3497* వ రోజు ....           12-Jun-2025

 ఒకసారి మాత్రమే వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువుల వినియోగం మనకొద్దు!

3497* వ రోజు శ్రమదాన విశేషాలు!

          12.06.2025 గురువారం తెల్లవారు జాము 4:14 ని. హైవే రోడ్ లోని కొత్తూరు జంక్షన్ వద్ద 11 మందితో ప్రారంభమయిన స్వచ్చంద సేవలు హైవే రోడ్డుకు ఒక ప్రక్కన చక్కగా పెరిగిన పారిజాతం మొక్కల చుట్టూ కలుపు తీయడం జరిగింది. మరికొంతమంది ఈ మొక్కల దిగువన శుభ్రపరచడం, నీడనిచ్చే మొక్కల చుట్టూ బాగు చేయడం జరిగింది.

         గడ్డి కోత యంత్రంతో రోడ్డు అంచు భాగం కటింగ్ చేయడం జరిగింది. కొట్టిన గడ్డి, తుక్కును కొంతమంది లోడ్ చేయడం జరిగింది. అడుగున ముళ్ళ కంపతో పైన పిచ్చి తీగ ప్రాకి అస్తవ్యస్తంగా ఉన్న కొంత భాగాన్ని నలుగురు కార్యకర్తలు కొద్ది సేపు శ్రమించి ఆ భాగాన్ని చక్కగా పరిశుభ్రపరిచారు.

         రెస్క్యూ టీం బృందం అనగా కొండల్ని సైతం పిండి చేయగల యువ కార్యకర్తలు రేపు నాటవలసిన మొక్కలకు గోతులు తీయడం జరిగింది.

         6 గం.ల సమయానికల్లా విజిల్ మ్రోగగానే మొత్తం 19 మంది పనికి విరామమిచ్చి కాఫీ సేవించిన పిదప షణ్ముఖ శ్రీనివాస్ గారు పలికిన జై స్వచ్ఛ సుందర చల్లపల్లి నినాదంతో అందరూ గొంతు కలపడం జరిగింది.

         డాక్టరు గారు మాట్లాడుతూ ఈరోజు జరిగిన పనిని ఉదహరిస్తూ 2017 లో కార్యకర్తలు నాటి, వారి శ్రమతో పెరిగిన మొక్కలు ఈ రోడ్డు (కొత్తూరు) పొడవున కొమ్మలే చేతులుగా రారమ్మని స్వాగతం పలుకుతున్నాయన్నారు.

 

గత నెల జమా ఖర్చుల విషయాలను తెలియజేసిన పిదప, రేపటి కార్యక్రమం హైవే రోడ్ లోని ఈ జంక్షన్ సమీపంలో బస్ స్టాప్ వద్ద కలుద్దామనుకుని నిష్క్రమించారు.

         పదండి ముందుకు

ముందుకు సాగండి - మునుముందుకు సాగండి

మన చల్లపల్లి బాగు కొరకు - వెనుకడుగు వేయకండి

శుభ్రపడిన దారుల్లో - చెత్త లేని వీధుల్లో

పెరిగిన ఆ వృక్షాల్లో వీచే చల్లగాలుల్లో

మీ త్యాగం ఇమిడి ఉంది తెలుసుకోండి తెలుసుకోండి!

- నందేటి శ్రీనివాస్

   ప్రజాకళాకారుడు

   12.06.2025

 

        ఇప్పుడైన గ్రహించరే!

వందల మందిని హీరో వాయించేస్తున్నప్పటి

హీరోయిన్ మెలి తిరుగుచు హొయలు పోవుచున్నప్పటి

హంగు స్వచ్ఛ కార్యకర్త శ్రమలో కనిపించదే!

ఏది భ్రమో కనికట్టో ఇప్పటికీ తెలియదే!

ఏది మహోత్కృష్టమో ఇప్పుడైన గ్రహించరే!

- నల్లూరి రామారావు,

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త.

   లాస్ ఏంజల్స్, USA.

    12.06.2025.