3462* వ రోజు ....           03-May-2025

 ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువులు వద్దని చాటుదాం మానవాళి మనుగడకు ఆధారమైన పర్యావరణాన్ని కాపాడుదాం.

శనివారం (3-5-25) పనిదినం 3462* వది!

          అదైతే వేకువ 4.19 కే 16 మంది తొలి వీరులతోనూ, తదుపరి కలసిన పదునాల్గురు మలి వీరులతోనూ 6.06 దాక జరిగెను. వారంతా వాహనాలు నిలుపుకొన్నదీ, శంకర శాస్త్రీయ తొలి ఛాయ చిత్రం తీసినదీ తూర్పు రామాలయం దగ్గర.

త్వరలోనే పారిశుద్ధ్య క్రియలు ఊపందుకోవడం వల్ల చకచకా ఆరకిలోమీటరు దాక:

1) వీధిని ఊడ్చుకొంటూ,

2) గడ్డీ – పిచ్చి మొక్కలు కనిపిస్తే చెక్కుకొంటూ,

3) 3 చోట్ల మురుగు కాల్వల్ని శుభ్రపరుస్తూ  

4) ప్లాస్టిక్ తుక్కుల పనిపట్టుతూ,

5) వ్యర్ధాల్నీ, ముఖ్యంగా ఇసుక – దుమ్ము మిశ్రాన్ని ట్రాక్టర్ లోకి ఎగుమతి చేసుకొంటూ,

6) ఈ చివరి కార్యం కోసం ఒక కోట పద్మావతి ట్రాక్టర్ లో నిలబడీ....   

          ఇవన్న మాట ఈ 30 మంది మర్యాదస్తులు సాధించిన పనులు!

          శుభ్ర - సుందర వీధుల్లో విహరించేప్పుడు కొందరు మాత్రం ఏదో ఒక్క క్షణం గుర్తిస్తారు – గ్రామ కూడళ్లు, వీధులు, వీధి అంచులు, తిండి బళ్ళ ప్రాంతాలూ, ఎందుకింత పొందికగా ఉన్నవని! ఎందరి కష్టం ఈ గ్రామాన్ని ఇతర గ్రామాలకన్నా ప్రత్యేకంగా నిలుపుతున్నదని! వాళ్ళ కష్టాన్ని  కాస్త తగ్గించాలంటే - ఎవరి ఇళ్ల దగ్గర వాళ్ళు స్వచ్ఛ శుభ్రతలు పాటించుకొంటే చాలని!

          గత 10-11 ఏళ్ళలో ఆ స్పృహ నిలబడింది సగం మంది ఊరి వాళ్లలోనే! మరి మిగిలిన వారి సంగతి?

          ఈ పూట 6.30 తరువాత - ఇటు భారతలక్ష్మి వడ్లమిల్లు వీధి మొదలు అటు అడపా వారి వీధి దాక NH216 ఎంత పద్ధతిగా కనిపిస్తున్నదో చూశారా? మరి - 30 మందే ఒక్కపూటే ఇంత సాధిస్తే ఈ వీధి దుకాణదారులూ, గృహస్తులు మరో 40 మంది కూడ పాల్గొంటే ఏమౌతుంది? పదకొండేళ్లు గడుస్తున్నా ఇంకా బద్ధకమేనా? సంకోచమేనా? మంచి పనికి కూడి రావడానికి ముందు వెనకలేనా?

          పరిశుభ్ర బంధుర, స్వచ్ఛ సుందర చల్లపల్లి దేశానికాదర్శమని పరిశోధకులంటుంటే - మరి గ్రామ సమస్త ప్రజానీకం సంగతేమిటి?

          అరకిలోమీటరు వెనక్కి తిరిగి వచ్చి, మోటారు బళ్ల షాపు వద్ద చేతులు శుభ్రపరచుకొని, కాఫీలు అస్వాదించి, నానుండి తాజా కరివేపాకులు స్వీకరించి, మాలెంపాటి వృద్ధ సింహం గర్జించిన నినాదాలకు బదులిచ్చి,

          రేపటి పనులు పోలీసు స్టేషను వీధి వద్ద మొదలెట్టాలని నిర్ణయించి, నేటి కర్తవ్య పాలన ముగించారు!

          బాట ఒయ్యారం చూడండహె

ఇది గద సత్సంకల్పం - ఇది కాదా సదాశయం

వేనవేల పని గంటల నిర్విరామ శ్రమ ఫలితం

1 ½ కి.మీ. బాట ఒయ్యారం చూడండెహె

ఆలస్యంగానైనా అంతా కలిసి సాగండహో!

- నల్లూరి రామారావు

  03.05.2025.