ఒకసారి మాత్రమే వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువుల వినియోగం మనకొద్దు!
పర్యావరణ పరిరక్షణే మనందరి కర్తవ్యమన్నమాట మరవద్దు!
26.06.2025 గురువారం 3511* వ రోజు నాటి స్వచ్ఛ సేవల విశేషములు!
216 జాతీయ రహదారికి ఒక ప్రక్కన కొద్ది రోజులుగా జరుగుతున్న స్వచ్ఛ సేవలో భాగంగా ఈరోజు తెల్లవారుజామున 4:16 నిమిషాలకు 16 మందితో ప్రారంభమయిన స్వచ్ఛ సేవలు పూల మొక్కలలోని కలుపు గడ్డిని శుభ్రం చెయ్యడంలో నిమగ్నమవ్వడం, మరికొంత మంది కార్యకర్తలు పెట్టిన మొక్కలకు చుట్టూ కంపను తాడుతో సరి చేసి కట్టడం జరిగింది.
రోడ్ మార్జిన్ లో గడ్డిని మిషన్ తో కట్ చేయగా ఆ తుక్కును మహిళా కార్యకర్తలు కొంతమంది గొర్రులతో లాగి ప్రోగు చెయ్యడం జరిగింది. ఈ రోజు ప్రారంభం నుండే ఒకరిద్దరు మహిళామణులు కత్తులు చేతపట్టి కలుపు గడ్డిని కోసి పనిలో ముందున్నారు. చిన్నపాటి వర్షపు జల్లులు పడుతూ ఉన్నా సరే కార్యకర్తలు మాత్రం మా పని మాదే అన్నట్లుగా చెక్కు చెదరని విశ్వాసంతో ఆ ప్రాంతమంతా ఎంతో శుభ్రంగా తీర్చిదిద్దారు.
ఈ రోజు ఉదయం నుండే వర్షం పెరిగే పరిస్థితిని గమనించి ప్రతి ఒక్కరూ ఆయా పనులను విభజించుకొని సమయానికి లోడింగ్ చెయ్యడం జరిగింది.
అర్థరాత్రి నుండే కారు మబ్బులు కమ్మి వర్షపు ఛాయలు తరుముకొస్తున్న పరిస్థితులలో సైతం ఊరి స్వచ్ఛ శుభ్ర సౌందర్యం కోసం వారు నిర్దేశించుకున్న లక్ష్య సాధనకై ఆ సమయంలో కూడ 31 మందికి పైగా కార్యకర్తలు గ్రామం కొరకు పని చెయ్యడం స్వచ్ఛ చల్లపల్లి ఉద్యమ క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలకే సాధ్యం అయ్యింది.
6 గంటలవగానే సమయమయ్యిందని ఒకరికొకరు పిలుచుకుంటూ కాఫీలు సేవించే పనిలో పని ముచ్చట్లు చెప్పుకుంటూ ఒక మోస్తరు వర్షానికి తడిసిన బట్టలతో చలి క్రమ్మి సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.
“మట్టా మహాలక్షి” వర్షానికి అనువైన పాటలోని పల్లవి పాడి “జై స్వచ్చ సుందర చల్లపల్లి” నినాదం చెప్పగా అందరూ జై కొట్టి,
రేపు కలవవలసిన ప్రదేశం హైవే పై ఉన్న స్వాగతం ద్వారం వద్ద అనుకొని నిష్క్రమించారు.
చల్లపల్లిని స్వచ్ఛ చల్లపల్లిగ మార్చి
ప్రతిన బునిన కార్యకర్తలారా
పేడ పెంట చెత్త మురుగు ముళ్ళ పొదలనే
మీ చేతితో శుభ్రపరచిన ధన్య జీవులారా....!
- నందేటి శ్రీనివాస్
ప్రజాకళాకారుడు
26.06.2025
ఏమాశ్చర్యం! ఎంత విశేషం! – 8
స్వచ్యోద్యమ చల్లపల్లి సంగీతపు తరగతులను
సేవ పిదప డి.ఆర్.కె. చెప్పుచున్న పాఠాలను
ప్రకృతి ఉదయకాలంలో పరవశించు దృశ్యాలను
దర్శింపక - వినకుండుట ధర్మమ ఈ ఊరి ప్రజకు?
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
లాస్ ఏంజల్స్ - USA
26.06.2025