ఒకసారికి మాత్రమే వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువులను మనం వాడటం ఆపేద్దాం!
05.07.2025 శనివారం 3520* వ రోజు స్వచ్ఛ సేవా కార్యములు!
వేకువ జామున 4:16 నిమిషాలకు హైవే పై గంగులవారిపాలెం సమీపంలోని వంతెన వద్ద 18 మంది కార్యకర్తలు నిన్నటి పనికి కొనసాగింపుగా రోడ్డు దిగువ భాగాన ఉన్న పెద్ద పెద్ద జిల్లేడు చెట్లు మొదళ్ళ నుండి తీసివేయడం, పెద్ద మొక్కల చుట్టూ కలుపు గడ్డిని బాగు చెయ్యడం జరిగింది.
కొద్దిమంది మహిళా కార్యకర్తలు కలిసి దారికి అంచున ఉన్న పూల మొక్కల చుట్టూ కలుపు, పిచ్చి మొక్కలు తీసి రహదారి మార్జిన్ లోని గడ్డిని సమానంగా కత్తులతోనే కోయడం జరిగింది. రోడ్ మార్జిన్ నుండి క్రింది మొక్కల వరకు ఏటవాలుగా ఉండి నిలబడటానికి వీలులేని ప్రదేశంలో పర్వతారోహకుల వలె ఎంతో నైపుణ్యంతో జాగ్రత్తగా నిలబడి పని చేయడం ఒక సవాల్ గా మారింది.
మరికొంతమంది పెద్ద మొక్కలను వర్షం, గాలి నుండి కాపాడడానికి మొదట్లో మట్టి పోసి కర్ర కట్టి వాటిని పర్యవేక్షిస్తున్నారు. చల్లపల్లి ప్రవేశ ద్వారం నుండి క్లబ్ రోడ్ (బందర్ వైపు) వరకు ఇంకా ఎన్ని మొక్కలు నాటవలసి ఉన్నదో గుర్తించి ఒక రోజు మొక్కలు నాటే కార్యక్రమానికి సమాయత్తమవుతున్నారు.
33 మంది కార్యకర్తలు 6 గంటల వరకూ నిర్విరామంగా శ్రమించి సమయానికి విజిల్ మ్రోగగానే పనికి విరామమిచ్చి కాఫీ సేవించిన తదుపరి సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.
ఆసుపత్రి సిబ్బందిలో ఒకరైన స్వచ్ఛ కార్యకర్త పండలనేని కనకదుర్గ చెప్పిన “జై స్వచ్ఛ సుందర చల్లపల్లి” నినాదంతో గొంతు కలిపి,
రేపు కలవవలసిన ప్రదేశం ఈ వంతెన వద్దే అనుకుని నిష్క్రమించారు.
- నందేటి శ్రీనివాస్
ప్రజాకళాకారుడు
05.07.2025
మంచి పక్షులు ఇచట చేరును
ఇది సదుద్యమ మనుకొనినచో ఎవరి కీర్తి కిరీటమో
ఎవరి కోసం ఎవరు చేసే ఈ నిరంతర యజ్ఞమో
ఎక్కడెక్కడి మంచి పక్షులు ఇచట చేరును సేవకై
కీర్తికో ధనతృష్ణ కొరకో ఆర్తి లేదసలిక్కడ!
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
లాస్ ఏంజల్స్ - USA
05.07.2025