3492* వ రోజు....           06-Jun-2025

 ఒక్కసారికి మాత్రమే  వాడి  పారేసే ప్లాస్టిక్ వస్తువులకు మేమెంతో దూరం!

6.6.2025 వ తేది 3492 * వ రోజు శ్రమైక జీవన సౌందర్యం!

         తెల్లవారు జామున 4:15 ని॥ 12 మందితో ప్రారంభమైన స్వచ్ఛ సేవలు హైవే రోడ్డుకు ఉత్తరం వైపు  సువర్ణ గన్నేరు మొక్కల మధ్యన ఉన్న మాచర్ల కంప, గడ్డిని కొందరు తొలగించారు.  క్రింది భాగంలో పెద్ద మొక్కల చుట్టూ ఉన్న కలుపును ఏరివేస్తూ, వంగి పోయిన మొక్కలకు కర్రలు పాతి, సరిజేసి పాదులు చేయటం జరిగింది.

         రోడ్డు అంచున ఎత్తుగా ఉన్న పిచ్చి గడ్డిని మిషన్ తో కట్ చేసి చీపుళ్ళ తో ఊడవడం వలన చూపరులకు ఎంతో ముచ్చట గొలుపుతున్నది. కాసానగర్ నుండి క్లబ్ రోడ్డు వరకు సుమారు 2 ¼ కిలో మీటర్లు ఉన్న దారిని అటు ఇటు మొత్తం మొక్కలతో నింపి, వాటిని పెంచి పోషించడం అంటే మాటలు కాదు, కంప కట్టి, నీరు పోసి, కలుపు తీసి, కర్ర కట్టి ఇలా ఎన్నో సేవలు అందితే కానీ ఒక మొక్క నీడనిచ్చే వృక్షంగా మారదు. అలా చేయడం వెనుక కార్యకర్తల సమయ శ్రమ త్యాగం వారు ఎంచుకొన్న లక్ష్యం నిజంగా అనన్య సామాన్యం.

         కొద్ది రోజులుగా వాతావరణంలో మార్పులతో తెల్లవారు జాము నుండి కూడా గాలి లేకుండా విపరీతమైన ఉక్కపోత పోయడం ఆ సమయం లో 2 గంటల పాటు శ్రమిస్తున్న కార్యకర్తలు చెమటతో తడిసి ముద్దవడం పరిపాటిగా మారింది. కానీ సమాజంలోని అందరి కోసం పాటు పడే ఈ కార్యకర్తలకు, పెరుగుతున్న మొక్కల్లో వీస్తున్న చల్లటి గాలుల్లో , విరౠసిన పూలల్లో ఇంపుగా ఇమిడి, కెంపై మెరుస్తున్న ఎండలో నిగనిగలాడే వారి చెమట చుక్కలే వారు నింపుకున్న స్ఫూర్తి.

         6 గంటలకు యథా ప్రకారం మ్రోగిన విజిల్ తో అందరూ పనిముట్లను పక్కనెట్టి, కాఫీ కప్పు చేత బట్టి ఒకరినొకరు పలకరించుకుంటూ 10 ని॥ లు సేద తీరిన పిదప మాలెంపాటి అంజయ్య గారు బిగ్గరగా పలికిన ‘జై స్వచ్చ సుందర చల్లపల్లి’ నినాదం ఒకసారి గుండె జల్లుమన్నట్లయింది. తదుపరి డాక్టరు గారు మాట్లాడుతూ ముక్త్యాల  గ్రామం నుండి స్వచ్చ చల్లపల్లి సందర్శనార్దం రేపు ఉదయం 5 గంటలకు 30 మంది బస్సులో రాబోతున్న విషయం తెలియపరచగా రేపు కలవవలసిన  పని ప్రదేశం హైవే రోడ్డు లో ఈ రోజు పని ఆపిన ప్రదేశమని ఒకసారి గుర్తు చేసుకుని నిష్క్రమించుట జరిగినది.

 

స్వచ్చ చల్లపల్లి కార్యకర్తలతో చేయి కలిపి

సుందర చల్లనిపల్లికి ఒకరికొకరు భుజం కలిపి

మానవాళి మనుగడకు ఆధారం చెట్లుగా

నాటండిక మొక్కలను నేల ఈని నట్లుగా             

- నందేటి శ్రీనివాస్

   ప్రజాకళాకారుడు

   06.06.2025

              కర్మిష్టులిచట

ఊరికి మేలొనగూర్చే ఉపకారులు కలరిచ్చట

ఘర్మజలం - ధర్మజలం కార్చే కర్మిష్టులిచట

పురిటిగడ్డ బాట ప్రక్క - NTR పార్కు వద్ద

ఆ తపస్సు గమనిస్తూ వారసత్వమందుకొనుడు

-  నల్లూరి రామారావు,

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త.

   లాస్ ఏంజల్స్, USA.

    06.06.2025.