గాజు, స్టీలు వస్తువులుండగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు దండగ!
3409* వది 32 మంది ప్రయత్నం!
మంగళవారం (11-3-25) నాడు అందులో డజను మందైతే 4:22 కే శివరాంపురం కోళ్ల గూళ్ళ వద్ద ప్రత్యక్షం! మంచు గారూ, చలి గారూ ఇవాళ కాస్త విశ్రాంతి తీసుకొన్నారు.
ఇక్కడి రోడ్డుకు తూర్పూ - పడమరలుగా 3 చోట్లు పునః పునః సుందరీకరణ కోసం ఐదూళ్ల వారు - ఉభయ శివరామపురాల – వెంకటాపుర - రామానగర - చల్లపల్లిల నుండి వచ్చి, రహదారిని కాలుష్యరహితంగా, శుభ్ర-సౌందర్య సహితంగా చేసిన చేసిన ప్రయత్నం నెరవేరింది.
Dr.డి.ఆర్.కె. గారి ద్వారానూ, ఇతరత్రానూ తెలిసిన సమాచారమేమంటే – మోపిదేవి మండల గ్రామాల వారు గత 2 వారాలుగా ఈ రహదారి మీదుగా వచ్చి వెళ్ళే అనుభూతుల్ని పంచుకొంటున్నారట! మరి-వారిలో ఎందరు ఈ నెలనాళ్లకు పైగా - సగటున 40 మంది కార్యకర్తల కష్టాన్ని గుర్తించారో తెలియదు. ఈ రహదారి హరిత - సౌందర్యాలు వారిలో ఏ కొద్దిమందినైనా వాళ్ళ ఊళ్లలో ఈ శ్రమదాన కార్యాచరణకు దింపాయేమో తెలియదు!
ఈ వేకువ 3 చోట్ల - 3 రకాల - 3 బృందాల కృషి ఇది –
1) క్రొత్త శివరాంపురం దక్షిణాన – ప్రేమానందం గారి ఇంటి ప్రక్కన 10 గజాల క్రొత్త తారు రోడ్డుకు భద్రత కల్పించడం, పనిలో పనిగా వీధి మార్జిన్ ఎత్తుపల్లాల్ని సరిదిద్దడం..
2) ఇక్కడికి 150 గజాల దూరంగా రహదారి తూర్పున - మినప చేనికి వ్యర్ధాలతోనే అదోరకం కంచె నిర్మించడమూ, అక్కడ మరోమారు ఊడ్వడమూ.
3) అక్కడికింకా దక్షిణంగా - కోళ్ల నివాసాల నుండి ప్రాత శివరామపురం దాక తూర్పు ప్రక్కన ఎక్స్ట్రా బ్యూటిఫికేషన్ లో 10 మంది శ్రమ. తత్ఫలితంగా తాడిమట్టలూ, కొన్ని తుక్కులూ తొలగి, “ఆ రహదారి మరీ ఇంత విశాలమా!” అనిపించడం.
అదే చోట యువక బృందం తారు రోడ్డు ప్రక్కన గోతులు సరిజేసే పని కూడ తక్కువేం కాదు!
రేపటి శ్రమ కార్యక్రమం కూడ కోళ్ల ఫారాలు - శివారాంపురం మధ్యనే.
చాలవు నా రెండు కళ్లు
శ్రమదానోద్యమ వీరులు తమ కర్తవ్యం మానరు
దానికిష్టపడని వాళ్లు దరిదాపుల్లో నిలవరు
శ్రమ విభవం చూసేందుకు చాలవు నా రెండు కళ్లు
ఇదే సుమా ఏకాదశ వసంతాల శ్రమచరిత్ర!
- నల్లూరి రామారావు,
11.03.2025