ఒకసారి మాత్రమే వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువుల వాడకం పెను ప్రమాదం!
వాటిని నిషేదించుకుంటే మన భూగోళం విషమతుల్యం.
21.06.2025 శనివారం 3506* వ రోజు స్వచ్ఛ సేవలు జరిగిన తీరు తెన్నూ !
హైవే రోడ్ లోని కళ్యాణ మండపం ఎదురుగా దారి పొడవునా రోడ్డు క్రింది భాగంలో ఏపుగా పెరిగిన కలుపు గడ్డిని శుభ్రం చేస్తూ, అక్కడక్కడా ఉన్న ముళ్ల పొదలను తొలగించడం, అంతకు ముందు పెరిగి వంగిపోయిన నీడనిచ్చు మొక్కలకు కర్రలను పాతి నిటారుగ ఉండే లాగున కట్టి సరిచేయడం జరిగింది.
ఈ రోజు తెల్లవారు జామున 4.14 నిమిషాలకు 20 మందితో ప్రారంభమయిన స్వచ్ఛ సేవ క్రమక్రమంగా కార్యకర్తల సంఖ్య పెరుగుతూ 42 మందితో ఎంతో ఉత్సాహభరితంగా సాగింది. ప్రతి ఒకరూ ఒకటి లేదా రెండు అవసరమయిన పనిముట్లు చేతపట్టి ఏ ప్రదేశంలో ఎవరి అవసరముందో వారు, పనిలో దశాబ్దికాలం పాటు రాటు తేలిన నైపుణ్యంతో పని చేసిన ప్రతి భాగాన్ని చూడముచ్చటగా తయారు చెయ్యడం వారి దైనందిన కర్తవ్యం.
‘మనకోసం మనం’ అనే స్ఫూర్తి తో గ్రామ స్వచ్ఛ శుభ్ర సౌందర్యానికి వయో బేధంతో పని లేకుండా నేను సైతం అంటూ అడపావారిపాలెం నుండి వచ్చిన 80 సంవత్సరములు పైబడిన మహిళా కార్యకర్త, రామానగరం నుండి ఈ రోజు స్వచ్చ సేవలో పాల్గొన్న 10 సంవత్సరాలు వయసున్న బాలుడు ట్రాక్టర్ ఎక్కి పని చెయ్యడం, ఇంకా అనేక మంది విద్యావంతులు, విశ్రాంతి ఉద్యోగులు, రైతులు, ప్రైవేటు ఉద్యోగులు ఈ సేవలో పాల్గొని మనకు చేతనైన పని మనం చేద్దాం అనుకొని రావడం చూస్తుంటే గురవారెడ్డి గారు బహూకరించిన టాటా ఏస్ ట్రక్ వాహనం ప్రారంభించిన నాటి కలెక్టర్ అహ్మద్ బాబు గారు మాట్లాడుతూ భవిష్యత్ లో దీనిలో లేని వారు “స్వచ్ఛ చల్లపల్లి ఉద్యమంలో నేనెందుకు పాల్గొనలేక పోయానా” అని బాధపడే సమయం వస్తుంది అన్న మాట గుర్తుకు వస్తుంది.
6 గంటల వరకూ విరామ మెరుగక పరిశ్రమించిన కార్యకర్తలు కలిసి మనం మొక్కలు నాటవలసిన భాగాన్ని మొత్తం పరిశుభ్రంగా చేసి, గుంతలు తీసి సిద్ధపరుచుకోవటం జరిగింది.
సమయం పూర్తవగానే విజిల్ మ్రోగటంతో అందరూ పనికి విరామమిచ్చి చెమట చేతులు కడిగి కాఫీ కప్పు చేతబట్టి కొద్ది నిమిషాల కాఫీ విరామం తరువాత సమీక్షలో ముచ్చు రోహిణి “జై స్వచ్ఛ సుందర చల్లపల్లి” అని నినదించగా అందరూ ముక్త కంఠంతో సాదిద్దాం అని జై కొట్టడం. తరువాత డాక్టరు గారు మాట్లాడుతూ రేపు ఈ ప్రదేశంలోనే కలుసుకుని పై భాగం నుండి మొక్కలు పెట్టవలసిన పనిని వివరించి నిష్క్రమించిరి.
అనగా రేపు ఆదివారం మనం కలువవలసిన ప్రాంతం హైవే లోని కళ్యాణ మండపం దగ్గరే.
ఊరందం చూడు
ఆసుపత్రి రహదారిని చూడు
దారిప్రక్క అందాలను చూడు
పొలిమేరలలో నిను పలకరించె
కాలేజీ ముందు పూదోటలను చూడు
- నందేటి శ్రీనివాస్
ప్రజాకళాకారుడు
21.06.2025
ఏమాశ్చర్యం! ఎంత విశేషం! – 5
భగవదను గ్రహం కాదు, ప్రభుత్వాల వరం కాదు,
ఆకస్మిక – అయాచిత - అదృష్టాలు పట్ట లేదు
కార్యకర్త ప్రతి వేకువ కార్చు చెమట ఫలితం ఇది
అన్ని చోట్ల జరుగదగిన అత్యవసర ఘట్టం ఇది!
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
లాస్ ఏంజల్స్ - USA
21.06.2025.