3457* వ రోజు .... ....           28-Apr-2025

 ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువులు వద్దని చాటుదాం మానవాళి మనుగడకు ఆధారమైన పర్యావరణాన్ని కాపాడుదాం.

గ్రామస్తులు గుర్తించదగిన సోమవారం (28-4-25) వీధి సేవలు - @3457*

         అవి కూడ బందరు మార్గంలో ఇటు పింగళి వారి ఆస్పత్రి మొదలు అటు RIL స్మార్ట్ ల మధ్యస్తాలే స్తూలంగా! కొద్ది మంది మాత్రం SRYSP దగ్గరా, మునసబు వీధికీ మళ్ళారు. ఇది సోమవారం కనుక ఏ పాతిక మందో వస్తారనుకొంటే 35 మంది ఎలా వచ్చారంటే చదువులకు వేసవి శెలవల వల్లే!

         స్కూలు పిల్లలకు సెలవులిచ్చేది ఆటపాటల-విహరణ  యాత్రల- సరదాల కోసమా లేక ఇక్కడకీవేళ వచ్చిన నలుగురు చిన్నారుల్లాగా సంఘసేవ కోసమా? ఇంత చిన్న ప్రాయంలో తమ సమాజ బాధ్యతను గుర్తించారంటే-వీళ్ళు తప్పక, భవిష్యదాదర్శ సామాజిక సేవామూర్తులౌతారన్నమాటే!

         గ్రామస్తులు సరిగా పట్టించుకోరు గానీ, ఏకాస్త ఆలోచించినా-ఈ శ్రమదానం ఏరోజుకారోజు పెద్ద వింత కాదూ? తమ తమ సొంత పనుల్ని ప్రక్కన పెట్టి, 35 గురు భిన్న నేపధ్యాల వయసుల - వారు గంటా 50 నిముషాలు

1) మద్యం షాపుల వద్ద గలీజుల్ని,

2) రకరకాల దుకాణాల ముంగిళ్లనీ,

3) చేపల కొట్ల

4) 3 ఆస్పత్రుల

5) రిలయన్స్ బడా ఆవరణల వ్యర్ధావశేషాల్ని ఊడవడం, విసర్జిత మూత్ర స్తలాల్లో చేతులు పెట్టి ప్లాస్టిక్కులు ఏరడం, రంగు ఉచ్చిష్టాల మధ్య గడ్డి చెక్కడం

         మన కాలపు-మన గ్రామపు వైచిత్రిగా అర్ధం కాదా? ఇంతాజేసి-ఈ కార్యకర్తలేమో-అబ్బే! ఇదేమీ పెద్ద సమాజ సేవ కాదు- మా కనీస కర్తవ్యంఅంటుంటారు!

         ఇంకా ఎన్ని దశాబ్దాలకయ్యా-ఈ గ్రామ సమాజం 100% స్పందించేది! ఈ సామాజిక కర్తవ్య నిర్వహణోత్సవంలో పాల్గొనేది?

         ఈ పూట కూడ ట్రక్కు నిండా వ్యర్ధాలు దొరికాయి, ఎవరి శ్రమకు తగ్గంతగా వారి బట్టలు చెమటకు తడిశాయి, అవి చూసిన DRK గారి కళ్లు ఆర్ద్రమయ్యాయి!

         గుడివాడ బాలకుడు సాకేత్ సుతిమెత్తగా వినిపించిన నినాదాలు క్రొత్తగా ఉన్నవి, ఈ ఉద్యమ సారథుల వారు పంచిన తాపేశ్వరం కాజాలు కమ్మగా ఉండగా, ట్రస్టు డ్రైవర్ ఆనందరావు గారి జామ పళ్ళు అందరికీ అందినవి.

         అగ్రహారంలో ‘దుర్గా బొటిక్’ మహిళా దుస్తుల తయారీ దుకాణం ప్రారంభానికి అందిన (ఈ సాయంత్రం 5 గంటలకు) ఆహ్వానాన్ని అందరమూ మన్నించవలసి ఉన్నది.  

         రేపు కూడా భగత్ సింగ్ వైద్యశాల వద్దనే కలవాలనే నిర్ణయం సమంజసంగా ఉన్నది!

         స్వచ్చోద్యమమే మిగలదు!

మనమే పొడిచేశామని-మన కొమ్ములె కుమ్మాయని

ప్రొద్దేదొ మన ముఖాన్నె పొడిచిందని-వెలిగిందని 

స్వచ్చోద్యమ కర్తలస లహంకరించి భావించరు

అట్లైతే ఈ దశాబ్ది స్వచ్చోద్యమమే మిగలదు!

- నల్లూరి రామారావు

  28.04.2025.