3505* వ రోజు .. ....           20-Jun-2025

 ఒకసారి మాత్రమే వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువుల వాడకం మానేద్దామని నినదిద్దాం!

20.06.2025 శుక్రవారం 3505* వ రోజు స్వచ్ఛ యజ్ఞం!

          హైవే రోడ్ లోని కళ్యాణ మండపం సమీపంలో 12 మందితో ప్రారంభమై మొక్కల చుట్టూ ఉన్న కలుపును ఏరివేయ్యడం రోడ్డుకు దిగువ భాగాన ఉన్న రెళ్ళు గడ్డి దుబ్బులను తీసివేసి ఉన్న మొక్కలకు గాలి, సూర్యరశ్మి తగిలేలా శుభ్రం చెయ్యడం జరిగింది. కొంతమంది మిషన్ తో మరికొంత భాగం రోడ్డు ప్రక్క గడ్డిని కత్తిరించడం రోడ్ మార్జిన్ పొడవునా అందంగా తీర్చిదిద్దడంలో తలమునకలయ్యారు.

         స్వచ్చందంగా చేసే పని అయినా కార్యకర్తలు ఒక్కొక్కరు కొంత భాగాన్ని కేటాయించుకుని కాంట్రాక్ట్ పనివారిలాగా ఎవరి భాగం వారు పూర్తిగా పనిచేసి వేరొక ప్రదేశంలోకి వెళ్ళడం అక్కడ పనిని కొనసాగించడం ఎంతో నిబద్ధత కలిగిన విషయం.

         ఒక్కొక్కరూ వచ్చి చేరికతో మొత్తం 25 మంది కార్యకర్తలు రోడ్డు పొడవునా నీడనిచ్చే మొక్కలు పెట్టడానికి ఆ ప్రదేశమంతా పరిశుభ్రం చెయ్యడం జరిగింది.

         మరికొంతమంది కార్యకర్తలు ఆదివారం మొక్కలు నాటడానికి ముందుగా 30 గోతులను తీసి సిద్దం చేశారు. 6 గంటలకి విజిల్ మ్రోగగానే అందరూ పనికి విరామం ఇచ్చి, కాఫీ తీసుకున్న తరువాత జరిగిన నేటి సమీక్షలో సౌభాగ్యవతి చెప్పిన స్వచ్ఛ సుందర చల్లపల్లి నినాదములు క్రమం తప్పక అందరూ పలకడం జరిగింది.

         తరువాత డాక్టరు గారు మాట్లాడుతూ 2 సంవత్సరాల క్రితం నాటిన ఈ పూల మొక్కలను చూస్తుంటే ఎంత ఆనందం చెప్పటానికి మాటలు రావడం లేదన్నారు. నిజంగా ఈ పని ఎవరు చేస్తారు? సమాజంలో మనతోపాటు అందరి కోసం పని చేయడంలో ఎంతో సంతృప్తి ఉంటుందన్నారు.

         రేపు కలవవలసిన ప్రదేశం కూడా కళ్యాణ మండపం ప్రాంతమేనని అనుకుని నిష్క్రమించారు.

                 నేను సైతం

దారులన్నీ పొదలు మూసి మలవిసర్జన బాహ్యమైతే

చెత్త రోడ్లను కమ్ముకొస్తే ప్రజారోగ్యం పడకవేస్తే

దోమలీగలు ముసిరి జబ్బులు దుందుభిలు మ్రోగించినప్పుడు

జనంలో చైతన్య ముండక దిక్కుతోచక దారికొనక

కలవరించి కలత చెంది క్రాగిపోయానే!     

- నందేటి శ్రీనివాస్

   ప్రజాకళాకారుడు

  20.06.2025

        

         ఏమాశ్చర్యం! ఎంత విశేషం! – 4

ముప్పై నలభై మంది గ్రామమును మొత్తంగా మార్చేస్తురనీ

పదకొండేళ్లుగ ఉడుం పట్టుతో అనుకొన్నది సాధింతురనీ

ఎవరూహించిరి ఈ కాలంలో ఇట్టి సంఘటన దేశంలో?  

ఇదే కదా ఒక మేటి చరిత్రకు వీళ్లు చుడుతున్న శ్రీకారం?

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

   లాస్ ఏంజల్స్ - USA

    20.06.2025.