ఒకసారి మాత్రమే వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువుల వినియోగం తప్పు!
వాటి వలన పర్యావరణానికి కలుగును పెను ముప్పు .
22.06.2025 ఆదివారం 3507* వ రోజు నాటి స్వచ్ఛ శ్రామికుల కార్యాచరణ !
216 వ జాతీయ రహదారిపై గత కొద్ది రోజుల నుండి జరుగుతున్న స్వచ్చ సేవల కొనసాగింపుగా ఈ రోజు 4.16 ని. లకు 19 మంది కార్యకర్తలు ముందుగా అనుకున్న ప్రకారం ట్రాక్టర్ లో ఉన్న నాటవలసిన మొక్కలతో, నక్కులు, పారలు, పలుగులతో మొక్కలు నాటడం మొదలు పెట్టవలసిన ప్రదేశానికి బయలు దేరారు. అక్కడ నుండి కొన్ని జట్లుగా విడిపోయి హరితమయం చేసే పనిని ప్రారంభించారు.
అతి తక్కువ వ్యవధిలోనే 41 మంది కార్యకర్తలు స్వచ్చ సేవలో భాగస్వాములై ఒకరు ట్రాక్టరు నుండి మొక్కలను దించడం, ఒకరు ఏ ప్రాంతంలో ఏ మొక్క పెట్టాలో నిర్దేశించి కవర్లు కోసి ఇవ్వడం, రోడ్డు నుండి మొక్క పెట్టవలసిన గోతుల వద్దకు మధ్యలో నలుగురు వ్యక్తులు ఒకరికొకరు అందుకుంటూ మొక్కలను నాటే వారికి అందించడం జరిగింది. అక్కడ ఉన్న బృందాల వారు సరిపడా గోతులతో మొక్కలను నాటి పూర్తిగా మట్టితో కప్పడం జరిగింది.
అలా ఈ రోజు కార్యకర్తలు “వృక్షో రక్షతి రక్షితః” అంటూ, ఎర్ర తురాయి, పచ్చ తురాయి, స్పితోడియాలాంటి పూలతో అలరారే నీడ నిచ్చు మొక్కలు, వివిధ రకాల మామిడి పళ్ల నందించే మామిడి, నేరేడు మొక్కలతో మొత్తం 80 మొక్కలు నాటి అసలైన పర్యావరణ ప్రాణదాతలుగా నిలిచారు.
ఒక బృందం కళ్యాణ మండపం ఎదురుగా రోడ్ మార్జిన్ లో ఉన్న చెత్తా చెదారాలు కలుపు మొక్కలు తీసి ఆ ప్రాంతాన్ని అందంగా మలచారు.
కానీ ఈ రోజు 4 గంటలకు మన కంటే ముందుగానే నేనున్నానంటూ ఆ ప్రాంతానికి చేరుకున్న సన్నపాటి తుంపర్ల వర్షం స్వచ్చ కార్యకర్తల మనో స్థైర్యం, లక్ష్యం ముందు కొద్ది సేపటికే వెనకడుగు వేయక తప్పలేదు.
ఎంతో ప్రణాళికా బద్ధంగా, సందడిగా సాగిన మన ఊరికి వేసే పచ్చని హారం నిర్విరామంగా కొనసాగింది. ఇంతకు ముందు ఈ ఊరి సందర్శనార్థం వచ్చిన పెద్దలు అనేక మంది ఈ ఉద్యమంలోకి యువత పాల్గొనాలి అని నొక్కి చెప్పేవారు. వారి ఆకాంక్షలకు అనుగుణంగా దశాబ్ది కాలం తరువాత నుండి పాత, క్రొత్త యువ కార్యకర్తలు కొండల్ని సైతం పిండి చేయగల యువరక్తం ఉప్పొంగుతూ ఈ స్వచ్చ సేవలో పాల్గొంటున్నారు.
6 గంటలకు విజిల్ మ్రోగగానే పనికి విరామమిచ్చి స్వేద బిందువుల తడి ఆరేవరకు కాఫీ కబుర్లాడి తదుపరి సమీక్షా సమావేశంలో మన గాయకుని గాత్రం నుండి వినిపించిన “మనం మొక్క నాటాలిరా” అనే పాటను విని వెంకట రత్నం గారి జై స్వచ్చ సుందర చల్లపల్లి నినాదంతో గొంతు కలిపి రేపు కలవవలసిన ప్రదేశం కూడా కళ్యాణ మండపం వద్దనే అనుకుని నిష్క్రమించారు.
ముత్యాల ముగ్గుల వేసే ఓ చెల్లెలు మీరు
మొక్కలను నాటండి మా తల్లులు
రతనాల రాశులు పోసే ఓ అన్నలూ మీరు
నరకొద్దు కొమ్మలు రెమ్మలు మాయన్నలు
- నందేటి శ్రీనివాస్
ప్రజాకళాకారుడు
22.06.2025
ఏమాశ్చర్యం! ఎంత విశేషం! – 6
చల్లపల్లి శ్రమ సంస్కృతి ఎలా రూపుదాల్చిందో –
ఎవరి కఠిన నిర్ణయాలు ఈ ఊరికి వరములో –
ఇన్ని మార్పు – లిన్నివసతులెవరి త్యాగ ఫలితములో –
అట్టి కష్టజీవులకె నా సాష్టాంగ ప్రణామములు!
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
లాస్ ఏంజల్స్ - USA
22.06.2025.