ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువులు వద్దని చాటుదాం – మానవాళి మనుగడకు ఆధారమైన పర్యావరణాన్ని కాపాడుదాం.
శనివారపు (26-4=25) స్వచ్ఛ శుభ్రతా విలాసం - @3455*
ఇన్ని వేల రోజుల వీధి పారిశుద్ధ్య వినోదాల్లో ఎప్పుడు లోటు జరిగింది గనుక! అందుకే-చల్లపల్లి స్వచ్చోద్యమ పెద్ద దిక్కైన డాక్టరు గారు అంటుంటారు-“మాది తోచీతోచక చేసే చప్పిడి శ్రమదానం కాదు-ఇదొక శ్రమ వేడుక!, మాకైతే 365 రోజులూ పండగలే!” అని!
దటీజ్ స్వచ్ఛ సుందరోద్యమకారులు! అదీ చల్లపల్లి శ్రమదానోద్యమమంటే! ఇంతవరకూ ఈ వేకువ శ్రమ పండగలో పాల్గొనని-కనీసం వచ్చి చూడ నోచని గ్రామస్తులు గానీ, బైటి వారు గానీ చెప్పకుండా ఉన్న ఫళాన వచ్చి పాల్గొని చూడండి-నేను చెప్పేది అతిశయోక్తో స్వభావోక్తో!
ఇది వ్రాస్తున్న నాతో సహా-డాక్టర్ తో సహా అందరూ ఈ పదేళ్లలో ఏ మురుగు గుంటలోనో, డ్రైను గట్టునో జారిపడి, బట్టలు నల్లటి మురుగంటుకొన్న వాళ్ళే-వాటిని చూసి అందరు చిన్న పిల్లల్లాగా కేరింతలు కొట్టిన వాళ్ళే మరి!
చేతులూ, పాదాలూ గాయాలైనా, బొబ్బలెక్కినా గట్టి కార్యకర్తలు సరే-ఓటివాళ్లమైనా మర్నాడు మానితిమా?85 ఏళ్ల-77 ఏళ్ళ పెద్దలు గాని-పెద్ద ప్రమాదంలో కాలు నుజ్జై, చూస్తేనే భీతి గొలిపే పల్నాటి వీరవనిత మానేసిందా? ఈ ఊరి అదృష్టమో, ఈ వ్యసనపరుల బలహీనతో అదలా జరిగిపోతూనే ఉన్నది!
ఈ వేకువ 4.15-6.10 నడుమ లేలేత కార్యకర్తల మొదలు వృద్ధాతి వృద్ధుల దాక-38 మంది కృషితో:
- అమ్మేసిన పింగళి వారి ఉద్యానంలో, మూల్పూరి వారి ఉద్యానంలో నరికేసిన పెను వృక్షావశేషాల్ని ట్రాక్టర్ లో కెక్కించి,
- 2 ఉద్యానాల్ని క్షుణ్ణంగా శుభ్రపరచి,
- భగత్ సింగ్ వైద్యశాల దాక పట్టిపట్టి దుమ్మూ ధూళీ తొలగించి, కొన్ని చెట్లను సుందరీకరించి,
- మునసబు వీధి ప్రారంభాన్ని 10 మంది సర్వాంగ సౌందర్యంతో నింపి, (ఇవన్నీ ఎప్పుడూ చేసేవే అనుకోండి)-6:10 కి విరమించారు!
తరవాత మామూలే-కాఫీల కబుర్లలో జోకులు, సరదా సంభాషణలు!
నేటి నినాదాలు మ్రోగించిన వారు రాయపాటి రమ గారు. ఆసాంతం పనుల్ని సమీక్షించిన వారు DRK డాక్టరు గారు,
రేపటి పనులు కూడ బందరు రోడ్డులోనే అనేది సమష్టి నిర్ణయం!
ఇంద్రజాలమిక చూద్దాం!
రిజిస్ట్రారు ఆఫీసూ, తూర్పు రామ మందిరమూ
ఎన్నెన్నో దుకాణాలు, ఊరి పెద్ద మస్జిద్దూ,
కాఫీ-భోజనశాలలు, బ్యాంకులు, గుడులూ, బంకులు-
ఇన్నిటినీ శుభ్రపరచు ఇంద్రజాలమిక చూద్దాం!
- నల్లూరి రామారావు
26.04.2025.