3513* వ రోజు . ....           28-Jun-2025

 ఒకసారి మాత్రమే వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువులు మనం వాడొద్దు!

కాలుష్యాన్ని పెంచి పర్యావరణానికి మనం హాని చెయ్యొద్దు !

28.06.2025 శనివారం 3513* వ రోజు నాటి శ్రమ జీవన సన్నివేశములు ! 

          216 జాతీయ రహదారిపై చల్లపల్లి ఊరి ప్రత్యేకతను చాటి  చెప్పే స్వాగత ద్వారం వద్దనే ఈ రోజు కూడా పని చేయ తలచి తెల్లవారు జామున 4.16 నిముషాలకు కంటి మీద కునుకు ప్రక్కన పెట్టి గ్రామ సేవకై అత్యధికంగా 23  మంది కార్యకర్తలతో పనులు ప్రారంభమైనవి. ప్రతి ఒకరూ వారి వారి సామర్ధ్యాలకు తగినట్లు గా చేసే పనికి అవసరమయిన పనిముట్లు చేతబట్టి స్వచ్ఛ సేవల రంగంలోకి ఉరకలెత్తే  ఉత్సాహంతో ముందడుగేశారు.

         నిన్న మిగిలిన నాలుగు మొక్కలకు పాదులు కట్టడం, మట్టి పోయడం కొందరైతే, బోదె  గట్టు పొడవూ మిగిలిన పనిని మిగతా వారు పూర్తి చేయగా, ఆ  దారినే 6 గంటల తరువాత అటుగా వెళ్ళే పోయే రైతులు, కార్యకర్తలు చేసిన పనిని చూచి ఈ పని ఇంత శుభ్రంగా అందంగా కూడా చేయవచ్చా? అని వారిలో వారే అనుకోవడం విశేషం.

         మరికొంత మంది గంగులవారిపాలెం రోడ్ లో ఆ మురుగు  కాల్వ వరకూ రోడ్డుకు దిగువ భాగమున పిచ్చి మొక్కలు, గడ్డిని లేకుండా చెయ్యడం, ఒక కార్యకర్త గడ్డి కోసే మిషన్ తో దారి ప్రక్క అటూ ఇటూ రెండు ప్రక్కలా మార్జిన్ లో గడ్డిని కట్ చేసిన పిదప, మహిళా కార్యకర్తలు చీపుళ్ళ తో ఆ దారిని శుభ్ర పరచగా “నా దారి పూల దారి” అన్నపాట గుర్తుకు వస్తుంది.

         వేకువనే ఆ  సమయంలో అంతమంది కలిసి పని చెయ్యడం ఒక చోట గుమి కూడడం, సమీక్షా సమావేశాలు నిర్వహించడం చూస్తుంటే ఆ దారిని పోయే ప్రయాణికులు, బాటసారులు ఈ వింత ఏమిటీ ? ఏమైనా గొడవలా? ఏమైనా ప్రమాదాలా! అసలు వీరు దేనికి సంబందించిన వారో తెలియక తర్జన బర్జన పడటం, తరువాత తెలుసుకుని ఆశ్చర్య పడటం వారి వంతవుతుంది.

         నేను  సైతం స్వచ్చ సుందర చల్లపల్లికి చెమట చుక్కలు ధార బోస్తాను, అంటూ పాల్గొంటున్న యువకులు, మధ్య వయస్కులు, వృద్ధులు, మహిళలు, ఉద్యోగులు, మేధావులు వేరు వేరు  భావాలు, వేరు వేరు బాధ్యతలు కలిగిన వారైనప్పటికీ వీరందరి గమ్యం చల్లపల్లిని స్వచ్చంగా – శుభ్రంగా - సుందరంగా తీర్చిదిద్దటం.  వీరి ఉన్నతమైన ఆచరణాత్మకమైన ఆలోచనలే చల్లపల్లికి ఒక ఆభరణం.

         6 గంటల వరకు విరామ మెరుగక పరిశ్రమించి సమయానికి విజిల్ మ్రోగగానే పనికి విరామమిచ్చి అందరూ కలిసి కాఫీ సేవిస్తూ పెళ్ళింట సందడి లాగ  ఒకరినొకరు నోరారా పలకరించుకొని  పని పాటల ముచ్చట్లాడుకొనుట  నిజంగానే అది ఒక అద్భుతమైన ఘట్టం.

         సమీక్షా సమావేశంలో ఆసుపత్రి సిబ్బంది లో ఒకరైన స్వచ్చ కార్యకర్త రమేష్ గారు పలికిన జై స్వచ్చ సుందర చల్లపల్లి నినాదాలను సాధిస్తాం సాధిస్తాం అంటూ గట్టిగా నొక్కి పలకడం, ఈ రోజు అందరూ హాజరు కావలసిన  స్వచ్చ కార్యకర్త దేసు మాధురి గారి ఆహ్వానంను గుర్తుచేసుకొని, రేపు  కలువవలసిన ప్రాంతం కూడ “హైవే లోని అందమైన చల్లపల్లి ప్రవేశ ద్వారం” వద్దనే అనుకొని ముగింపు పలికారు.

నా గృహాన్ని నేను కాక- మా వార్డు మెంబరు ఊడ్చి పోవాలా

బజారెక్కిన మురుగు కాల్వ – ముఖ్యమంత్రే బాగు చెయ్యాలా

మనకు మనమె  ఊరి కొరకై మహాత్కృషి సాధించనేలేమా

అందరొకటై ఉన్న ఊరిని – నందనంగా మార్చుకోలేమా!

- నందేటి శ్రీనివాస్

   ప్రజాకళాకారుడు

  28.06.2025

         ఏమాశ్చర్యం! ఎంత విశేషం! –10

తన నగలు అమ్మి గ్రామ వీధి సొగసులు పెంచే పని,

ఊరి సమస్యలకు వైద్య ద్వయం చికిత్స చేస్తున్న కృషి,

సామాజిక సంక్షేమం సాధించుట వంటివి

చరిత్రలో ఎపుడొ గాని సంభవించ విట్టివి!

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

   లాస్ ఏంజల్స్ - USA

    28.06.2025