ప్లాస్టిక్ సంచుల వాడకం వద్దు!
గుడ్డ సంచుల వాడకమే ముద్దు!
10-06-2025 – మంగళవారం – 3496* వ రోజు నాటి సంగతులు.
వేకువ ఝామున 4:13 ని.లకు 10 మందితో ప్రారంభమయిన స్వచ్ఛ సేవ ముగింపు సమయానికి 25 మందితో కళకళలాడింది. ప్రత్యేక దళ సభ్యులు 6 గురు కాసానగర్ చెక్ పోస్ట్ దగ్గరలో హైవేకు దిగువన గతంలో నాటిన నీడనిచ్చే మొక్కల వరుసలో మరిన్ని మొక్కలు నాటుటకు అనువుగా గుంటలు తీయటం కన్పించింది. ముగింపు సమయానికి 12 మొక్కలు పెట్టుటకు గాను గోతులు తీశారు. రేపు మరిన్ని మొక్కలు నాటుటకు ఆ ప్రాంతాన్ని ముస్తాబు చేస్తారు.
హైవేలో శివరామపురం రోడ్డుకు దగ్గరలో పూల మొక్కల దగ్గర పాదులు తీసి శుభ్రం చేస్తూ కొంత మంది కార్యకర్తలు కన్పించారు.
హైవేకు రహదారి అంచున అడ్డదిడ్డంగా ఏర్పడిన రద్దును పలుగు, పారలనుపయోగించి డిప్పల కెత్తగా డాక్టర్ పద్మావతి మేడం మోసి రోడ్డు ప్రక్క పల్లాలను సరిచేయడం కన్పించింది.
ముగింపు సమయంలో అప్పటి వరకు ఏర్పడిన చెత్తను డిప్పలలోకెత్తి ట్రాక్టర్ లో వేస్తూ కొందరు, చీపుళ్ళకు పని జెప్పి చేసిన ప్రాంతం శుభ్రంగా ఉంచడంలో మరికొందరు పనిలో లీనమై ఉషారుగా కన్పించారు.
కాఫీ ఆస్వాదన అనంతర సమావేశంలో వేల్పూరి ప్రసాద్ పలికిన స్వచ్ఛ నినాదాలకు తమ గొంతు కలిపి,
రేపటి కార్యక్రమం శివరాంపురం రోడ్డు వద్దనే అని రూఢి చేసుకుని నేటికి మరలినారు.
స్వచ్ఛ కార్యకర్త కొర్రపాటి వీరసింహుడు గారు ఉదయం కార్యక్రమంలో కార్యకర్తలకు నోరు తీపి చేయగా వారి శ్రీమతి ఇందిర గారితో కలిసి ఆసుపత్రికి వెళ్లి ఇటీవలె కాలం చేసిన వారి అత్తగారు రావెళ్ళ వెంకట సుబ్బమ్మ గారి జ్ఞాపకార్ధం 10,116/- రూపాయలను స్వచ్చోద్యమం కోసం విరాళంగా ఇవ్వడం జరిగింది.
- భోగాది వాసుదేవరావు
సుందరీకరణ కార్యకర్త
స్వచ్ఛ సుందర చల్లపల్లి
10.06.2025.
‘స్వచ్ఛోద్యమ చల్లపల్లి’ అనగా
పారదర్శకత ఎచ్చట పరిఢవిల్లు చుండునో –
శ్రమ జీవనమున కెక్కడ గౌరవం లభించునో –
ఊరును సాంతం చేసుకు ఉద్దరించు చుందురో –
‘స్వచ్ఛోద్యమ చల్లపల్లి’ అనగా అదియే సుమా!
- నల్లూరి రామారావు,
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త.
లాస్ ఏంజల్స్, USA.
10.06.2025.