3405* వ రోజు ....           07-Mar-2025

 గాజు, స్టీలు వస్తువులుండగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు దండగ!

వెంకటాపురం దగ్గరి శ్రమ ప్రత్యేకత - @ 3405*

          అది మోపిదేవి మండలానికి చెందిన ఒక ప్రముఖ గ్రామం రోడ్డు, పెదకళ్లేపల్లి బాటలో అపరిశుభ్రంగా కళ తగ్గి ఉండడమే దాని నేరం. అక్కడ ఈ వేకువ 200 గజాల బారునా, ఈ శుక్రవారం(7.3.25) 2 గంటల శ్రమదానం విశిష్టత ఏమందురా?

          చల్లపల్లి స్వచ్చ కార్యకర్తలెలాగూ – ఎన్ని పొరుగూళ్ళకో వెళ్ళి, తమ కష్టాన్ని సమర్పించి, స్వచ్చ శుభ్రతలు సాధించి, సంతృప్తి చెందడం పదకొండేళ్ళుగా జరుగుతున్నదే గాని –

          ఆ పదకొండు మందీ రెక్కలు కష్టంతో బ్రతికే శ్రామికులు, 7.30 కు పొలం పనులకు వెళ్లవలసి ఉండీ-తమ ఊరి ముంగిట నాలుగూళ్ల వాలంటీర్లు పాటుబడుతుంటే-తామూ పాల్గనవలసిందేనని వచ్చి కష్టించడమే నేటి విశేషం! వాళ్ళ మూలంగానే నేటి స్వచ్ఛ శ్రామి”కుల బలం” 47 కు పెరిగింది!

          మరి నేటి రహదారి సుందరీకరణ విశేషాలా-వాటికేం తక్కువ? కొందరు వికారంగా కనపడే తాడి చెట్ల మట్టలు నరికి, సుందరాకృతులుగా మార్చారు;

          ప్రాత రోడ్డును మార్చినప్పటి వ్యర్ధాల్ని క్రొత్త రోడ్డు రెండు ప్రక్కలా మెరక చేసి, దాని మన్నికకు హామీ ఇచ్చారు. ఇంకా మిగిలిన రద్దును ట్రాక్టరు కెక్కెంచి, ఇతర రోడ్ల మన్నిక కోసం భద్రపరిచారు;

          బాట ప్రక్కల మార్జిన్ల గడ్డినీ, పిచ్చి మొక్కల్నీ వెదకి మరీ నిర్మూలించారు, ప్లాస్టిక్ సంచుల్లాంటి తుక్కు ఇప్పుడక్కడ కనిపించడం లేదు చూడండి;

          పడమటి డ్రైనులో 15 మంది ఎంతగా శ్రమిస్తే అక్కడి నానా జాతి కాలుష్యాలు తొలగి, ఇంతగా శుభ్రపడిందో ఆలోచించండి.

          స్వచ్ఛ కార్యకర్తల లక్ష్యం ఆదివారం నాటికి తమ నెలా 5 రోజుల శ్రమతో ఈ 4 ½ కిలోమీటర్ల రహదారి మెరుగుదలను ముగించాలని, నా చింతల్లా ‘వ్యవసాయ కూలీలు, బడి పిల్లల పాటి సామాజిక చైతన్యం ఇతర గ్రామస్తులకెందుకు లేదా’ అనే!

          ఇంతమందికీ సరిపడా మిఠాయిలు తెచ్చి పంచిన మాలెంపాటి డాక్టరు గారినభినందించక తప్పదు!  

          మినప చేలో జరిగిన సమీక్షా సభలో – విద్యార్ధి కార్తీక్ చల్లపల్లి - వెంకటాపురాల స్వచ్చ – సుందర నినాదాలు పలకగా, పని పట్ల DRK గారి సంతృప్తి వచనాలతో - రేపటి వంతెన వద్ద కలవాలనే నిర్ణయంతో – నేటి పనులు సమాప్తి!

          స్వచ్ఛరిత్ర ఇదే గదా

స్వచ్ఛరిత్ర ఇదే గదా! సామాజిక పరివర్తన

అధ్యాయం ఇది కాదా! త్యాగమన్న ఇది కాదా!

రహదారుల-డంపింగుల రాతమార్చు పనులలోన

ప్రజారోగ్య భవిత మార్చు ప్రయత్నాలు కనపడవా!

- నల్లూరి రామారావు

   07.03.2025