1991*వ రోజు....           24-Apr-2020

ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడవద్దు. 

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం - 1991* వ నాటి స్వచ్చ - శుభ్ర - గీతికలు

          యధాతధంగా – పట్టు సడలని, చెక్కు చెదరని 35 మంది గ్రామ కర్తవ్య పరాయణుల సొంత ఊరి స్వస్తతా మెరుగుదల ప్రయత్నాలు నేటి వేకువ కూడ  విజయవంతంగా నెరవేరి, సుందరీకరణ యజ్ఞం మినహా - బందరు మార్గంలోని అమరావతి రాజ ప్రాసాదం దగ్గరి వైజయంతం ఆవరణ అనుకొన్న కంటే మిన్నగా – కార్యకర్తల పూర్తి మనః తృప్తిగా జరిగింది. సమయం : 3.58 – 6.05 మరియు 6.40 కాలాల నడుమ.

గ్రామ విపత్తు నివారణ దళం కృషి గంగులవారిపాలెం దారిలో వారం క్రితం విద్యుత్ కార్మికులు నరికిన చెట్ల క్రమబద్ధీకరణతో మొదలై, బండ్రేవు కోడు మురుగు కాల్వ గట్టు మీది చెట్ల రక్షణతో ముగిసింది. విజయవాడ, నడకుదురు, గంగులవారిపాలెం బాటల్లో విద్యుత్ శాఖ వారి విచక్షణారహిత వృక్ష ఖండనలకు ప్రతిగా స్వచ్చోద్యమ రెస్క్యూ టీం వారి గత రెండు మాసాల నిరంతర మండనలు సాగుతూనే ఉన్నాయి.

          సుందరీకరణ యజ్ఞ కర్తలు బందరు రహదారి ఉత్తరపు దిక్కున గల వైజయంతం  ప్రహరీకి దిద్దుతున్న అందచందాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. వాళ్ళ బుర్రల్లో నుండి సృజన శీలతలు ఉబుకుతూనే ఉన్నాయి. నా మాటల్లో కంటే శంకర శాస్త్రి గారి సామాజిక మాధ్యమ ఛాయా చిత్రాల్లోనే సదరు నిజాన్ని గ్రహించవచ్చు.

          వైజయంతం ఆవరణ లోతట్టు భాగాలు – తూర్పు, ఉత్తర, దక్షిణ దిశలలో ఏ కాలుష్యం మిగలకుండ – అందవిహీనత తొంగి చూడకుండ రోడ్డు మీద వచ్చే – వెళ్ళే వారి దృష్టినాకర్షిస్తూ - వైజయంతం పేరును సార్ధకం (దేవేంద్రుని నగరి) చేస్తూ – కార్యకర్తలు తమకు పూర్తి సంతృప్తి కలిగేలా – స్వచ్చ – శుభ్ర – సుందరీకరణం నిర్వహించారు. నాల్గురోజుల క్రిందటి ఈ ఎకరం పైగా సువిశాల ఆవరణకూ నేటి స్వచ్చ – సుందరీకృత ప్రదేశానికీ పొలికే లేదు. పడిపోయిన గోడల కాలుష్యాలు, ముళ్ళ – పిచ్చి మొక్కలూ, తీగలు, గడ్డి, ఎండుటాకులూ ప్రయత్నించక రెండు మూడు నెలలదాక ఇలా శుభ్రంగానే ఉంటాయి. ముళ్ల తుమ్మలు కొన్ని మిగిలినా ఆవిప్పుడు వాళ్ళ చేతిలో పొందిక గా, అణకువగా మారిపోయాయి!

          కఠోర కరోనా కష్ట నేపధ్యంలో స్వచ్చ సైనికుల ఏ సేవా విన్యాసమూ ఆగలేదు. వేలాది మొక్కలకు ట్రస్టు టాంకరుతో నీళ్లందుతూనే ఉన్నవి. 6.15 తరువాత నందేటి శ్రీనివాసుడు గ్రామస్తుల్లో తన పాటల ద్వారా ఆరోగ్య చైతన్యం కలిగించే ప్రయత్నమూ సజావుగా సాగుతున్నది.

          ఎప్పుడో నాలుగేళ్ల క్రితం స్వచ్చ ఉద్యమం లో పాల్గొన్న – దాలిపర్రు నివాసి (ప్రస్తుతం చల్లపల్లి ప్రవాసి) నేటి కృషిలో పాల్గొన్న బొందలపాటి నాగేశ్వరరావు కు అభినందనలు!

          రేపటి మన కర్తవ్య నిర్వహణ ప్రధాన వేదిక నారాయణరావు నగర్ లోని ప్రధాన వీధి!

              ఒక సక్రమ పరిణామం

డజను మంది ఆలోచన, à ద్విశత జనుల మహాచరణ

ఉన్న ఊరి స్వచ్చ - శుభ్ర – స్వస్తతకెడతెగని తపన

ప్రతి నిముషం – ప్రత్యంగుళమున సౌందర్యోపాసన

గతైదేళ్ళ స్వచ్చోద్యమ క్రమ పరిణామం ఇదేన?

- నల్లూరి రామారావు

స్వచ్చ సుందర చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు – మనకోసం మనం ట్రస్టు

శుక్రవారం 24/04/2020 

చల్లపల్లి.

3.58 కు చిన్నరాజా గారి ఇంటి వద్ద
సుందరీకరణ బృందం
రెస్క్యూ టీమ్