గాజు, స్టీలు వస్తువులుండగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు దండగ!
3404* వ కష్టప్రదానం కూడా తక్కువేం కాదు!
6.5.25-గురువారం వేకువ కూడా మళ్లీ అదే వెంకటాపురం దగ్గరి పెద్ద వంతెన నుండే సదరు దానం జరిగింది! అలా అప్పనంగా తమ కష్టాన్ని ధారపోసిన వారు – ఐదూళ్ళ నుండి హాజరైన 36 మందైతే-దాన పరిగ్రహీత వంతెనకు దక్షిణంగా 200 గజాల పె.క.పల్లి రహదారి! సమర్పించేందుకు కార్యకర్తలు గాని, స్వీకరించేందుకు వెంకటాపురం దగ్గరి రోడ్డు గాని సంకోచించడం లేదు!
ఈ వేకువ పనులు సైతం స్థూలంగా 3 రకాలు:
1) మూడూళ్ల చెత్త కేంద్రానికి మరికొన్ని మెరుగులు దిద్దుట, దీనికి ఇద్దరో ముగ్గురో పూనుకొన్నారు. ఎంతలేదన్నా - ఒక డిప్పకు సరిపడా గాజు బుడ్లో-సీసా పెంకులో దొరికాయి..
2) పడమటి డ్రైనులో రకరకాల న్యూసెన్సు మొక్కలూ, తీగలూ 12 మంది కత్తులకు పని చెప్పితే గాని, అడుగున ప్లాస్టిక్, గాజు సీసాల ఏరివేతతోగాని అసలీ రోడ్డు ఎంత విశాలమైనదో తెలియలేదు.
3) వీళ్ళకు కాస్త దూరంగా రోడ్డు పరిరక్షక దళం పనిచేసుకుపోతున్నది. ప్రాత తారు రోడ్డు తుంపుల్ని ఏ 100 డిప్పలో నింపి, మోసి, 100 గజాల మేర రెండు ప్రక్కలా బరంతు నింపి, ఆ క్రొత్త రోడ్డుకు అదనపు రక్షణ కల్పించారు!
అసలీ అమర్యాదకరమైన, అగౌరవప్రదమైన బరువైన పనుల కోసమా-స్వచ్చ సైనికులు నాలుగైదు కిలోమీటర్లు వచ్చి, 2 గంటలు పనిచేయడమేమిటో-వాటిని పేపర్లూ, టీవీలూ ఎందుకు కీర్తిస్తాయో చాలమందికర్ధం కాకపోవచ్చు!
ఏదో-లాంఛనంగా నెల రోజుల్లో ముగిసే స్వచ్చంద శ్రమదానమనే ఈ వ్యవహారాన్ని భావించారందరూ - మరీ సూక్ష్మ గ్రాహులూ, దార్శనికులూ ఐన గురవారెడ్డీ, సురేష్ నాదెళ్లా వంటి కొద్ది మంది తప్ప!
3404* వ నాడు కూడ ఇందరు కార్యకర్తల్లో ఇంత పట్టుదలా, ఉత్సాహమూ ఉండడాన్ని స్వయంగా పనిచోటుకు వచ్చి చూస్తే తప్ప గ్రహించడమూ, నమ్మడమూ జరగదు గాక జరగదు!
ఆకుల దుర్గాప్రసాదు తొందరపడకుండా చెప్పి - చెప్పించిన నినాదాలూ, 32 నాళ్ళ-వేయికి పైగా గంటల శ్రమ ఫలితాన్ని వివరించిన DRK గారి సముచిత సమీక్షా కాక-
రేపటి వేకువ వెంకటాపురం చిన్న వంతెన వద్ద కలుసుకోవాలనే నిర్ణయమూ నేటి విశేషాలు!
పేరు మహాశివరాత్రిది
అదృష్టం పట్టుకొంది వెంకటాపురానికో!
అవకాశం లభించింది స్వచ్ఛ కార్యకర్తలకో!
పేరు మహాశివరాత్రిది ఎప్పుడో అది దాటిపోయె
ఐనా కొనసాగుతోంది స్వచ్చోద్యమ వేడుక!
- నల్లూరి రామారావు
06.03.2025