3396* వ రోజు .......           26-Feb-2025

 గాజు, స్టీలు వస్తువులుండగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు దండగ!

                     3396*వ నాడు కూడ శివరామపురంలోనే!

    బుధవారం వేకువ 12 మంది తొలి శ్రామికులు ఆగింది ఆ ఊరి ప్రధాన వీధిలో BDR ప్రసాదుని ఇంటి ఎదుట.  మహా శివరాత్రి పండుగను వారితో బాటు మరో 14 మందీ ఈ 26-2-25 ఉదయాన – 2 గంటల శ్రమదాన పూర్వకంగా జరుపుకొన్నారు.

            ఈ దినం కూడ నెరవేరింది 100 గజాల వీధి కాలుష్య పరిహారమేగాని, సదరు వీధి భాగం ఎంత శుభ్రంగా, పండ్ల, పూల చెట్లతో హరిత సుందరంగా మారిందో చూడండి.

            పంటకాల్వ వంతెనతో బాటు కాల్వ గట్లు, ఎండు వరి గడ్డీ, రాలిన ఎండుటాకులూ, పలచగానైనా దొరికిన ఏక మాత్ర   ప్రయోజనకర ప్లాస్టిక్కులూ, అక్కడక్కడా పెరుగుతున్న గడ్డీ ఆ వంద గజాల వీధిలో ఇప్పుడు కనిపిస్తున్నవేమో చూడండి.

            నిముషానికి 20 కి పైగా వస్తూపోతున్న పెదకళ్ళేపల్లి  భక్తులకు ఇలాంటి స్వచ్ఛ- శుభ్ర - హరిత- సుందర రహదారి గుండా వెళ్తున్నప్పటి – వారికే  తెలియని అనిర్వచనానందానుభూతిని పంచినది నేటి 26 మంది చేసిన 40 గంటల శ్రమ కాదా?

            సామాజిక సామూహిక –శ్రమదానంలోనే తమకు రోజంతటికీ సరిపడా సంతృప్తిని వెదుక్కునేందుకే గదా- ఈ రైతులు, వ్యాపారులు, గృహిణులు, వైద్యులు, అలనాటీ  -ఇప్పటీ ఉద్యోగులు 3-4 కిలోమీటర్ల దూరాన్ని గమించి శ్రమించేది?

            చాలా చాలా దూరాల్నుండే ఇన్ని వేలమంది భక్తవరులు తెలవారక ముందే - సమీప పుణ్య స్థలికి వెళ్లి, కృష్ణమ్మ పాయలో మునిగి వస్తుండడం చూశాను.

            అందుకు భిన్నంగా సమాజానికి తాము బాకీపడినది గుర్తుంచుకొని, సదరు ఋణ భారాన్ని కొంత తగ్గించుకొంటున్న స్వచ్చ కార్యకర్తల్నీ చూశాను.

            6.20 కి పనులు ముగించి, స్థానిక అతిధేయ స్వచ్ఛ కార్యకర్త బాల దుర్గా రామ ప్రసాదు నిలకడగా ముమ్మారు వినిపించిన స్వచ్చోద్యమ ప్రతిజ్ఞల్ని  అనుసరించాను.

       క్లుప్తంగా DRK డాక్టరు గారు సమీక్షించిన 26-2- 25 నాటి శ్రమను విన్నాను. నేడు ప్రకటించవలసిన జనవరి నెల ట్రస్టు జమా ఖర్చుల కాగితాన్ని జేబులోనే మరిచాను. ధ్యాన మండలి వారి శివరాత్రి సందర్భ విందును స్వీకరించాము.

             రేపటి శ్రమదానం కూడ శివరామపురం నుండే అని గ్రహించాము.!

          మానవ శ్రమ లేకుంటే

 శ్రమ వెంటే జయ ముంటది - శ్రమలోనే సుఖముంటది,

మానవ శ్రమ లేకుంటే మంచి ఫలిత మెట్లొస్తది?

కష్ట పడక అప్పనంగ కలిసొస్తే అది గొప్పా !

స్వయం కృషితో జన స్వస్తత సాధిస్తే ఇది మెప్పా?

 

- నల్లూరి రామారావు

   26.02.2025