సింగిల్ యూజ్ ప్లాస్టిక్ సంచుల వాడకం వద్దు!
గుడ్డ సంచుల వాడకమే ముద్దు!
09.06.2025 – సోమవారం 3495* వ రోజు నాటి శ్రమదాన విశేషములు!
తెల్లవారు ఝామున 4:16 ని॥లకు వేకువ సేవ 10 మందితో ప్రారంభమయింది. హైవే లో శివరామపురం దగ్గరగా రహదారికి దిగువున ఎడమ ప్రక్కగా కలుపు మొక్కలను పీకుతూ, మొక్కల మొదళ్ళలోని చెత్తను వేరుచేస్తూ, మొక్కలకు పాదులు చేస్తూ ప్రత్యేక దళ సభ్యులు 6 గురు శ్రమిస్తుండగా వారికి సహాయంగా గొర్రులతో చెత్తను పోగు పెడుతూ కొందరు, డిప్పలకెత్తి ట్రాక్టర్ లో చెత్తను లోడ్ చేస్తూ మరికొందరు ఇష్టంగా కష్టపడడం కనిపించింది.
వారికి కాస్త ఎగువున ఇద్దరు సీనియర్ కార్యకర్తలు కలుపు మొక్కలతో కూడిన కంపను మొక్కల నుండి వేరుచేసి పోగు పెట్టడం కనిపించింది.
గ్రాస్ కట్టర్ మిషన్ తో రహదారి అంచును శుభ్రం చేస్తూ నిపుణుడైన కార్యకర్త శ్రమించడం కనిపించింది. వారికి సహాయంగా చీపుళ్ళతో రహదారిని శుభ్రం చేస్తూ మరికొంత మంది వారి పనిలో లీనమై కనిపించారు.
కాఫీ ఆస్వాదన అనంతరం శివబాబు గారు చెప్పిన స్వచ్చ నినాదాలతో గొంతు కలిపి,
రేపటి కార్యక్రమం హైవేలో శివరామపురం రోడ్డు వద్దనే అని తెలుసుకుని కార్యకర్తలు నేటికి స్వస్తి పలికి నిష్క్రమించారు.
- భోగాది వాసుదేవరావు
సుందరీకరణ కార్యకర్త
స్వచ్ఛ సుందర చల్లపల్లి
09.06.2025
నిజమైన తారలంటే....? అసలైన సెలబ్రిటీలంటే....?
వెండి తెర మీద తళుక్కుమనే తారలు కావచ్చు
సిక్సర్లు దంచే క్రికెట్ వీరులు కావచ్చు
కళామతల్లి ముద్దు బిడ్డలనిపించవచ్చు
ఆ హీరోల పౌరుష సాహసాలకూ
హీరోయిన్ల తళుకు బెళుకులకూ
క్రికెటర్ల గెలుపులకూ, బౌలర్ల బంతి విసుర్లకూ
పునాదులు మాత్రం కీర్తి-ధన దాహాలే కదా!
స్టార్ క్రికెటర్ల కరస్పర్శల – సినీ తారల ఆటో గ్రాఫ్ ల ఖరీదులు
ఇన్నిన్ని త్రొక్కిసలాటలా? ఇందరి నిండు ప్రాణాలా??
X X X X X X
మరోవంక – చల్లపల్లిలో –
తమ ఊరి మేలు కోసం దశాబ్దాలుగా శ్రమిస్తూ
వీధులూడ్చి, కాలుష్యాల కెదురొడ్డి,
శ్మశానాల్ని సుందరీకరించి,
రహదార్లకు పచ్చదనాల సొగసులద్ది,
పాతిక వేల ప్రజల ముఖాల్లో చిరునవ్వులు పూయించేందుకు -
మట్టి కొట్టుకుంటున్న బట్టలతో
డ్రైన్లలో - వీధి బురదల్లో
నిస్వార్ధంగా ఆరుగాలాలూ చెమటలు చిందిస్తూ –
పర్యావరణ భద్రతను సాధిస్తూ –
భావితరాల సుఖమయ జీవనానికి హామీనిస్తున్న
చల్లపల్లి స్వచ్ఛ సుందర కార్యకర్తలు గదా
సిసలైన సెలబ్రిటీలు? సామాజిక బాధ్యతా ధృవతారలు??
- నల్లూరి రామారావు,
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త.
లాస్ ఏంజల్స్, USA.
09.06.2025.