గాజు, స్టీలు వస్తువులుండగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు దండగ!
35 రోజుల శ్రమ సంబరాల పరాకాష్ట - @3407*
ఈ మార్చి మాస ద్వితీయ ఆదివారమున వెంకటాపురం ప్రవేశం దాక - ప్రధానంగా రోడ్డు పడమర కాలువలో జరిగిన శ్రమలో 89 మంది ప్రమేయమున్నది. స్వచ్చ చల్లపల్లి ఉద్యమంలో గత 11 ఏళ్లలో ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్న సందర్భాలు అతి తక్కువే!
300 గజాల వీధి బారునా – ఆరేడేళ్ల నుండి 85 ఏళ్ల రకరకాల వారు 150 కి పైగా పని గంటలు - అదీ తమ కోసం కాక – ఊరి శ్రేయస్సు కోసం శ్రమించిన దాఖలా ఈ చల్లపల్లి ప్రాంతంలో తప్ప ఎక్కడైనా ఉన్నదేమో గుర్తుచేసుకొండి!
జరిగిన పనులేమో మురికివీ, మొరటువీ, ఉద్దేశమేమో నాలుగైదు కిలోమీటర్ల రహదారిని ఒక మోడల్ గా రూపొందించడం; కార్యకర్తలేమో ఐదూళ్లకు చెందిన వాళ్లు; వెంకటాపురం, సర్పంచి సోములమ్మ, కూలీ మేస్త్రి వెంకటేశ్వరమ్మలతో సహా ఇంచుమించు సగం మంది మహిళల చొరవ; ఇక వీధి కాలుష్యాలు అంతమొందక ఏం చేస్తాయి?
నేను నిన్నటి శ్రమ నివేదికలో అడిగిన “అదృష్టం వెంకటాపురానిదా, ఐదూళ్ళ కార్యకర్తలదా?” అనే ప్రశ్నకు ఈ పూట సమాధానం దొరికింది! “గెలిచింది సామాజిక స్ఫూర్తి” అని!
ఐతే-రాష్ట్రానికీ, జిల్లాకూ ఒక మూలన రగులుకొన్న ఈ సామాజిక సంచలనం ఇంతింతై రాష్ట్రమూ, దేశమంతటా వ్యాపించడమే తరువాయి!
7.20 కి ఇంటికి తిరిగివస్తూ – 5 కిలోమీటర్ల రోడ్లను పరిశీలనగా చూశాను. ఒక స్వచ్ఛంద శ్రమ శక్తి స్వచ్ఛ శుభ్ర సౌందర్యపరంగా ఎన్ని అద్భుతాలు చేస్తున్నదో గ్రహించాను.
ఊరి వెలుపల కాల్వ ప్రక్కనే నేటి తుది సమావేశంలో :
1) ఉప్పల ఏడుకొండలు తన కుమార్తె వివాహ సందర్భంగా ఆ డాక్టరు విజయలక్ష్మి గారి 10,116/- చెక్కును ఉద్యమ ఖర్చులకిచ్చి,
2) కాకినాడలో జరిగిన ప్రభుత్వ వైద్య సిబ్బంది సమావేశంలో స్వచ్చ చల్లపల్లి ప్రశంసలను వివరించగా..
3) నందేటి శ్రీను రకరకాల గాన విన్యాసాలతో శ్రామిక శ్రోతలనుర్రూతలూగించగా –
4) శివరామపుర నివాసినీ, దాతృత్వంలో ఆవేశ పరురాలూ ఐన “సుఖవాసి స్వరూపరాణి” గారి అ(న)ల్పాహారం ప్రతి ఒక్కరి బరువు పెంచగా
5) రేపటి వేకువ ఇదే రోడ్డులో శివరాంపురం కోళ్ళ ఫారాల వద్ద కలవాలని నిర్ణయించుకొని, ఏ 7:30 కో ఇళ్ళు చేరారు!
సగటున 40 మందే
ఎప్పుడైన రాశి కన్న వాసి ముఖ్యమందురు గద
స్వచ్చ సుందరోద్యమాన సగటున 40 మందే
ఇంత పెద్ద గ్రామంలో ఇష్టపడడమూ అంతే!
ఉద్యమాల తొలి దశలో ఉండు నిట్టి ఉదంతాలె!
- నల్లూరి రామారావు,
09.03.2025