ఒకసారి మాత్రమే వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువుల వినియోగం మనకొద్దు!
పర్యావరణ పరిరక్షణే మనందరి కర్తవ్యమన్నమాట మరవద్దు!
24.06.2025 మంగళవారం 3509* వ రోజు నాటి స్వచ్ఛ సేవల విశేషాలు!
హైవే రోడ్ లోని గంగులవారిపాలెం రోడ్ కు సమీపంలో తెల్లవారుజామున 4:13 నిమిషాలకు స్వచ్ఛ సేవలు ప్రారంభమయినవి.
మొక్కల వెలుపల, పాదుల చుట్టూ లోపల ఉన్న పిచ్చి గడ్డి, కలుపు మొక్కలను తొలగించే పని 13 మంది కార్యకర్తలతో ఈరోజు మొదలయింది.
రోడ్ క్రింది భాగంలో పెరిగిన గడ్డి, కలుపును ఒక కార్యకర్త కటింగ్ మిషన్ తో కత్తిరిస్తుండగా వెనుక మహిళా కార్యకర్తలు కత్తిరించిన గడ్డిని ప్రోగు చెయ్యడం అలాగే పాదుల లోపల కార్యకర్తలు లాగిన పిచ్చి మొక్కలను దంతులతో లాగి గుట్టగా పెట్టడం జరిగింది.
సన్నపాటి వర్షపు చినుకులు అప్పడప్పుడూ మీదపడుతూ చిరాకు కలిగిస్తున్నా మేం చెయ్యవలసిన పని చాలా ఉందంటూ కార్యకర్తలు దృష్టి మరల్చకుండా శ్రమించి రోడ్డు పొడవునా శుభ్రం చేయడం దారివెంట వచ్చే పోయేవారిని ఒకింత ఆశ్చర్యానికి గురి చేసింది.
6 గురు కార్యకర్తలు మాత్రం నిన్నటి రోజు ప్రభుత్వ అధికారులు నాటిన మామిడి మొక్కలకు సంరక్షణగా మొదట్లో మట్టి పోసి పాదులు చేయడం, ఆ తరువాత లోడింగ్ ప్రారంభించి చెత్తనంతా ట్రాక్టర్ లో లోడ్ చెయ్యడం వారి వెనుక ఊడ్చుకుంటూ శుభ్రం చెయ్యడం యధాప్రకారంగా జరిగింది.
హైవే రోడ్ లో పై నుంచి వేసిన 33 KV విద్యుత్ వైర్లకు ఉన్న ఒక టవర్ పైకి పురుడు కంప చుట్టు ముట్టి ఎగబాకగా తడిసిన ఇనుప టవర్ ప్రమాదమని తెలిసినా ఎంతో జాగ్రత్తగా 4 గురు కార్యకర్తలు ఆ కంపను లాగే క్రమంలో టవర్ లో కొంత భాగాన్ని ఎక్కి ఎట్టకేలకు ఆ పనిని సమర్ధవంతంగా శ్రేయస్కరంగా పూర్తిచేశారు. రోజు వారి వ్యవసాయ పనులు చేసే రైతు కూలీలు చేయని పనిని కార్యకర్తలు చేశారంటే వీరి దశాబ్దకాలపు పని అనుభవం ఓర్పు నేర్పు అని అంగీకరించక తప్పదు.
వర్షం మోతాదు కొంచెం పెరిగినప్పటికీ 6 గంటల వరకు పని చేస్తూనే ఉన్న 23 మంది కార్యకర్తలు పనికి విరామమిచ్చి కాఫీ సేవించిన పిదప సమీక్షలో మైకు లేకున్నా బిగ్గరగా ప్రతిధ్వనించిన కోడూరి వెంకటేశ్వరరావు గారి “జై స్వచ్ఛ సుందర చల్లపల్లి” నినాదంకు జై కొట్టడం.
ఆ తదుపరి డాక్టరు గారు మాట్లాడుతూ నిన్న MRO, MDO, EO గార్లు మొక్కలు నాటిన విషయాలను ముచ్చటించి,
రేపు మనం కలువవలసిన ప్రాంతం “కొంచెం ముందర అనగా ఈరోజు పని ముగిసిన ప్రదేశం” అనుకుని నిష్క్రమించిరి.
రామానగరం వాస్తవ్యులు తొట్టెంపూడి పెదబాబు గారి కుమార్తె శ్రావ్య, అల్లుడు పోపూరు విష్ణువర్ధన్ గార్ల కుమార్తె “అక్షర” మొదటి పుట్టినరోజు సందర్భంగా స్వచ్చోద్యమ ఖర్చుల నిమిత్తం 5,000/- రూపాయలను విరాళంగా ఇచ్చారు. వీరికి స్వచ్ఛ కార్యకర్తలందరి తరపున ధన్యవాదములు.
చల్లపల్లిలో 10 సంవత్సరాలుగా జరిగే “స్వచ్ఛ సుందర చల్లపల్లి” గురించి తెలుసుకుని కంకిపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ J. మురళీకృష్ణ గారు, కంకిపాడు SI సందీప్ గారు చల్లపల్లిని సందర్శించారు.
స్వచ్ఛ చల్లపల్లి ఉద్యమ విశేషాలను Power Point Presentation, వీడియో రూపంలో డా. DRK.ప్రసాదు గారు వివరించడం జరిగినది.
చెట్టూ చెట్టమ్మను నేను
ఎండ వానకూ గొడుగును నేనై నీతోనే ఉంటా
గొడ్డు గోదల ఆకలి తీర్చి నీడై కాసుంటా
అక్కర లేని కాలుష్యాన్ని కడుపులోన దాస్తా
ప్రకృతి ఒడిలో కమ్మని వాసన పరిమళాలు ఇస్తా..
- నందేటి శ్రీనివాస్
ప్రజాకళాకారుడు
24.06.2025
(నిన్నటి తరువాయి) –
ఓ చల్లపల్లి స్వచ్ఛ కార్మికుడా!
చీకటి వేకువ సేవా నిరతిలో
నీ కనులలో మెరుస్తున్న దీక్ష భవిష్యత్ మహా కావ్యం!
ఆ అంధకారంలో - మురికి బట్టల్లో నీవొక ఉదయ సూర్యబింబం!
ఎండనక - వాననక పదేళ్లుగా ఊరి మురికిని కడిగే నీ తపస్సు
నీ చల్లపల్లి గ్రామానికొక క్రొత్త తేజస్సు!
బడలిన నీదేహం నుండి కారుతున్న నీ చెమట చుక్కలు,
వీధుల్ని స్వచ్ఛ – శుభ్ర - సుందరం చేస్తున్న నీ క్రతువులు
ఇకపై లక్షల గ్రామాలు పయనించదగిన తెరువులు!
30 వేల మొక్కలు పెంచుతున్న నీ ముందు చూపు
రేపటి తరాల మనుగడకొక ఊపు!
దేశ భవిత కొక పునాది!
ఆర్భాటాలు, అట్టహాసాలు లేని
నువ్వే రేపటి సమాజానికొక స్పూర్తివి
నీ దేశ భవితవ్యాన్ని తీర్చిదిద్దగల శక్తివి!
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
లాస్ ఏంజల్స్ - USA
24.06.2025.