3516* వ రోజు . ....           01-Jul-2025

 ఒకసారి మాత్రమే వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువుల వాడకం మానేద్దామని నినదిద్దాం!

01.07.2025 మంగళవారం 3516* వ రోజు స్వచ్ఛ సేవల విశేషాలు!

          తెల్లవారుజాము 4:15 నిమిషాలకు జాతీయరహదారిపై చల్లపల్లి ప్రవేశం ద్వారం దగ్గర నుండి ఈరోజు పని 14 మందితో ప్రారంభమయినది. రహదారికి ప్రక్కనే ఉన్న గద్దగోరు మొక్కల చుట్టూ కలుపు తీసి, మొక్కలు ఏపుగా పెరగటానికి వీలు కల్పించారు. రహదారికి క్రింది భాగంలో అక్కడ ఉన్న గడ్డిని కటింగ్ మిషన్ తో కట్ చేసి ఎంతో అందంగా ఆ ప్రాంతాన్ని తయారుచేశారు.

         మరికొద్దిమంది కార్యకర్తలు మాత్రం స్వాగతద్వారానికి అవతల వైపు కొంత దూరం నుండి అక్కడక్కడ 17 మొక్కలను నాటి పాదు చేయడం జరిగింది. రోడ్డుకు అవతలి వైపు 2 సంవత్సరాల క్రితం నాటిన సువర్ణ గన్నేరు మొక్కలు గుత్తులుగుత్తులుగా పూలతో నిండి పసుపు పూల కాంతులీనుతున్నాయి.

         6 గంటల వరకు ఊరికోసం 2 గంటల పాటు విరామమెరుగక శ్రమించిన 29 మంది కార్యకర్తలు విజిల్ మ్రోగేసరికి పనిముట్లు సర్దుకుని కాఫీ విరామ సమయాన్ని కొద్దిసేపు ముచ్చట్లతో గడిపి డా.వరప్రసాద్ (చిన్న డాక్టరు) గారు చెప్పిన జై స్వచ్ఛ సుందర చల్లపల్లినినాదంతో సాధిస్తాం సాధిస్తాంఅంటూ శపధం చేసి,

         రేపు కలవవలసిన ప్రదేశం కూడా ఇక్కడే (ఈరోజు ఆగిన చోటు) అనుకుని నిష్క్రమించారు.

         వినరా వినరా నరుడా

కల్లాకపటం ఎరుగని కార్యకర్తనూ నేనూ

ఊరి బాగుకొరకు స్వచ్ఛ సేవ చేస్తున్నాను

చెత్త మురుగు ప్లాస్టిక్ పై యుద్ధం చేస్తున్నాను

స్వచ్ఛ చల్లపల్లికి నేనంకితమై ఉన్నాను...

- నందేటి శ్రీనివాస్

   ప్రజాకళాకారుడు

   01.07.2025

 

అనుభూతుల పరంపరలె

బురదలోన కాళ్లు దించి మురుగు పనులు చేయునపుడు

ఆయాసమె కలిగిందో ఆనందమె మిగిలెనో

చిమ్మ చీకటిలో వీధి చక్కదిద్దునప్పుడు

అనుభూతుల పరంపరలె అమూల్యములు ఇప్పుడు!

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

   లాస్ ఏంజల్స్ - USA

    01.07.2025