ్యా అంటే - ఒకటే – 40 గంటల శ్రమ! సదరు శ్రమ రూపాలు బోలెడు! కాలుష్యాల మీద పగబట్టిన అరడజను మంది కత్తులు ఝళిపిస్తుంటారు; తెగిపడుతున్న పిచ్చి చెట్లనూ, తాటాకుల్నీ, మరీ ఎత్తైన కొన్ని కొమ్మల్నీ  ఆరేడుగురు దూరంగా లాక్కుపోయి గుట్టలు పేరుస్తుంటారు; బడి పిల్లలైతే పరుగులు తీస్తుంటారు.

            నిండిన డిప్పలు చకచకా విడిగా ప్రోగుగా మారుతుంటది. 4 గురు చీపుళ్ళకు పని చెప్పగా - ప్లాస్టిక్ సంచుల్ని, సీసాల్నీ ఒకరు ఏరుతుంటారు.

            6.15 కు చూస్తే గానీ “ఈ రహదారి ఇంత వెడల్పుగా ఉన్నదా?”  అనిపించలేదు! కస్తూరి విజయ్ కుమార్ గారు ప్రకటించిన  నినాదాల పిదప DRK గారు చెప్పిన జనచైతన్యవేదిక సమాచారాలు - అనాథ ప్రేత సంస్కార కథలూ, దీన రోగుల సేవలూ  కార్యకర్తలకు నచ్చాయి. ఎందుకు నచ్చవు? - ఈ వైద్యుడూ, ఈ వాలంటీర్లూ ఆ జాతి వాళ్లే కదా!

            మహాశివరాత్రి వేకువ మనం కలువవలసింది శివరామపురంలోని BDR ఇంటి వద్దే!!

        ముచ్చట మాత్రం వేఱట!

ఎన్నెన్నో ఉద్యమాలు కొన్ని నాళ్లు నడిచినవట

సద్యః సత్ఫలితాలను సాధించెను గూడా నట

కాని - వివాదాస్పదముగానో, అర్ధంతరముగనో

ముగిసినవట! స్వచ్చోద్యమ ముచ్చట మాత్రం వేఱట!

- నల్లూరి రామారావు

   25.02.2025