ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువులు వినియోగించొద్దని చెపుదాం
పర్యావరణాన్ని కాపాడుకొనుట మనందరి బాధ్యతని చాటుదాం.
18.06.2025 బుధవారం 3503* వ రోజు పని విశేషాలు!
216 జాతీయ రహదారిపై అప్రతిహతంగా కొనసాగుతున్న స్వచ్చ సేవ ఈరోజు తెల్లవారుజామున 4:22 ని. హైవే పై మొదలైంది.
పెరుగుతున్న మొక్కల చుట్టూ కలుపు తీసి శుభ్రం చేయడం, క్రింది భాగంలో పెద్ద మొక్కలు పెట్టే ప్రాంతం కూడా పిచ్చి మొక్కలను తీసి శుభ్రపరచడం జరిగింది.
ఈ వర్షాకాలం ప్రారంభంలోనే ఇంకా మొక్కలను నాటాలనే సంకల్పంతో ముందుగానే మొక్కలు నాటే ప్రాంతాన్ని బాగుచేయడం జరుగుతుంది.
మరికొంతమంది కార్యకర్తలు హైవేలో కొత్తూరు జంక్షన్ దాటిన తరువాత బస్టాప్ కు అతి సమీపంలో కొట్టి వదిలేసిన చెట్టు మొదలును సరిచేసి అక్కడ ఉన్న ఎండిపోయిన తాటాకు తాడి చెట్లను అడ్డదిడ్డంగా లేకుండా సరిచెయ్యడం జరిగింది. ఆ తరువాత ఈరోజు, నిన్న జరిగిన పని ద్వారా వచ్చిన చెత్తను లోడ్ చెయ్యడం జరిగింది.
మహిళా కార్యకర్తలు మాత్రం ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ అంటే చీపుళ్ళతో పని చెయ్యడం, గొర్రులతో, దంతులతో చివరికి కత్తులతో కూడా కలుపు గడ్డిని కోయడం లాంటి అనేక పనులను మహిళా కార్యకర్తలు నిర్వహిస్తుండడం “ఎక్కడమ్మా నువ్వు లేనిదీ, ఏమిటీ నువు చెయ్యలేనిది” అన్నట్లుగా ఓ ప్రత్యేకతగా ఉంటుంది.
6 గం. విజిల్ మ్రోగగానే అందరూ పనికి విరామం చెప్పి కాఫీ సేవించిన పిదప సమీక్షా సమావేశంలో ఈరోజు తన విదేశీ పర్యటన ముగించుకొని స్వచ్ఛ సేవకు విచ్చేసిన దేసు మాధురి గారి “జై స్వచ్ఛ సుందర చల్లపల్లి” నినాదంతో గొంతు కలిపి, దుబాయి పర్యటనా విశేషాలు వారు చెప్పగా ఆలకించిరి.
రేపు కలవవలసిన ప్రదేశం ఈ రోజు పని ముగించిన చోటు అని అందరూ అనుకుని నిష్క్రమించారు.
నిన్న శివరాంపురం కార్యకర్త BDR గారి ద్వారా ఓ అజ్ఞాత దాత 1000/- విరాళం ట్రస్టు అకౌంట్ కి బదిలీ జరిగినది.
గాంధీజీ బ్రతికుంటే మీ గడపకొచ్చేను
ఘనమైన మీ పోరు చూసి గర్వించేను
త్యాగమూర్తుల కన్న తల్లి నువ్వే మా
స్వచ్ఛ సుందర చల్లపల్లీ..
- నందేటి శ్రీనివాస్
ప్రజాకళాకారుడు
18.06.2025
ఏమాశ్చర్యం! ఎంత విశేషం! – 2
త్యాగమెవరిదో - సేవలెట్టివో తరచి చూస్తిరా ఎపుడైనా?
వ్యాపారస్తులు, ప్రముఖ వైద్యులూ, గ్రామానికి ప్రప్రథమ పౌరులూ
కొడవలి ధరించి, చీపురందుకొని కొంగు బిగించుట చూచితిరా?
ఊరుమ్మడి మేలుకు పిన్నలు పెద్దలు ఉద్యమించుట గ్రహించితిరా?
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
లాస్ ఏంజల్స్ - USA
18.06.2025.