ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువులు వద్దని చాటుదాం – మానవాళి మనుగడకు ఆధారమైన పర్యావరణాన్ని కాపాడుదాం.
4:11 AM కే మొదలైన 3458* వ నాటి శ్రమ సందేశం!
ఆ స్థలం భగత్ సింగ్ దంత వైద్యశాల వద్ద, ఆ తొలి వీధి పని మంతులు పదముగ్గురు, 29.4.25 వనాటి శ్రమ విభవం కూడ ఇంచు మించు నిన్నటిదే!
మార్పు ఒక్కటే - మొన్నటికన్న నిన్న, నిన్నటికన్న ఈ ఉదయమూ బందరు బాట 200 గజాలూ, సజ్జా-మునసబు వీధులూ, 1 వ-వార్డు ముఖద్వారమూ ప్రత్యేకించి అమరావతి రాజభవన ప్రాంతమూ చక్కని సౌందర్య ప్రదర్శన చేస్తున్నవి, స్వచ్చ-పరిశుభ్రతా మనస్కుల ఎదలు దోస్తున్నవి-ఆ స్పృహ ఉన్న వాళ్ళను!
పదకొండేళ్లకు పైగా 4 లక్షల పని గంటలను మించి గ్రామ పారిశుద్ధ్య క్రీడా విజేతలైన - ఈ ఉదయం కూడ 36 మంది కూడి వచ్చిన - చల్లపల్లి స్వచ్చ సుందరోద్యమాన్ని నేనిప్పుడు పనిగట్టుకొని పొగడవలసిన అవసరమేమున్నది?
కాకపోతే - కొందరు వృద్ధ కార్యకర్తల ఉత్సాహాన్ని, మహిళా కార్యకర్తల తెగింపుల్నీ, పాఠశాల విద్యార్థుల పరవళ్లనీ చూసినపుడు కవనోత్సాహం ఆగదు!
గ్రామ సింగారం పట్ల మమేకమౌతున్న సుందరీకర్తల్నీ మురుగులో దిగుతున్న బరువు పనుల ముఠానీ గమనిస్తుంటే ఒక్కోమారు కలం పరుగు అదుపులో ఉండదు!
నా సంగతి సరే – స్వచ్ఛ కార్యకర్తలు అల్లారు ముద్దుగా పెంచుకొస్తున్న చల్లపల్లి పురవీధుల చక్కదనాన్ని పరిశీలించిన - వాటి అంద చందాలను చూసి మెచ్చగల ఎవరిదైనా బహుశా ఇలాంటి పరిస్థితే!
శంకర శాస్త్రి గారు వారిస్తున్నా వినక కంపు నీటి నుండి ఎంగిలి సీసాల్ని లాగుతున్న ఒక పల్నాటి వనిత,
- ట్రాన్స్ఫార్మర్ క్రింద దూరి బాగుచేస్తున్న ఇద్దరి రిస్కు,
- కర్మల భవనం వద్ద అంతా శుభ్రంగా ఉన్నా-అది చాలక ఇంకా నాల్గో మారనుకొంటా ఊడుస్తున్న ఇద్దరూ......
ఇలా ఎన్ని శ్రమ జీవన దృశ్యాలని!
శతశాతం 10th ఫలితాలు సాధించి, కార్యకర్తల అభినందనలందుకొన్న సుభాషిణి గారే నేటి నినాద కర్త!
సమీక్షలో పాత కథనే చెప్పి, సహనం ప్రాశస్త్యాన్ని వెల్లడించిన Dr. డి.ఆర్.కే. నేటి సభ ముగింపుదారుడు!
రేపటి వేకువ కూడ మన పారిశుద్ధ్య కర్మ స్థలి ఈ బందరు వీధిలోని దంత వైద్యశాల పరిసరాలే!
సహనమె మన ఆయుధమని
సహనమె మన ఆయుధమని - వినయమె మన భూషణమని
శ్రమదానం అనగ గొప్ప సేవ కాదు - బాధ్యత అని –
సమాజ ఋణం లోపల సగమైనా తీర్చెదమని
స్వచ్చోద్యమ చల్లపల్లి కార్యకర్త లెరుగుదురని...
- నల్లూరి రామారావు
29.04.2025.