3487* వ రోజు....           01-Jun-2025

 మొక్కలు నాటుదాం!

పర్యావరణాన్ని కాపాడుదాం!

01.06.2025 – ఆదివారం- 3487* వ రోజు

         గత 10 సం॥ల పైగా నియమ బద్ధంగా, నిర్ణీత సమయానికి, నిశ్చయముగా ప్రారంభమయ్యే స్వచ్చ సేవకి యధావిధిగా ఈ వేకువ ఝామున 4.20 ని॥కు తరలి వచ్చిన కార్యకర్తలు 24 మంది కాగా ముగింపు సమయానికి 74 మందితో  కాసానగర్ ప్రధాన కూడలి జాతరను తలపించింది. అధిక సంఖ్యలో కార్యకర్తలు హాజరగుటకు ఆదివారం ఒక కారణం కాగా, జూన్ 5 న పర్యావరణ దినోత్సవ సందర్భంగా విజయవాడ నుండి మొక్కలు నాటుటకు విచ్చేసిన గైనకాలజిస్టుల అసోసియేషన్ డాక్టర్ల  బృందం మరొక కారణం.

    కార్యకర్తలు ప్రణాళిక ప్రకారం ముందు అనుకున్న విధంగా 24 మంది డాక్టర్ల బృందం మొక్కలు నాటుటకు అనువుగా డివైడర్ల లోని మట్టిని సారవంతముగా చేసి, గోతులు తీసి  డాక్టర్లచే మొక్కలు నాటించి వారిని ఆనందింప చేశారు. రహదారికి దిగువన నీడ నిచ్చే మొక్కలు నాటించి “మొక్కలు నాటుదాం! పర్యావరణాన్ని కాపాడుదాం!” అంటూ నినాదాల పలికించి, డాక్టర్ల బృందం ఆనందాన్ని తమ సంతోషంగా మలచుకున్నారు.

         మెజారిటి  కార్యకర్తలు చీపుళ్ళకు పనిజెప్పి  ఆ ప్రాంతాన్ని అరగదీసి, దుమ్ము ధూళిని, ఇరగదీసి, శుభ్రతతో సుందరమయం చేశారు. మన స్వచ్చ కార్యకర్తల తోని పనంటే  అట్లుంటది మరి.

         తుది సమీక్ష సమావేశంలో విజయవాడ నుండి వచ్చిన డాక్టర్ల బృందంలోని సభ్యులు ‘స్వచ్చ చల్లపల్లి’ కార్యక్రమం ద్వారా తాము పొందిన స్ఫూర్తిని ప్రియమైన సంభాషణల ద్వారా తెలియజేసి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

         నందేటి  శ్రీనివాస్ సందర్భాను సారంగా పాడిన పాటలు కార్యకర్తలలో మంచి ఉత్సాహాన్ని కలిగించడమే గాక, విచ్చేసిన అతిధులను అలరించాయి శ్రీనివాస్ చెప్పిన స్వచ్చ  నినాదాలతో తమ గొంతు కలిపి రేపటి కార్యక్రమం కాసానగర్ వద్దనే అని తెలుసుకుని నేటికీ కార్యకర్తలు వెనుదిరిగారు.

         అనంతరం డాక్టర్ల బృందం స్వచ్చ కార్యకర్తలచే అభివృద్ధి చేయబడిన ప్రాంతాలన్నిటినీ  చూసి పద్మావతి ఆసుపత్రిలో  స్వచ్చ చల్లపల్లి Power point presentation, వీడియో లు  చూసి విజయవాడకు బయలుదేరారు.

- భోగాది వాసుదేవరావు

   సుందరీకరణ కార్యకర్త

   స్వచ్ఛ సుందర చల్లపల్లి

   01.06.2025.         

         ఇవి గ్రాఫిక్స్అనడానికి

ఇవి గ్రాఫిక్స్అనడానికి వేలమార్లు పచ్చి నిజం

కనికట్లూ భ్రమఅనుటకు కళ్ల ఎదుటి వాస్తవం

అనుకొన్నది సాధించక ఆగదు ఈ ఉద్యమం

ఇంక ఎలా ఆగుతుంది స్వచ్చోద్యమ విజయం?

- నల్లూరి రామారావు,

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త.

   లాస్ ఏంజల్స్, USA.

   01.06.2025.