సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వద్దు!
పర్యావరణ హితమే ముద్దు!
31-5-2025 - శనివారం 3486* వ రోజు
వేకువ ఝామున, వాతావరణం చల్లగా ఉన్న తరుణాన – ఉదయపు గాలులు శరీరాన్ని తాకుతూ మనసు ఉత్తేజం పొందుతున్న సమయాన హైవేలో కాసానగర్ వద్ద 4.20 ని॥కు 20 మంది కార్యకర్తలతో మొదటి ఫోటోతో ప్రారంభమయిన స్వచ్ఛ సేవ, ముగింపు సమయానికి 40 మందితో ఆ ప్రాంతమంతా పండుగ వాతావరణం నెలకొంది. చాలా రోజుల తర్వాత మొదటి ఫోటోలో 20 మంది కనబడటం హాస్పిటల్ స్టాఫ్ మహిళల గొప్పతనమే. ఇటువంటి సందర్భాలు మరిన్ని రావాలని ఆశిద్దాం!
హైవేలో బందరు రోడ్ వైపుగా కుడి, ఎడమల ప్రక్కల ఏపుగా పెరిగిన గుడి గన్నేరు మొక్కలు పూలతో కనువిందు చేస్తున్నాయి. రహదారికి దిగువన మరియు అంచుల వద్ద పూల మొక్కల వద్ద కలుపును తీస్తూ, చెత్తను వేరు చేస్తూ, పోగులుగా పెట్టి, డిప్పలలో కెత్తి, ట్రాక్టర్ లో వేస్తూ కార్యకర్తల శ్రమ విన్యాసాలు చూడమచ్చట గొలుపుతున్నాయి.
రహదారికి ఎడమ వైపున ‘గ్రాస్ కట్టర్’ తో నిపుణులయిన కార్యకర్తలు తక్కువ సమయంలో ఎక్కువ ప్రాంతాన్ని శుభ్రం చేయడం కనిపించింది. చల్లటి వాతావరణం వల్ల కాబోలు 6.10 ని॥కు పనికి ముగింపు పలికారు కార్యకర్తలు.
“ఆత్మీయతలు కరువై...
అనుబంధాలు బరువై...
అభిమానాలు మాయమై...
అనుమానాలకు నెలవై...
స్వార్ధం...పెరిగిపోయి...
ప్రేమలు...తరిగిపోయిన”
ప్రస్తుత పరిస్థితులలో ఆత్మీయతతో కూడిన అనుబంధాలు, అభిమానాలు మన కార్యకర్తల కాఫీ ముచ్చట్లలో చూడాల్సిందే.
తుది సమావేశంలో...Dr.DRK గారు తమ హాస్పిటల్ స్టాఫ్ అధిక హాజరుకు ఆనందాన్ని వ్యక్తం చేసి, విజయవాడ గైనకాలజి డాక్టర్ల అసోసియేషన్ సభ్యులు రేపు మొక్కలు పెట్టబోయే కార్యక్రమాన్ని విశదీకరించి, ప్రతి కార్యకర్తకు 10 సం॥ల గుర్తుగా ఇచ్చిన Cap, T షర్ట్ ను వేసుకుని రావల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
లక్ష్మీ సెల్వం పలికిన స్వచ్ఛ నినాదాలతో తమ గొంతు కలిపి రేపటి కార్యక్రమం కాసానగర్ సెంటర్ అని తెలుసుకుని కార్యకర్తలు నేటికి స్వస్తి పలికారు.
- భోగాది వాసుదేవరావు
సుందరీకరణ కార్యకర్త
స్వచ్ఛ సుందర చల్లపల్లి
31.05.2025.
ఐనా కొంత అవసరమే
కవిత్వాలు గిలికి తేనె ఖాళీ కడుపులు నిండవు
ప్రవచనాలు గుప్పిస్తే స్వచ్ఛ శుభ్రతలు రాలవు
ఒళ్లు వంచి కష్టించక పారిశుద్ధ్యములు దక్కవు
ఐనా కొంత అవసరమే ప్రవచనాలు, కవిత్వాలు!
- నల్లూరి రామారావు,
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త.
లాస్ ఏంజల్స్, USA.
31.05.2025.