గాజు, స్టీలు, నార వస్తువులుండగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు దండగ!
మరొక ఔత్సాహిక సేవా వినోదం! - @3419*
ఇది శుక్రవారం (21-3-25) పూటది, మరొకమారు పాగోలు మార్గంలోనే NTR విభిన్న పాఠశాల వద్దే మొదలైనది, అనుకోని మార్పులు జరిగితే తప్ప ఇంకో వారం రోజులు – పాగోలు గ్రామం దాక ఇవే రహదారి సేవలు జరగనున్నవి!
ఈ వేకువ పారిశుద్ధ్య చర్యలు 4:20 కే డజను మందితోనూ, ఆ ఉపరి కలిసిన 23 గ్గురితో కలిపి మొత్తం 35 మందికి పరిమితమైతే మాత్రం లోపమేమి ? కార్యకర్తల ఉత్సాహం తగ్గిందా? పనులకు సంబంధించిన ఛలోక్తులకు లోటుందా? “మనం చేస్తున్నది ఇటు ప్రజాహ్లాదానికీ, అటు పర్యావరణానికి పుణ్యకార్యం” అనే స్పృహ మాత్రం లోపించిందా?
గంటా 50 నిముషాలు –
- చెట్ల సుందరీకరణలో, మురుగు కాల్వల బాగు చేతలో
- రకరకాల ముదనష్టపు వ్యర్ధాలను ప్రోగులు చేయడంలో
- పూల మొక్కల పాదుల్ని సరిదిద్దడంలో,
- ఎక్కడెక్కడి ప్లాస్టిక్ – గాజు సీసాల, ప్లేటుల, కప్పుల సమీకరణలో
- ఇద్దరు 2 రకాల యంత్రాలతో పనులు చేసి, సందడి పెంచడంలో
- ఒక సీనియర్ వైద్యుడు క్షణక్షణం జాగ్రత్తగా కార్యకర్తల భద్రతను కనిపెట్టడంలో
- అలవాటు ప్రకారం ఒకాయన పనిమధ్య కేకలతో,
- మొత్తం మీద 50-60 పనిగంటల శ్రమతో ఏ 120 గజా ల వీధో తెల్లారేప్పటికి అనుకున్నకంటే అందంగా రూపొందడంలో,
- అంతేగాక ఈ రహదారి కూడ పెదకళ్లేపల్లి బాట అందాలతో పోటీ పడడంలో చకచకా గడిచిపోయాయి!
ఈ ఉభయ స్వచ్చ వైద్యులకేమో తామిక్కడుండని ఏడెనిమిది రోజుల్లో ఈ వీధికి చేయవలసిన పరిచర్యల్ని వివరించడంతోనూ, తీసుకోవలసిన సకల జాగ్రత్తలూ చెప్పడంతోనే సరిపోయింది.
నేటి నినాదాల్ని దంచికొట్టింది తూము వారు, చెత్త కేంద్ర, ఊరి సిమెంటు రోడ్ల, నరకబడుతున్న చెట్ల సంగతులను కలెక్టరు గారితో చర్చించినది దాసరి వారు,
తమ 35 వ వైవాహిక ఉత్సవ సందర్భంగా స్వచ్చోద్యమానికి 1500/- విరాళం సమర్పించినది పల్నాటి వారు,
రేపు కూడా పాగోలు రోడ్ లోనే కదా మనం కలిసేది!
పదే పదే ఋజువు పరచె!
అసలగు సౌందర్యమేదొ - సౌకుమార్య చందమేదొ
సంపాదన పరమార్థమేదొ - త్యాగాలకు విలువ ఏదొ
సంఘానికి వ్యక్తులకూ సంబంధాలెలాంటి వో
స్వచ్చోద్యమ చల్లపల్లి పదే పదే ఋజువు పరచె!
- నల్లూరి రామారావు,
21.03.2025.