గాజు, స్టీలు వస్తువులుండగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు దండగ!
3401* వ నాటి – 4 కిలోమీటర్ల దూరపు శ్రమదానం!
సోమవారం (3-3-25) ఉదయాన – తమ 2 గంటల శ్రమను ధారపోసినవారు 23 మందే! వెంకటాపురానికి దూరంగానూ, శివరామపురానికి దగ్గరగానూ జరిగిన పారిశుద్ధ్య ప్రయత్నంతో మరొక 60-70 గజాల రహదారి ధన్యమైపోయింది!
రోడ్డుకు తూర్పుగా డ్రైనులోనేమో ఏపుగా పెరిగిన గడ్డీ, పల్చగా ముళ్ళ పిచ్చి మొక్కలూ, గట్టు మీద షరా మామూలుగా ప్లాస్టిక్, వరిగడ్డి వ్యర్ధాలూ. ఈ స్వచ్ఛ కార్యకర్తలు కాక – ఇంత మంచులో, చీకట్లో గజం లోతు డ్రైన్ లో దిగి, సరీ సృపాల భయం లేకుండా శుభ్రపరచగలరేమో ఆలోచించండి.
ఇక పడమర డ్రైను పడమర గట్టు మీద ఎత్తైన తాడి, కొబ్బరి చెట్ల రాలిపడిన మట్టలూ, త్రాగి పడేసిన కొబ్బరి బొండాలూ, చిందరవందరగా పెరిగిన తీగలూ ఏడెనిమిది మంది నిర్విరామంగా పనిచేస్తే గాని ఒక కొలిక్కి రాలేదు.
2 మార్లు విజిల్ ఊదినా ప్రతి రోజూ పని ముగించని ఒక అంబటీ, మరొక చెక్ పోస్టూ సరే – వాళ్ళకది ఆలవాటు - ఈ ఉదయం 6.24 కు కూడ ఒక గురవయ్యను ఇద్దరు బలవంతంగా పని విరమింపజేయవలసొచ్చింది!
6.00 దాటాక – కాస్త వెలుతురు వచ్చి, అప్పటికింకా తుక్కు లోడింగు మిగిలిపోయినప్పుడు చూడాలి – 6 గురి పనితనాన్నీ, వేగాన్నీ, ఒడుపునూ!
రేపటికి నెల రోజులౌతున్నది - ఈ కళ్లేపల్లి రోడ్డు శుభ్ర – సుందరీకరణ మొదలుపెట్టి. పని నెమ్మదిగా జరుగుతున్నది గాని, శుభ్రపడిన 2 ½ కిలోమీటర్ల దూరాన్ని ఒక్కసారి చూడండి - దాని అందాన్ని ! ఈ 3 కిలో మీటర్ల బాటనూ కార్యకర్తలు బాగుచేయడం ఇది వరసగా పదోసారి!
నేటి సమీక్షా సభ భరత్ యువగళం నుండి వెలువడిన నినాదాలతో మొదలై, నేటి కార్యకర్తల శ్రమతో బాటు - DRK గారు హాజరైన 2 ఫంక్షన్ల నిర్వహణ ప్రస్తావనతో ముగిసింది.
రేపటి పారిశుద్ధ్య కృషి కోసం శివరామపురం – వెంకటాపురం మధ్య గల వంతెన వద్ద కలుద్దాం!
కథలో - పాటో – కవితలొ
సాదాసీదా సేవల? సాధారణ దృశ్యములా?
హిమపాతము నెదిరిస్తూ, ఇంతటి శ్రమత్యాగములా?
సున్నిత భావుకులిందుకు స్పందించక ఉంటారా?
కథలో - పాటో – కవితలొ కట్టకుండ ఆగుదురా?
- నల్లూరి రామారావు
03.03.2025