3515* వ రోజు . ....           30-Jun-2025

 ఒకసారి మాత్రమే వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువుల వాడకం మానేద్దామని నినదిద్దాం!

30.06.2025 సోమవారం 3515* వ రోజు శ్రమదాన విశేషాలు!

          నేటి ఉదయం 216 జాతీయ రహదారిపై స్వచ్ఛ చల్లపల్లి స్వాగత ద్వారం వద్ద నుండి రామానగరం వైపుగా రహదారి ప్రక్కన చిన్నపాటి వర్షపు చినుకులు పడుతున్న సమయంలో  శ్రమలో మొట్టమొదటిగా 4:17 నిమిషాలకు పాల్గొన్నది 10 మంది కార్యకర్తలు. తర్వాత్తర్వాత నిదానంగా వచ్చి చేరినది 13 మంది. మొత్తంగా ఈరోజు శ్రమదానంలో పాల్గొన్న కార్యకర్తలు 23 మంది.

         హైవే కి ఉత్తరం వైపున రోడ్డుకు దిగువ భాగంలో మొక్కల మధ్యలోని కలుపును, పిచ్చి చెట్లను, త్రాగిపారేసిన మద్యం సీసాలను తొలగించినది కొందరు కార్యకర్తలైతే, రోడ్డుకు ఎగువ భాగాన పెరిగిన పిచ్చి గడ్డిని మిషన్ తో కట్ చేసినది ఒక కార్యకర్తైతే దాని వెంట గుట్టలుగా దంతులతో, చీపుళ్ళతో ప్రోగు చేసినది మరికొంతమంది కార్యకర్తలు.

         ఇలా కొంతభాగం వరకు శుభ్రం చేసిన తరువాత సుమారు 5:30 నుండి 6:00 గంటల వరకు ప్రోగేసిన గుట్టలను ట్రాక్టర్ లోనికి లోడ్ చేయడం జరిగింది.

         6 గంటల తర్వాత విజిల్ మ్రోగగానే కార్యకర్తలంతా కాఫీ సేవించిన తదుపరి జరిగిన సమీక్షావేశంలో పాల్గొని ఈరోజు జరిగిన కార్యక్రమాన్ని నెమరువేసుకుని, కస్తూరి శ్రీనివాస్ చెప్పిన నినాదాలకు బదులిచ్చి,   

         రేపటి కార్యక్రమం నేటి పని ముగింపు వద్ద నుండే అని తెలుసుకుని నిష్క్రమించడం జరిగినది.       

- డా.డి.ఆర్.కె.ప్రసాదు

  30.06.2025

         

         చిట్ట చివరికి గొప్ప వ్యసనము!

గ్రామమునకొక స్వచ్ఛ సుందర కార్యకర్తగ మారుటనగా

ఎంత సులభమొ అంత కష్టము ఎంత లాభమొ అంత నష్టము

తలచుకొంటే చిన్న పని అది బాధపడితే మంచి పని అది

పోనుపోనూ చాల మధురము చిట్ట చివరికి గొప్ప వ్యసనము!

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

   లాస్ ఏంజల్స్ - USA

    30.06.2025