ప్లాస్టిక్ సంచుల వాడకం వద్దు!
గుడ్డ సంచుల వాడకమే ముద్దు!
ఆదివారం 11/5/2025 – 3470* వ రోజు నాటి శ్రమదాన విశేషాలు.
తెల్లవారుఝామున 4.14 ని॥కు 10 మందితో ప్రారంభమైన స్వచ్ఛ సేవ, ఆదివారం అందునా సెలవురోజు కావటంతో 37 మందికి చేరుకుని ప్రధాన రహదారిపై గల దుమ్ము ధూళిపై చీపుళ్ళతో తమ ప్రతాపాన్ని చూపించారు.
ప్రత్యేక దళ సభ్యులు కస్తూరి మామ్మ గార్డెన్ వద్ద రద్దును లోడు చేస్తూ కన్పించారు. మెజారిటి సభ్యులు సెంటర్ నుండి బస్టాండు వైపుగా ఊడుస్తూ పెట్రోల్ బంక్ వద్ద గల గార్డెన్ లోని చెత్తా చెదారాన్ని వెలికి తీసి శుభ్రపరిచారు.
సుందరీకరణ బృందం నా అభ్యర్ధన మేరకు మా స్కూలుకు విచ్చేసి అడ్డంగా పెరిగిన కొమ్మలను మిషన్ తో కట్ చేసి క్రమ పద్ధతిలో సర్ది ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయడం జరిగింది.
ధ్యానమండలి వెంకటరత్నం గారి వియ్యంకుడు మరియు మనవడు చుట్టపు చూపుగా చల్లపల్లి వచ్చి స్వచ్ఛ కార్యక్రమంలో పాల్గొనటం ఈనాటి విశేషం.
నందేటి శ్రీనివాస్ స్వచ్ఛ నినాదాలతో పాటు ఆదివారం ఆటవిడుపుగా – నా జన్మభూమి... అంటూ ఘంటసాల గానం చేసిన పాటను తన గొంతులో వినసొంపుగా వినిపించగా కార్యకర్తలు లయబద్ధంగా చప్పట్లతో శృతి కలిపి కనువిందు చేశారు.
నాదెళ్ళ సురేష్ (USA) ప్రతి కార్యకర్తకు రుచి చూడండంటు మామిడి పళ్ళను స్నేహితుల ద్వారా పంపడం, వాటిని పంచడం జరిగింది.
పర్యావరణానికి వ్యతిరేకంగా ఏ పని జరిగిన ప్రతి కార్యకర్త తమ గళం విప్పాలని, అప్పుడే తాము చేస్తున్న స్వచ్ఛ సేవ – సార్ధకం అవుతుందని తెలిపారు.
రేపటి కార్యక్రమం బస్టాండు సెంటర్ - చల్లపల్లి అని తెలుసుకుని ఆదివారం కావడంతో తాము చేయవలసిన పనులను గుర్తుచేసుకుంటూ 6.30 ని॥కు వెనుదిరిగారు.
- భోగాది వాసుదేవరావు
సుందరీకరణ కార్యకర్త
స్వచ్ఛ సుందర చల్లపల్లి
11.05.2025.