ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువులు వద్దని చాటుదాం – మానవాళి మనుగడకు ఆధారమైన పర్యావరణాన్ని కాపాడుదాం.
అదే వడ్ల మిల్లు వీధి – 32 మందితో జరిగిన పారిశుద్ధ్యం @ 3461*
తీరింది – శుక్రవారం (02.05.25) వేకువ 4.10-6.10 సమయాల నడుమ స్మార్ట్ బజారు సేవా రుణమే గాని- చల్లపల్లి గ్రామ ఋణం కాదు! కనీసం ఏడెనిమిది నాళ్లుగా పూనుకొన్న బందరు బజారు బాకీ కాదు!
NH 216 కు చెందిన, 6 వ నంబరు కాలవకు సంబంధించిన పారిశుద్ధ్యమైతే గదా – చప్పున ముగియడానికి! అక్కడక్కడ మినీ ఉద్యనాలుంటాయి. 3 అడ్డ రోడ్లు – సజ్జా, మునసబు, భారత లక్ష్మి మర వీధులు కూడ ఈ కార్యకర్తల కోసం కాచుకుని ఉంటుంటే – ప్రధాన వీధి మెరుగుదల ఆలస్యం కాకేం చేస్తుంది!
ఆలస్యమైతే కానీ- గ్రామ ముఖ్య వీధుల బాగు కోసం కార్యకర్తలూ, కార్యకర్తల కోసం ఆ వీధులూ 365 రోజులూ ఉండేవే కదా! ఈ అడ్డ బాట లోని సకల కశ్మలాలనూ, డ్రైన్ వ్యర్దాలనూ, బైపాస్ రోడ్డు దాక స్వచ్చ కార్యకర్తలు సముద్ధరించామనే సంపూర్ణ సంతృప్తి పొందారు గదా!
ఈ పూట ఆరగంటలో ముగించగలమనుకొనే ఈ చిన్న వీధి శుభ్ర సౌందర్యాలు 6.10 దాక 2 గంటలు పట్టిన కారణమే మనుకొంటిరి? మిల్లు గేటు ఎదుటి సిమెంటు రోడ్డు కాంట్రాక్టరు మహాశయుడు దాని నిర్మాణ అవశేషాలను ఎక్కడికక్కడ వదిలేయడమూ, ముఖ్యంగా డ్రైను ఆ వ్యర్థాలతో నిండిపోవడమే !
ఎన్నెన్ని సీసాలు - గ్లాసులు - విస్తర్లు గోనె సంచులు తుక్కును ఆ మురుగు కాల్వ నుండి లాగేశారో తెలుసా?
సుందరీకరణ బృందమైతే సగం వీధి ముస్తాబుకే పరిమితమైపోయింది; వాళ్ళ సంతృప్తి వాళ్ళకు మిగిలింది.
నేటి తుది సభా విశేషాలివి:
1) కర్ణాటక నుండి 86 ఏళ్ల స్వచ్చ కార్యకర్త వేమూరి అర్జునుల వారు ఫోనులో స్వచ్చంద శ్రమదాన విశేషాలు తెలుసుకొనుట,
2) కాశీ యాత్రలో కాలు విరిగిన గురవయ్య ఆ కట్టుతోనే వచ్చి శ్రమదానంలో వేలు పెట్టుట, సూక్తులందుకొనుట!
3) నాగాయలంక నుండి పొన్నూరు శ్రీ రామ మూర్తి గారి పేర బాల భారతి గారు 5000/ నగదు దేసు మాధురి ద్వారా అందించుట, మాధురి గారు కూడా తన రేపటి వైవాహిక స్ఫురణగా – ముందస్తుగా ఈ పూటనే 1000/- DRK గారికి అందించుట,
రేపటి కార్యక్రమం కోసం తూర్పు రామ మందిరం ఎదుట కలవాలని నిర్ణయించుట !.... వగైరాలు!
ఆ మహనీయుల బాటలొ
లక్షల సంవత్సరాల విలక్షణమగు సమాజాని
కెవరు రంగు- హంగులద్ది – ఎన్నో తప్పుల్ని దిద్ది-
స్వస్త పరచి – మెరుగు పరచి – సక్రమముగ నడిపారో
ఆ మహనీయుల బాటలొ స్వచ్చోద్యమ కారులిపుడు!
- నల్లూరి రామారావు
02 .05.2025.