3459* వ రోజు .... ....           30-Apr-2025

 ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువులు వద్దని చాటిమానవాళి మనుగడకు ఆధారమైన పర్యావరణాన్ని కాపాడుదాం.

నేటితో శ్రమదానం వయస్సు 3459* రోజులు!

         ఆ వయస్సు (బుధవారానికి-ఏప్రిల్ మాసాంతానికి) లో కూడ శ్రమదాతల లెక్క 37 కు తగ్గలేదు! ఆ కమిట్మెంటేమిటో-ఆ బ్రహ్మముహూర్తపు వీధి పారిశుద్ధ్యమేమిటో-మురికి పనుల పట్ల ఆ మోజేమిటో-పుష్కరకాలపు ఉద్యమ పర్యవసానాలెట్టివో..... ఉంటే ఆ పరమాత్మకే ఎఱుక!

         చేస్తున్న ఈ డొక్కు పనుల్లో ఎంత ఆనందం దక్కకపోతే ఈ బృందం ఇన్నేళ్లుగా చేయగలిగేదా? అది సరే-ఈ 3 కిలోమీటర్ల (6 వ నంబరు కాల్వ to అవనిగడ్డ బాట టాయిలెట్లు) రహదారి బాధ్యతను 40 మంది పంచాయతి కార్మికులకప్పగించి చూడండి-ఒక్కటి లేదా 2 రోజులకు పూర్తి చేసుందురు! మరి ఈ వీధి శుభ్ర-సుందరీకరణ చాదస్తులు? రోజూ 30-40 మంది-15 రోజులకైనా పూర్తి చేస్తారేమో చూద్దాం!

         వాళ్ల పద్ధతది-వాళ్ల ముద్ర అలాంటిది-ఎవరీ దారి వెంట వెళ్తున్నా, వెంటనే మనసుల్లో నాటుకుపోవాలి “ఇది-స్వచ్ఛ సుందర చల్లపల్లి ప్రధాన వీధి సుమా!” అని!

         అందుకే గదా-½ కిలోమీటరు మార్గం 6 రోజుల పాటు బాగుపరచడం? కానైతే-ఈకాస్త బాటలోని బ్యాంకూ, విద్యాసంస్థా, ప్రభుత్వ-ప్రైవేటు నివేశనాలూ, కార్యాలయాలూ, సువిశాల వీధి మార్జిన్లూ ఇప్పుడెంతగా మారిపోయినవి? ఈ శుభ్రతను, అడుగడుగునా వీధి పొందికను ఎవరైనా మెచ్చితీరతారు గాని-

         ఆరేడుగురు చీపుళ్లరిగేంతగా ఊడ్చిన కష్టాన్ని, 12 గురు డ్రైను దుర్గంధాన్ని పీలుస్తూ చేసిన బాగుదలను, క్రక్కిన చెమటల్ని, వాటి విలువల్ని ఎందరు గుర్తించగలరు?

         గ్రామస్తులు మాత్రం ఒక నిర్ణయానికొచ్చినట్లు కనిపిస్తున్నది –

         “మనం అంతంతగా సహకరిస్తున్నా ఈ 190 మంది మొండి వాళ్ళు మాత్రం ఇంకో పదేళ్లయినా మనకోసం, మన పిల్లల స్వస్తత కోసం పాటుబడక మానరుగాకమానరు!” అని!

         నేటి సత్సంకల్ప నినాదాల్ని పలికింది గురిందపల్లి ఇందిర, 519 వ్యక్తిగత మరుగుదొడ్ల చరిత్రను గుర్తుచేసింది డాక్టరు DRK.

         రేపటి శ్రమ కోసం మనం కలుసుకోదగింది రిలయన్స్ స్మార్ట్ వద్ద!

         ప్రణమామ్యహం!

పుష్కరకాలం క్రిందటె పుట్టిన ఈ చల్లపల్లి

స్వచ్చోద్యమ మిప్పుడిపుడె ప్రాకుతోంది దేశమెల్ల

అందరి సుఖశాంతులకై అది తప్పని పరిణామం

అట్టి క్రాంతదర్శులకై అందుకె ప్రణమామ్యహం!

- నల్లూరి రామారావు

 30.04.2025.