గాజు, స్టీలు, నార వస్తువులుండగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు దండగ!
విసుగూ విరామం లేని పాగోలు రాదారి పనులు - @3423*
పనులైతే మంగళవారానివి; పొరుగు పంచాయతీకి చెందిన, ఒక నాటి మహాబోధి - నేటి NTR బడి దగ్గరివి; కాస్త అలస్యమైతే అయింది గాని, వచ్చి పనులు విరగదీసిన వేల్పూరి ప్రసాద – గురవయ్య గురువుల వంటి శ్రమ రీతులవి; పదేళ్ళ – 3423 నాళ్లేం ఖర్మ - మరో పదేళ్ళ శ్రమదానానికైనా ఏ మాత్రం వెరవని 186 మంది వాలంటీర్లవి!
అంత ఖచ్చితంగా సమయ నిర్వహణ ఎలా చేస్తున్నారోగాని – ప్రతి వేకువా అనుకొన్న పని చోటుకు ఠంచనుగా తొలి పది మందీ నిర్ణీత సమయం – 4:30 కు ముందుగానే అక్కడ హాజరు! ఒక ప్రక్క కరకు కత్తుల - దంతెల - చీపుళ్ళ - మర రంపాల – ఖణేల్ – గరగర – మ్రోతలూ, మరో వంక శ్రమ విలువను తెలిపే, సామాజిక బాధ్యతాంశాలను గుర్తు చేసే మైకు పాటలు!
ఇలాంటి పారిశుద్ధ్య సేవలకిష్టపడని – గ్రామ బాధ్యతలు పాటించడం రుచించని - కేవలం తమ పనుల్లో తీరిక చిక్కని వ్యక్తులు పొరపాటున ఈ శ్రమదానం దగ్గరకు వరసగా నెలనాళ్లు వస్తే? ఇలా చెట్ల సుందరీకరణలు, రోడ్ల మరామత్తులు, గడ్డి-పిచ్చి చెట్ల పీకుళ్ళు, వీధి ఊడ్పులు, DJ సౌండ్లు లేని చప్పిడి పాటలు... విని తట్టుకోలేరేమో!
రోత - బూతు వెకిలి పాటలు లేని, వేళకాని వేకువ వేళ – 2 గంటల మొరటు – మురికి పనులందరికీ నచ్చాలనేముంది? నచ్చెనుబో - ఊరికావల శ్మశానాలకూ - కాల్వ గట్టులకూ వచ్చెదరా? వచ్చిరిబో - ఏదో లాంఛనంగా ఒకటి రెండు రోజుల్లో పారిపోక నిలిచెదరా? నిలిచిరిబో - ప్రతిఫలం దక్కని ఈ కంచి గరుడ సేవలు కొనసాగిస్తారా?
ఇలా నాలుగు లక్షల పని గంటల గ్రామ బాధ్యతలు మోస్తారనేగదా – స్వచ్ఛ కార్యకర్తల్ని కొందరు ‘మొండివాళ్లు’, ‘వెర్రి బాగుల వాళ్లు’ అనుకొనేది?
డి.ఆర్.కె-పద్మ గార్ల పరోక్షంలోనూ యదావిధిగా పొరుగూరి వీధి సేవలు సజావుగా సాగుతున్నవి! ఎవరో మెచ్చి మేకల తోళ్ళు కప్పుతారనో, ఎప్పటికైనా కీర్తి - ప్రతిఫలమూ దక్కుతుందనో వీళ్ళేనాడైనా ఆశిస్తే గదా అది ఆగేది!
పాఠశాల ప్రధాన ద్వారం దాటి పాగోలు దిశగా – అంతా కలిసి 100 గజాల వీధి ఈ వేకువ ఎలా శుభ్రపడిందనే తృప్తి చాలు వాళ్లకి!
మరీ సాగదీయకుండా స్వచ్ఛ సుందర నినాదాల్ని పల్నాటి వనిత విన్పించగా, నిన్న MTM లో జిల్లా అధికారులు చల్లపల్లి పట్ల చూపిన శ్రద్ధను ప్రాతూరి - తూములు వివరించగా,
రేపటి వేకువ పనులు బడి గేటు పడమరగా చేయాలని నిర్ణయింపబడగా... నేటి బాధ్యతల పరిసమాప్తి!
ఎంత నమ్మకమని!
మనోల్లాసమిస్తుందని, జనచేతన తెస్తుందని
పర్యావరణమును కూడ బాగుపరచ చూస్తుందని
భూమాతకు ఎంతో కొంత స్వాంతన కలిగిస్తుందని
శ్రమదానం పట్ల కార్యకర్త కెంత నమ్మకమని!
- నల్లూరి రామారావు,
25.03.2025.