భూమిలో ఎప్పటికీ కరగని ఫ్లెక్సీలు వాడకం వద్దు!
భూమిలో కరిగిపోయే గుడ్డ బ్యానర్ల వాడకమే ముద్దు!
29-5-2025 గురువారం – 3484*
వేకువ ఝామున 4.23 ని॥కు 15 మందితో మొదలయిన స్వచ్ఛ సేవ మరికొద్ది సేపటికే 38 మంది చేరికతో కాసానగర్ సెంటర్ లో పని సందడి ప్రారంభమయింది.
బందరు వైపుగా ప్రధాన రహదారికి ఎడమ ప్రక్క రోడ్డుకు దిగువగా విశిష్ట దళం, ప్రత్యేక దళం సభ్యులు 16 మంది ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న వృక్షాల చుట్టు ప్రక్కల చెత్తా చెదారాన్ని కత్తులు మరియు గొర్రులనుపయోగించి పోగుచేసి, డిప్పలలో సేకరించి, గజానికి ఒకరు చొప్పున నిలబడి డిప్పలనందుకుని, ట్రాక్టర్ లోనికి విసురుతూ, ఆనందంగా ఒకరిపై ఒకరు చలోక్తులు వేసుకుంటూ నిర్విరామంగా శ్రమిస్తూనే ఉన్నారు.
అదే రహదారికి అంచున గల పారిజాత వృక్షాల వద్ద పాదులు తీస్తూ, రక్షణ కంపను సరిజేస్తూ, చెత్తను పోగు చేస్తూ సుందరీకరణ బృందంతో పాటు మరికొంత మంది సీనియర్ కార్యకర్తలు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తూ పనిలో లీనమవటం కన్పించింది.
నలుగురు యువదళ సభ్యులు అవనిగడ్డ వైపుగా కుడి ప్రక్కన రహదారి అంచున మెరక పల్లాలను సరిజేస్తూ రద్దును డిప్పులలోకెత్తుకుని రోడ్డుకు దన్నుగా పోయటమే కాక, పల్లంలో గల పంచాయితీ పంపుకు మెరక చేసి పెద్ద బండరాయిని నీళ్ళు పట్టుకొనుటకు అనువుగా చేసి సంతృప్తి చెంది వెనుదిరిగారు.
ప్రతి కార్యకర్త కష్టాన్ని తన కెమేరాలో బంధిస్తూ శాస్త్రి గారు, మంచినీళ్ళు అందిస్తూ గోపాలకృష్ణయ్య గారు, కమ్మని కాఫీని కార్యకర్తలకు అందిస్తూ నందేటి శ్రీనివాస్ పనిముట్లు లెక్క చూసుకుంటూ అగ్గిరాముడు (ఆనందరావు).
ఇదండీ ఈ నాటి శ్రమదాన వేడుక చరమాంకం.
జాహ్నవి చెప్పిన స్వచ్ఛ నినాదాలతో గొంతు కలిసి రేపటి కార్యక్రమం కాసానగర్ దగ్గరేనని తెలుసుకుని నేటికి స్వస్తి పలికి కార్యకర్తలు 6:20 ని.లకు వెనుదిరిగారు.
- భోగాది వాసుదేవరావు
సుందరీకరణ కార్యకర్త
స్వచ్ఛ సుందర చల్లపల్లి
29.05.2025.
ఈ తృప్తే చాలు మనకు!
ఇందరితో కలిసి మెలిసి చిన్న మంచి చేస్తున్నాం
ఎవరిని నొప్పించకుండ ఇలా పాటుబడుతున్నాం
నెమ్మదినెమ్మదిగానే ఊరిని మార్చేస్తున్నాం
ఇది కాదా మంచి బ్రతుకు? ఈ తృప్తే చాలు మనకు!
- నల్లూరి రామారావు,
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త.
లాస్ ఏంజల్స్, USA.
29.05.2025.