సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వద్దు!
పర్యావరణ హితమే ముద్దు!
30-5-2025 - శుక్రవారం – 3485 వ రోజు.
వేకువ ఝామున 4.19 ని॥లకు 12 మందితో మొదటి ఫోటోతో ప్రారంభమయిన స్వచ్ఛ సేవకు మరికొద్ది సవయానికి తరలి వచ్చిన స్వచ్ఛ సైన్యం 37 మంది చేరుకుని హైవే పై పనితో చెత్తపై సమరభేరి మ్రోగించారు.
హైవేలో బందరు రోడ్ వైపుగా రహదారికి దిగువన మరియు అంచున మొక్కల వద్ద పెరిగిన కలుపును చేతులతో పెరికి వేసి, ప్లాస్టిక్ వ్యర్ధాలు వెలికి తీసి, గుట్టగా పోసి, ట్రాక్టర్ లో వేసి, ఉత్సాహ భరితమయిన పాటలు వింటూ, ఉదయపు ప్రకృతి రమణీయతను కంటూ, స్వేదంతో తడిసిన వంటికి తగిలే చల్ల గాలిని ఆస్వాదిస్తూ స్వచ్ఛ సైనికులు శ్రమిస్తున్నారు.
కార్యకర్తలు జట్లు జట్లుగా ఏర్పడి ఎవరు చేయగలిగిన పనిని వారు క్రమ శిక్షణతో క్రమబద్ధంగా చెత్తరహితంగా రహదారికి కుడి ప్రక్క మరియు ఎడమ ప్రక్క ఒక ఫర్లాంగ్ దూరం వరకు పని త్వరితంగా చేసి 6.05 ని॥కు మూడు ‘విజల్స్’ అయిన తరువాత శ్రమదాన వేడుక ముగించారు. డాక్టర్ DRK గారు జరిగిన పనిని చూసుకుంటు, కార్యకర్తలను మెచ్చుకుంటు సంతృప్తి వ్యక్తం చేశారు.
ప్రతి విషయాన్ని నిశితంగా పరిశీలిస్తూ, ఫ్రెండ్లీ పోలీస్ గా వ్యవహరిస్తూ, చల్లపల్లిలో శాంతి భద్రతలను కాపాడుతూ ఉండే C.I. గారు చుట్టపు చూపుగా వచ్చిన తన మిత్రుడు అశోక్ గారిని వెంట తీసుకుని, ఈనాటి శ్రమదాన వేడుకలో పాల్గొని, తుది సమీక్షలో తన మిత్రుని పరిచయం చేసి తన ఆనందాన్ని వ్యక్తపరిచారు. మిత్రుడు అశోక్ గారు మాట్లాడుతూ తాను ‘టెంపుల్స్ విజిట్’ కు వచ్చానని, స్వచ్ఛ చల్లపల్లి కార్యక్రమాన్ని గత కొన్నేళ్ళుగా ఫాలో అవుతున్నానని, పవిత్ర దేవాలయాన్ని సందర్శించిన అనుభూతి కలిగిందని తన మాటలలో తెలిపారు.
C. I. గారు పలికిన స్వచ్ఛ నినాదాలతో గొంతు కలిపి,
నందేటి శ్రీనివాస్ ఆలపించిన గీతాలను ఆస్వాదించి,
రేపటి శ్రమదాన వేడుక కాసానగర్ వద్దనే అని రూఢి చేసుకుని నేటి స్వచ్ఛ సేవకు ‘బై బై’ చెప్పారు స్వచ్ఛ కార్యకర్తలు.
- భోగాది వాసుదేవరావు
సుందరీకరణ కార్యకర్త
స్వచ్ఛ సుందర చల్లపల్లి
30.05.2025.
చాలును ఈమేలి బ్రతుకు!
పదేళ్లుగా కష్టపడుచు పరులకు మేల్ చేస్తుంటే
సమస్యలేవొ వచ్చినపుడు సహనం ప్రదర్శిస్తుంటే
ఊరి ప్రజలు ఇక తప్పక మనదారికి వస్తూంటే
చాలద ఆ తృప్తి మనకు? చాలును ఈమేలి బ్రతుకు!
- నల్లూరి రామారావు,
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త.
లాస్ ఏంజల్స్, USA.
30.05.2025.