3508* వ రోజు .. ....           23-Jun-2025

 ఒకసారి మాత్రమే వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువుల వినియోగం మనకొద్దు!

పర్యావరణ పరిరక్షణే మనందరి కర్తవ్యమన్నమాట మరవద్దు!

23.06.2025 సోమవారం 3508* వ రోజు నాటి  స్వచ్చోద్యమ సిత్రాలు!

         హైవే రోడ్ పై తెల్లవారుజామున 14 మందితో స్వచ్ఛ సేవలు ప్రారంభమయి రోడ్ కి దిగువ భాగాన దట్టంగా పెరిగిన గడ్డిని తొలగించటం. సువర్ణ గన్నేరు, టెకోమారెడ్ అలాగే నీడనిచ్చు మొక్కలైన ఎర్రతురాయి, తెల్లమద్ది, పండ్ల మొక్కలైన సపోటా, మామిడి మొక్కల చుట్టూ ఉన్న గడ్డిని తొలగించి వాటి మధ్యలో ఉన్న తెల్ల దుబ్బులను కూడా తొలగించి మొక్కలు తొందరగా పెరగడానికి మార్గం సులభం చేశారు.

         అంతకుముందు కోసిన గడ్డి పోగులు, ఈరోజు శుభ్రం చెయ్యగా వచ్చిన గడ్డి పోగులను కొంతమంది ట్రాక్టర్ లో లోడ్ చెయ్యడం మొదలుపెట్టారు. అప్పటివరకు చేరుకున్న మొత్తం కార్యకర్తలు 30 మంది వారివారి పనిముట్లతో రోడ్ పొడవునా పూల మొక్కలు ఆకర్షణీయంగా కంటికి కనిపించేలాగున శుభ్రం చేశారు.

         6 గంటలు దాటి 10 నిమిషాలు ఆలస్యంగా విజిల్ మ్రోగినా కొంత మందిని పని విరమింపజేయడం కొంచెం కష్టం గానే అనిపించింది.

         కాఫీ సేవించిన పిదప సమీక్షలో వేముల శ్రీను గారు పలికిన జై స్వచ్ఛ సుందర చల్లపల్లి నినాదాలకు జై కొట్టి,

         రేపు మనం కలవవలసిన ప్రదేశం మరికొంచెం ముందర ఆసుపత్రి ఉందని తెలియజేసే సూచిక బోర్డు వద్ద అనుకుని నిష్క్రమించారు.

- నందేటి శ్రీనివాస్

   ప్రజాకళాకారుడు

  23.06.2025

 

        శ్రీశ్రీ పద్ధతిలో చెప్పాలంటే :

చల్లపల్లి శ్రమదానం ఒక మహత్తర కావ్యం

అసలిది కవిత్వం కాదు - వాస్తవ జీవితం!

సామాజిక వేత్తల స్వప్నం కాదు - ఆచరణలో ఋజువౌతున్న సత్యం!

చల్లపల్లి వీధుల్లో - మనుషుల్లో

మొలకెత్తజూస్తున్న సాత్విక సామాజిక విప్లవం!

గుర్తింపు సంక్షోభం (ఐడెంటిటీ క్రైసిస్) లో పడి

ప్రచారాల వెంట పరుగులు తీస్తున్న లోకంలో

స్వార్థం చెరసాలలో ముగుస్తున్నది నేటి జీవితం

ఎంత మాత్రమూ కాజాలదు మానవాళి ప్రగతి పథం!

(తరువాయి రేపు)

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

   లాస్ ఏంజల్స్ - USA

    23.06.2025.