గాజు, స్టీలు, నార వస్తువులుండగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులెందుకు!
శుక్రవారం వేకువ శ్రమ సందేశం - @ 3426*
అంటే మార్చి నెలలో 28 వ రోజు, గ్రామ సేవా శ్రమజీవుల సంఖ్యా బలం 41 నుండి 31 కి తగ్గిన కారణములివి: తూములూరి, గంధం, మాలెంపాటి, పల్నాటి వగైరా రెగ్యులర్ కార్యకర్తలు రాకపోవడమూ,
కేరళ - బైబిల్ కళాశాల వారైదారుగురు ఆగిపోవవడమూ! 150 గజాల ప్రాత మహాబోధి పాఠశాల ఎదుటి పాగోలు మార్గంలో సందడీ, వడీ కొంచెం తగ్గితే తగ్గాయి గాని, పన్లూ వాటి నాణ్యతా అంతగా తగ్గింది లేదు!
కొందరు కార్యకర్తల, సామాన్ల వాహనాలు 4.15 కే ఆపుకొన్నది పాగోలు మార్గ మహాబోధి పాఠశాలల మలుపుకు దగ్గరగా! మరో ఐదారు నిముషాల పిదప పనులు మొదలుపెట్టింది అచటికికొంత తూర్పుగా!
సదరు పనులు ఊపందుకొన్నది మరో అరగంటకూ! వాటిలో 90 శాతం జరిగింది రహదారి దక్షిణ భాగంలో - అనగా బాట మార్జిన్ పిచ్చి మొక్కల, గడ్డీ గాదాల, మోకాలి ఎత్తు తాటి మొక్కల, ఇంకా పంట పొల వ్యర్ధ జల కాలువలోని నానా కాలుష్యాల మీద పగ తీర్చుకోవడాలన్న మాట!
పోను పోనూ సందడి సృష్టిలో మాత్రం కుడి – ఎడమల వాటాల ఉభయ ప్రసాదుల మరరంపపు, కత్తి వేటులదే ప్రధాన పాత్ర!
నలుగురు మహిళలు మాత్రం దంతెల్నీ, చీపుళ్లనీ మార్చి-మార్చి ప్రయోగిస్తూ, ప్రసాదుల యంత్ర - ఖడ్గ ఖండిత తరు శాఖల్ని దారి ఉత్తరానికి చేరుస్తూ శ్రమను పంచారు!
అక్కడికి తూర్పుగా తూము-కోడూరు-అంబటి-కస్తూరి-గౌరిశెట్టి లాంటి వారు కూర్చొనీ, వంగీ 40 గజాల ప్రాంతాన్ని శుభ్ర-సుందర నిలయంగా మార్చారు!
సీసాలేరిన షణ్ముఖుడూ, వాటర్ మాన్ మాలెంపాటీ, ఫొటో పనుల శాస్త్రుల వారూ... గంటకు పైగా ఎక్కడ అవసరమైన, ఎవరికిష్టమైన పనుల్లో వారు నిమగ్నులయ్యారు!
వీరాధి వీర సింహుడు ముమ్మారు కాక - 5 మార్లు స్వచ్చోద్యమ నినాదాలు చెప్పవలసి వచ్చింది. మొత్తానికి శ్రమ కార్యక్రమం సజావుగానే ముగిసింది!
రేపటి వేకువ కూడ ఇదే పాగోలు బాటలో తొలి మలుపు వద్దనే కలుద్దాం!
సజీవసాక్ష్యం.
శ్రమైక జీవన సౌందర్యానికి సజీవ సాక్ష్యం ఉందిగా
స్వచ్ఛ సంస్కృతిని వ్యాప్తిచేయుటకు చల్లపల్లి ఒకటుందిగా
॥శ్రమైక జీవన॥
శ్రమ సంస్కృతితో సహకారంతో చల్లపల్లి వెలుగొందగా
శివరామపురం, పాగోలు రోడ్లలో స్వచ్ఛ సైనికుల పండగా
॥శ్రమైక జీవన॥
హరిత సంపదలు, రోడ్ల బరంతులు, డ్రైన్ల శుభ్రతలు పెంచగా
నలభై-ఏభై మంది శ్రమలతో రహదారులు బులిపించగా
॥శ్రమైక జీవన॥
సుమ సుందర ఉద్యాన పరిమళము శుభ సందేశము పంపగా
పర్యాటకులకు చల్లపల్లి తొలి గమ్యముగా నిలిచిందిగా!
॥ శ్రమైక జీవన సౌందర్యానికి సజీవ సాక్ష్యం ఉందిగా
స్వఛ్ఛ సంస్కృతికి ప్రచారకర్తగ చల్లపల్లి మిగిలిందిగా ॥
- నల్లూరి రామారావు,
28.03.2025.