సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మానేద్దాం!
పర్యావరణానికి మనవంతు సాయం చేద్దాం!
26.05.2025 సోమవారం – 3481* వ రోజు
శ్రమదాన వేదిక - హైవేలో కాసానగర్ సెంటర్.
వేకువ ఝామున 4.20 ని॥కు 13 మందితో ప్రారంభమయిన స్వచ్ఛ సేవ మరికొద్ది సమయానికి 35 మంది చేరికతో ఆ ప్రాంతమంతా పని సందడి నెలకొంది. హైవేలో భారీ వాహనాలలో వెళ్ళే డ్రైవర్లు తెల్లవారుఝామున జరుగుతున్న ఈ శ్రమదాన వేడుకను, వాహనములను నెమ్మదిగా పోనిస్తూ, ఒకింత ఆశ్చర్యానికి గురౌతు వెళ్ళటం మా దృష్టిని దాటిపోలేదు.
కాసానగర్ సెంటర్ ప్రాంతాన్ని శుభ్రపరచి డివైడర్లలో పూల మొక్కలు నాటి సుందర ఉద్యానవనంగా మార్చాలని రథసారధుల ఉద్దేశం. వారి భావనలకనుగుణంగా కార్యకర్తలు ఎవరు చేయగల పనిని వారు చేస్తూ పనిలో లీనమైపోయారు. చిన్నారులు సైతం ఉత్సాహంగా పనిలో పాల్గొనటం ఈ నాటి విశేషం.
సెంటర్ కు ఉత్తరాన గల డివైడర్ ను శుభ్రపరిచే బాధ్యతను ప్రతేక దళ సభ్యులు చేపట్టారు. రాళ్ళు రప్పలు ఏరుతూ, చెత్త చెదారాన్ని పోగుచేస్తూ, డిప్పలలో కెత్తి లోడ్ చేస్తూ మొక్కలు నాటడానికి అనువుగా ఆ ప్రాంతాన్ని తయారు చేస్తూ కన్పించారు.
సెంటర్ కు తూర్పున గల డివైడర్ ను సుందరీకరించే బాధ్యతను సుందరీకరణ బృందం చేపట్టింది. మట్టిలో కూరుకు పోయిన రాళ్ళను పలుగుతో వెలికి తీసి జాగ్రత్తగా రోడ్డు ప్రక్క సర్ధడం, చెత్తా చెదారాన్ని పోగు చేస్తూ చీపుళ్ళతో ఊడుస్తూ ఆ ప్రాంతమంతా శ్రమైక జీవన సౌందర్యానికి మచ్చు తునకగా మలిచారు.
ప్లాస్టిక్ వ్యర్ధాల్ని ఏరుతూ ఒకరు, ఊడ్వగా వచ్చిన మట్టిని డిప్పలలో కెత్తి డివైడర్ లలో పోస్తూ మరికొంతమంది, రోడ్డు ప్రక్క చెత్తను శుభ్రపరుస్తూ తన తోటి వారిని ఉత్సాహపరుస్తూ ఇంకొందరు. ఇదండీ ఈనాటి స్వచ్ఛ చల్లపల్లి ముఖ చిత్రం!
లక్ష్మణరావు నినదించిన స్వచ్ఛ నినాదాలతో గొంతు కలిపి రేపటి శ్రమదాన వేడుక కాసానగర్ వద్దనే అని తెలుసుకుని కార్యకర్తలు వెనుదిరిగారు.
- భోగాది వాసుదేవరావు
సుందరీకరణ కార్యకర్త
స్వచ్ఛ సుందర చల్లపల్లి
26.05.2025.
మహా శ్రమదాన యజ్ఞము!
సాహసాలకు మారుపేరని, సహనమున కొక ముద్దుపేరని,
సంతసాలకు, ఆత్మ తృప్తికి చక్కనైన ప్రదేశమిదియని,
స్వచ్ఛ సంస్కృతి అడ్రసిది యని, చల్లపల్లికి వరం అనుకొని
దశాబ్దిపైబడి సాగుచున్నది మహా శ్రమదాన యజ్ఞము!
- నల్లూరి రామారావు,
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త.
లాస్ ఏంజల్స్, USA.
26.05.2025.