ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్ సామాన్లు దండగ!
మళ్ళీ మళ్ళీ వాడదగు స్టీలు వస్తువులే పర్యావరణ పండగ!
సోమవారం (31.03.2025) వేకువ కూడా 35 మంది! - @ 3429*
అందులో వీధి కాలుష్య శత్రువులు 12 గురు 4:20 కే NTR స్కూలు దగ్గరి రోడ్డులో ధీమాగా నిలబడ్డారు చూడండి! అసలీ గ్రామ స్వచ్ఛ - సుందరోద్యమంలో టేస్టో – కిక్కో ఏమిటో గాని, ‘ఈ 4 రోజులు మానేద్దాంలే’ అనుకొన్నవాళ్లు సంకల్పితంగానో - అసంకల్పితంగానో బూటుల్లో, కాళ్ళెడతారు – అవి వాళ్లని అనివార్యంగా శ్రమదాన స్థలానికి తీసుకెళ్తవి.
విన్నకోట వెంకటేశ్వర్రావునే చూడండి – వారానికొక్కనాడు వీధి బాధ్యతలకు వద్దామనుకొని, మళ్లీ ఈ వేకువ కూడా వచ్చేశాడు! అలాగని – వీళ్ళంతా మానసిక బలహీనులనుకొనేరు! ఎప్పుడైతే “నా ఊరి కోసం ఏ చిన్న మంచి పనైనా చేయా’లనుకొన్నారో - ఇక వాళ్ళకది అలవాటుగా – వ్యసనంగా మారిపోతున్నది! క్రమంగా అది ఇంట్లో రెండో వాళ్లకీ అంటుకొంటది! అలా ఒకే కుటుంబంలో ఇద్దరేసి, ముగ్గురేసి వ్యసనపరులుండగా ఈ చల్లపల్లి శ్రమదానోద్యమం పుష్కరమేం ఖర్మ - రెండో దశాబ్దమూ ఆగదుగాక ఆగదు!
అప్పుడప్పుడూ తెలంగాణ, తమిళనాడు వంటి పొరుగు రాష్ట్రాల వాళ్ళే కాక - మిజోరం వంటి దూరస్తులూ వచ్చి, పాల్గొంటున్నారంటే - ఇదేం అల్లాటప్పా, మఖలో పుట్టి పుబ్బలో ముగిసే సామాజికోద్యమం కాదని తేలిపోవడంలా?
ఇక ఈ మార్చి మాసాంతపు - రంజాన్ పండుగ నాటి పాగోలు రహదారి సేవా ప్రస్తావనలేవనగా :
- ఇంచుమించు 29 వ తేదీన జరిగిన వీధి శుభ్రతలే...
- అందుకోసం బజార్నూ – మార్జిన్లనూ ఊడ్చేవాళ్లు ఉడ్చారు,
- వీధిలోకి చొచ్చుకువస్తున్న కొన్ని కొమ్మల్ని శిక్షించక తప్పలేదు,
- ఈ పూట ఖడ్గచాలనాలే గాని, మర రంపాల మ్రోతలు విన్పించలేదు.
- వాహనాల పార్కింగుకూ, శిరస్త్రాణధారణకూ సంబంధించిన హితవును DRK డాక్టరు ప్రస్తావించగా,
రామా యాక్స్ వెంకటేశ్వర్రావు నినాదాలను ప్రకటించగా, వియత్నాం పర్యటన విశేషాలను వైద్యుల వారు వివరించగా,
రేపటి వీధి సేవలు పాగోలు రహదారిలోనేనని తెలుసుకొని, ఆలస్యంగా ఇళ్లకు వెళ్లారు.
ఈ దర్గా పరిసరాలు
ఏడాదికి ఒక్కమారు ఈదరగా పరిసరాలు
బాగుపరచు అలవాటుగ స్వచ్ఛ కార్యకర్తలు
ముస్లిం - హైందవ కలయిక ముద్దు గొలుపుచున్నది
శ్రమ జీవన మాధుర్యం జాలువారుచున్నది!
- నల్లూరి రామారావు,
31.03.2025.