3494* వ రోజు ....           08-Jun-2025

ఒకసారి వాడిపారేసే ప్లాస్టిక్ వినియోగం మనకెందుకు

పర్యావరణ పరిరక్షణకు ప్రతినబూని పదముందుకు

ది. 08.06.2025 ఆదివారం 3494* వ రోజు నాటి స్వచ్చ సేవలు

         వేకువ జాము 4:16 ని॥లకు హైవే రోడ్ లోని కొత్తూరు రోడ్ జంక్షన్ కు అతి సమీపంలో 13 మందితో ప్రారంభమయిన శ్రమయజ్ఞం నిర్విరామంగా కొనసాగింది. మొక్కలకు దిగువ భాగంలో అనగా నీడనిచ్చు మొక్కలకు చుట్టూ ఉన్న మాచర్ల కంప, పిచ్చి దొండ తీగలను తొలగించి మొక్కలకు గాలి తగిలి స్వేచ్చగా పెరగడానికి వీలుగా చేయడం జరిగింది.

         కొద్ది మంది ఆ మొక్కల చుట్టూ బలంగా మొదట్లో మట్టిని పోసి పాదు చేయడం, పెద్ద మొక్కలు వంగిపోతే తాడుతో సరిచేసి కట్టడం లాంటి మొక్కల పరిరక్షణ ధ్యేయంగా పని చేసినారు. రోడ్డు అంచున గడ్డిని మాత్రం మిషన్ తో కట్ చెయ్యడం వలన త్వరితగతిన ఎక్కువ భాగం పూర్తయింది.

         ఈరోజు కొంతమంది కార్యకర్తలు 10 టెంపుల్ గన్నేరు మొక్కలను నాటడం జరిగింది. దారి ప్రక్క గతంలో నాటిన గద్ద గోరు మొక్కలు మాత్రం రకరకాల పూలతో చూపరులను ఎంతో ఆకర్షిస్తున్నాయి.

         చివరి ఘట్టంలో కొంతమంది లోడింగ్ బ్యాచ్ గడ్డి ప్రోగులను ట్రాక్టర్ కు ఎత్తి చేసిన వరకు పనిని పూర్తి స్థాయిలో శుభ్రపరచడం జరిగింది. 6 గం॥ విజిల్ మ్రోగగానే మొత్తం 30 మంది కార్యకర్తలూ వచ్చి కాఫీ సేవించిన కొద్ది సేపు పని పాటల ముచ్చట్లాడుకుని సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.

         ప్రముఖ కళాకారుడు బోలెం రామారావు గారు జై స్వచ్చ సుందర చల్లపల్లి నినాదం పలికి, ఈరోజు రాత్రి పార్కులో జరగబోవు నాటక ప్రదర్శనలు తిలకించవలసిందిగా ఆహ్వానించారు.

         డాక్టరు గారు నేటి పని సమీక్షతో పాటు నిన్న ముక్త్యాల గ్రామస్తులతో జరిగిన సంభాషణలను కార్యకర్తలతో పంచుకుని,

         రేపు కలవవలసిన చోటు ఇక్కడే అని అనుకుని నిష్క్రమించిరి.

         చూడు చూడు సిత్రం

తళ తళ మెరిసే దారులు చూడూ దారి ప్రక్కన మొక్కలు చూడు

మొక్కల పూల గుత్తులు చూడు

స్వచ్చ సైనికుల శ్రమలో ఒదిగిన

సుందర చల్లపల్లిని చూడు        

- నందేటి శ్రీనివాస్

   ప్రజాకళాకారుడు

   08.06.2025

 

         హీరోలా కాద వాళ్లు?

నాలుగు లక్షల గంటల శ్రమదానం చేయువాళ్ళు

వేకువ నాల్గింటి నుండె వీధులన్ని ఊడ్చు వాళ్లు

చెట్లు నాటి రహదార్లను హరితమయం చేయువాళ్లు

ఇరవయ్యొకటో శతాబ్ది హీరోలా కాద వాళ్లు?

- నల్లూరి రామారావు,

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త.

   లాస్ ఏంజల్స్, USA.

    08.06.2025.