3408* వ రోజు ....           10-Mar-2025

 గాజు, స్టీలు వస్తువులుండగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు దండగ!

ఇంకా ముగియని పెదకళ్లేపల్లి బాట శ్రమదానం - @ 3408*

          అంచనాకు భిన్నంగా ఈ సోమవారం(10-3-25) కూడ ఆ రహదారి సుందరీకరణే కొనసాగింది. ఐతే - కార్యకర్తల సంఖ్య మాత్రం నిన్నటంత ఉడ్డోలంగా కాక – నలుగురు స్థానికులతో సహా 27 కు పరిమితమయింది. వారిలో 10 మందికి తొందరెక్కువై, 4.30 కు బదులు 4.20 కే శివరామపురంలో పనికి దిగారు.

          36 వ నాడు కూడా ఈ రకరకాల వీధి శ్రామికులు ఒకే వీధికి ఎందుకు పరిమితమయ్యారంటే-

          కోళ్ల ఫారాల దగ్గరా శివరాంపురం దగ్గరా కొద్దిపాటి వీధి సేవలు మిగిలిపోయాయట! అదీ గాక తామెంత జాగ్రత్తగా రహదారి సుందరీకరణ చేసుకుపోయినా, ఈ నాలుగైదు కిలోమీటర్ల బాటలో ఎక్కడే చిరులోపం కనిపించినా సహించని కొందరున్నారిందులో!

          అదీగాక ఈ7-8 రోజుల్లో మళ్లీ కొన్ని మద్యం సీసాలూ, ఇతరేతర వ్యర్ధాలూ, చోటుచేసుకొన్నాయి!

          ప్రాత శివరాంపురం దగ్గర్లో మినప చేను గట్టు దగ్గర గజమెత్తు పెరిగిన గడ్డినీ, రంగు దిమ్మె, క్రొత్త కరెంటు స్తంభాల వద్ద మరింత సుందరీకరణకు ప్రయత్నిస్తున్న ఒక సీనియర్ కార్యకర్త కాలు బెసికి, పడబోయి నిలద్రొక్కుకొన్న సంగతొకటి తెలిసింది! ఈ 3408 రోజుల్లో ఇలాంటివెన్ని జరగలేదు?

          కోళ్ళఫారాల తూర్పున శ్రమించింది ఇద్దరు కత్తుల, ఒక దంతె పని మంతులేగాని – ఆ 50 గజాల స్తలం ఇప్పుడొక శుభ్ర - సుందర శిల్పంలా ఉన్నది గమనించండి!

          మిగిలిన వాళ్ల కర్మ స్థలం శివరామపురం ప్రవేశం దగ్గరే! అక్కడి గడ్డీ – పిచ్చి మొక్కలూ, రోడ్డు దుమ్మూ తప్పించడం ఈ ఉదయం వాళ్ల వంతు!

 

          ఇక నేటి విశేషమేమంటే - మూడు నాల్గు రోజుల్నుండీ అంతంతమాత్రం ఆరోగ్యం సహకరించకున్నా - 76 ఏళ్ళ స్థానిక రైతు రావి మోహనరావు గారితో బాటు వారి తమ్ముని కుమారుడు చంటి కూడ స్వచ్ఛ కార్యకర్తగా మారడం!

          ఒక సుదీర్ఘ కాలిక కార్యకర్త మల్లంపాటి ప్రేమానందుడు పద్దతిగా చెప్పిన ఉద్యమ నినాదానంతరం - త్యాగ జీవుల ఉదంతాలు కాక - ఈ పూట DRK గారు వేకువ శ్రమ ఎంతటి ఆరోగ్యదాయకమో వివరించగా –

          రేపటి శ్రమ వితరణ కూడ ఉభయ శివరాంపురాల వద్దనని తెలిసింది!

          కథ మారెను వ్యధ తీరెను

ఎవరైనా చేయగలుగు, ఈ సామాజిక బాధ్యత

ఎందుకొ పట్టించుకోక ఇన్నేళ్లుగా మిగిలె చరిత

ఆ కథ మారెను వ్యధ తీరెను కళ్ళేపల్లి మార్గంలో

సామాజిక సామూహిక శ్రమదానపు సందడిలో!

- నల్లూరి రామారావు,

   10.03.2025