3428* వ రోజు....           30-Mar-2025

 ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్ సామాన్లు  దండగ!

మళ్ళీ మళ్ళీ వాడదగు స్టీలు వస్తువులే పర్యావరణ పండగ!

     ఉగాది శుభోదయాన 105 గురి సార్థక సమావేశం - @ 3428*

         ఆదివారం వేకువ (30.03.2025) 4.20 కన్న ముందే వారిలో 13 మందీ, తగు మాత్రం వ్యవధి తీసుకొని మరో 29 మందీ  స్వచ్చ కార్యకర్తల హాజరుతో మొత్తం 42 మంది పాగోలు పరిధిలోని శ్రీ నగర్ – ఈద్గా లోపల కొంతా, బైట విస్తృతంగా చూపిన శ్రమ ఔదార్యం!

         ఈ  వీధిలో ఐదారుగురు గృహస్తులు ఎట్టకేలకు తలుపులు తెరచి, తమ లోగిళ్ళ ముందు జరిగే పారిశుద్ధ్య కృషిని వింతగా చూడడం తప్ప, కార్యకర్తలతో కలిసి పోలేదు. “మా ఇళ్ల ముందు మీరు ఊడ్చేదేంటీ..” అని రోషానికి పోనూలేదు! 6.15 కు మాత్రం రేపటి ఈద్గా ప్రార్ధనల కోసం ఆవరణను శుభ్రపరిచేందుకు 60 మందికి పైగా ముస్లిం సోదరులు బిరబిరా రావడమూ దొరికిన కాడికి పనిముట్లందుకొని శుభ్రపరచడమూ జరిగినది!

         4 పదుల స్వచ్చ కార్యకర్తలు ఈ వేకువ2 గంటల శ్రమతో ఏం సాధించారు? అనే ప్రశ్నకు సమాధానం నెంబర్ వన్ :  ఈద్గా లోపలి చెట్ల సుందరీకరణ, గేటు లోపలి ఊడుపులూ!

         2 వది: ప్రార్థనా స్థలి ఎదుటి సుమారు 100 గజాల వీధి బాగుచేత, లోపలి పవిత్ర  స్థలానికి తగ్గట్టు దానిని తీర్చిదిద్దుట!

         అందుకు  సాక్ష్యంగా ట్రాక్టరు పైన గజమెత్తున అమరిన వ్యర్థాలు.

          మరి 3 వదా – ఆదే ఆసలైనది:  సకల మత సమ్మతమైన భారతావనిలో 2  ముఖ్య మతస్తుల పరస్పర సంఘీభావం!

         అప్పుడెప్పుడో -1992లో కాబోలు అయోధ్యలోని బాబరీ మస్ జిద్ కూల్చివేత ఖాయమనుకొన్నప్పుడు – అప్పటి ఇక్కడి ముస్లిం పెద్ద- అనునుల్లాఖాన్ చల్లపల్లిలోఅన్ని రాజకీయ పక్షాల సమ్మేళనంలో ఇచ్చిన సందేశం – “దేశంలో, ప్రపంచంలో  రేపు ఏం జరిగినా జరగనీయండి- మన గ్రామంలో అన్ని మతాల వాళ్ళం కలిసిమెలిసి ఉందాం”!

         ఈ పూట మసీద్ కమిటీ పెద్ద నసీం ఘోరీ గారిచ్చిన సందేశమూ అదే!  మరో ప్రముఖుడు హమీద్ గారు – ‘స్వచ్చ కార్యకర్తలతో కలిసి మనం కూడ ఊరి మంచికి పాటుబడదాం’  అనే ఉపదేశమూ అదే! ప్రజా గాయకుడు నందేటి శ్రీనివాసుడు 3 ముఖ్య మతాలను ప్రస్తావిస్తూ పాడిన పాట  సారాంశమూ ఆదే!

         ఈ ఉగాది నాడు చల్లపల్లిలోని 186 మంది కార్యకర్తలకు రామా యాక్స్  టైలర్ వెంకటేశ్వర రావు రూపంలో  మరో కార్యకర్త లభించాడు. శుభాకాంక్షలు!

రేపటి మన శ్రమదాన పర్వం పాగోలు - చల్లపల్లి బాట తొలి మలుపు వద్ద జరుగునని నిర్ణయం!

         ఎవరు చేస్తరు ప్రతి ఉగాదికి

శ్రీ నగర్  ఈద్గాకు వెలుపల చీదరించే దిక్కుమాలిన

ఎంగిలాకులు - కుక్క పెంటలు – త్రాగి వదలిన మందు బుడ్లను

ఎవరు చేస్తరు ప్రతి ఉగాదికి ఇంతగా శ్రమదానములను?

భిన్నమత సహకారమంటే- సహనమంటే ఇదే గద మరి!

- నల్లూరి రామారావు,

   30 .03.2025.