ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువుల వినియోగం – పర్యావరణానికి పెనుప్రమదాం.
19.06.2025 గురువారం 3504* వ రోజు స్వచ్ఛ సేవల ఘట్టములు!
వేకువ జామున 4:15 నిమిషములకు 17 మందితో గ్రామసేవలు మొదలైనవి 216 జాతీయ రహదారికి పూల చెట్ల సోయగాలితో అలరారుతున్న ఆ ప్రదేశంలో ఒక ప్రక్క సువర్ణ గన్నేరు, టెకోమా రెడ్ మొక్కల మధ్యన, వాటి పాదుల చుట్టూ ఉన్న కలుపును తీసి కార్యకర్తలు ఆ పువ్వుల అందాలను ఆస్వాదిస్తూ పని చేస్తూ ఉన్నారు.
ఒక గ్రామ స్వచ్ఛత, శుభ్రతా, అందాల కోసం వేరువేరు వృత్తులలో పనిచేస్తున్న అనేక మంది సమూహం ఆ ప్రాతః కాల సమయంలో కలిసి పని చేయడం నిజంగా ఈ గ్రామం చేసుకున్న అదృష్టం.
రోడ్డు పొడవునా దారి ప్రక్క పచ్చి గడ్డిని మిషన్ తో కట్ చేస్తూ ఉంటే రహదారి మార్జిన్ లు చాలా చూడముచ్చటగా ఉన్నాయి మరికొంత మంది కార్యకర్తలు కోసిన గడ్డి, పిచ్చి మొక్కలను గుట్టలుగా పేర్చడం జరిగింది.
ఇక్కడ ప్రతి కార్యకర్తా అవలంబించే పద్దతి ఎంతో ఆశ్చర్యకరంగా ఉంటుంది. స్వచ్ఛ చల్లపల్లి ఉద్యమ లక్ష్యంలో భాగంగా ప్రతి ఒకరూ వారికి నచ్చిన పని చేయడం అందుకు వారికి ఇష్టమైన పనిముట్లను చేత బూని పనిచేయడం, ఏ పనయినా వారు చేయగలిగినంత చెయ్యడం, సానుకూల దృక్పధంతో మాట్లాడుకుంటూ, ఒకరిపై ఒకరు హాస్యంతో కూడిన చతుర్లాడుతూ స్వేచ్చగా పని చెయ్యడం ఈ స్వచ్చంద ఉద్యమంలో ప్రతి ఒకరికీ ఎంతో తృప్తినిస్తుంది.
అలా జరుగుతున్న పనిలో 6 గంటల సమయానికల్లా విజిల్ మ్రోగగానే మొత్తం పనికి విరామమిచ్చి 5 నిమిషాల పాటు కాఫీ సేవించి సేదతీరి సమీక్షా సమావేశంలో ‘ప్రశాంతి’ వినిపించిన జై స్వచ్ఛ సుందర చల్లపల్లి నినాదంతో గొంతు కలిపి,
రేపు కలవవలసిన ప్రదేశం శారదా గ్రాండియర్ (కళ్యాణ మండపం) సమీపంలో అనుకుని నిష్క్రమించారు.
నాటేది ఒక్క మొక్క వేసేది నూరుకొమ్మ
కొమ్మ కొమ్మ విరగబూసి వేలాదిగా
అది కాయాలి బంగారు కాయలూ
భోం చెయ్యాలి మీ పిల్ల కాయలూ
- నందేటి శ్రీనివాస్
ప్రజాకళాకారుడు
19.06.2025
ఏమాశ్చర్యం! ఎంత విశేషం! – 3
ముప్పై-నలభై మంది శ్రమతోనే ముఖ్య గ్రామమున మార్పులకై
నాలుగు లక్షల పని గంటల శ్రమ నాట్య భంగిమలు చూచుటకై
ఇవి గ్రాఫిక్సో - కటిక నిజాలో వివరమైన పరిశీలనకై
దూర ప్రాంత పర్యాటక మిత్రులు గమనించితిరా ఎపుడైనా?
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
లాస్ ఏంజల్స్ - USA
19.06.2025.