సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వద్దు!
పర్యావరణ హితమే ముద్దు!
23-5-2025 – శుక్రవారం - 3478 వ రోజు!
గత మూడు రోజులుగా వేకువ సమయాన కురిసిన వర్షాల వలన స్వచ్ఛ సేవకు అంతరాయము కలిగినను రథసారధుల బలీయమైన సంకల్పం, కార్యకర్తల మనోరథం, శాస్త్రి గారి ఉత్సాహపూరితమైన మెసేజ్ ల ప్రభావమేమో గాని వరుణుడి తాత్కాలిక విరామ ఫలితంగా ఉదయం 4.13 ని.కు మొదటి ఫోటోతో ప్రారంభమయిన శ్రమదాన వేడుక మరికాసేపటికి 26 మందితో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉత్సాహభరితంగా సాగింది.
మెజారిటి సభ్యులు బాలికల హాస్టల్ ఎదురుగా ఉన్న ప్రాంతాన్ని కత్తులు మరియు దంతులు ఉపయోగించి మొక్కల మొదళ్ళలో దాగిన చెత్తను వెలికి తీసి డిప్పల కెత్తి ట్రాక్టర్ నందు లోడ్ చేయడం కనిపించింది.
యూత్ బ్యాచ్ సభ్యులు చాలా రోజుల తరువాత నేడు దర్శనమిచ్చి “మేమొస్తే పనిలో స్పీడ్ ఇట్లుంటది” అంటూ సునాయాసంగా కష్టమైన పనులు తేలికగా చేయడం కనువిందు చేసింది.
రైస్ మిల్ ప్రక్కన పల్లపు ప్రాంతాన్ని మెరక చేసి, ఇటుక రద్దు వేసి, ‘ధిమిశ’ తో పొడి చేసి, సిమెంట్ రోడ్ పూర్తిగా కనబడేట్టు చేసి స్వేదం చిందిస్తూ డాక్టర్ పద్మావతి మేడం కన్పించారు.
భరత్ పలికిన నినాదాలతో గొంతు కలిపి, అంజయ్య గారు అందించిన తిరుపతి లడ్డూ ప్రసాదాన్ని స్వీకరించి, ప్రేమానందం గారు అమెరికా నుండి తెచ్చిన ‘గ్లౌవ్స్’ ను అందుకొని డా. గోపాలకృష్ణయ్య గారి పెద్దమ్మాయి అనూరాధ స్వచ్ఛ కార్యక్రమానికి రావడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని తెలిపిన పలుకులు విని,
రేపటి కార్యక్రమం బాలికల హాస్టల్ వద్దనే అని తెలుసుకుని నేటికి కార్యకర్తలు వెనుదిరిగారు.
- భోగాది వాసుదేవరావు
సుందరీకరణ కార్యకర్త
స్వచ్ఛ సుందర చల్లపల్లి
23.05.2025.
నిస్సిగ్గుగ చేస్తున్నవి
ప్రశాంతముగ ముగించేవి పరుల కొరకు శ్రమలే గద!
నిస్సిగ్గుగ చేస్తున్నవి వీధి కంపు పనులే గద!
పైగా పరమానందము పొందడమా ఇన్నేళ్లుగ?
ఏమి మాయ దాగున్నదొ ఈ స్వచ్చోద్యమం వెనుక!
- నల్లూరి రామారావు,
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త.
లాస్ ఏంజల్స్, USA.
23.05.2025.